Wednesday, July 11, 2012

ఇవీ సంగతులు..


ఈ బ్లాగ్ లో పోస్ట్ చేసి రెండు నెలల పైనే అయింది..2012  ఈ మధ్యే మొదలయ్యింది అనుకుంటూనే వున్నాను..అప్పుడే సగం ఏడాది గడిచిపోయింది.అలానే నా జీవితంలో కూడా ఒక ఆరు నెలలు గడిచిపోయాయి..జనవరి నుండి మార్చ్ దాక బోల్డన్ని పుస్తకాలు చదివి కొంచెం సమయం అయినా సద్వినియోగం చేసాను కానీ ఏప్రిల్ నుండి జూన్ దాకా దాదాపు మూడు నెలలు ఉత్తినే కాలం గడిపేశాను.వచ్చే పోయే చుట్టాలు, ఎన్నికల హడావుడి,కొత్త ఇంటి పనులు,functions , ప్రయాణాలు, పండు గాడి సెలవులు, తర్వాత స్కూల్ తెరిచాక వాడి పనులతో అయిపొయింది. జూలై, ఆగష్టు నెలలో కూడా బోల్డన్ని పనులున్నాయి..కానీ మరీ ఈ బ్లాగ్ లో ఏమీ రాయలేనంత బిజీ గా లేను అందుకే కొన్ని కబుర్లయినా చెప్పుకుందామని వచ్చాను..

ఉపఎన్నికల హడావుడి అంతా మా ఇంట్లో కనిపించింది ఈ సారి. చంద్రబాబు నాయుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చారు. మా ఇంటికి కూడా వచ్చారు. మా అన్నయ్య (కజిన్) తెదేపా కన్వీనర్. అందుకే వచ్చారు. నేనూ, అమ్మ, పండు గాడు పోలో మంటూ ఊరికి వెళ్లాం ఆయన్ను చూడటానికి. చూసాం, మాట్లాడాం, ఫోటోలు దిగాం. మరో వేపు మా ఆయన, మామగారు కాంగ్రెస్ పార్టీ కి బాగా ప్రచారం చేసారు. రెండు పార్టీలూ ఓడిపోయాయి అనుకోండి.ఈ ఎన్నికల ప్రచారం, వ్యూహాలు అన్నీ దగ్గర నుండి చూడటం కుదిరింది ఈ సారి నాకు :)

మా కొత్త అపార్ట్మెంట్ వర్క్ పూర్తి కావొచ్చింది. మా అయన ఇండియా వచ్చాక మొదలు పెట్టిన ఫస్ట్ venture (తానొక్కడే చేసింది) ఇది...బాగా వచ్చింది :) ఇంకో నెలలో సొంత గూటికి వెళ్ళిపోతాం. మార్చ్ నుండి పని కుంటి నడకలా సాగుతోంది. Inverter కొత్త ఇంటికి వెళ్ళాక పెట్టించుకోవచ్చులే అని ఒక చచ్చు ఆలోచన చేసి ఈ ఎండాకాలం అంతా కరెంటు కష్టాలు పడ్డాము. అప్పుడప్పుడూ అయినా మొగుడి మాట వినాలి అని అందరూ నన్ను తిట్టేది అందుకే :( మార్చ్ లో గృహప్రవేశం, జూన్ లో సత్యనారాయణ స్వామి పూజ అయ్యాయి.

పండు గాడు ఈ సెలవుల్లో నన్ను అస్సలు విసిగించలేదు. ఆయా వచ్చేది రెండు పూటలా. అయితే వాడి వాగుడు మాత్రం ఎక్కువయ్యింది. విన్న అందరూ వాడిని సుత్తి వీరభద్ర రావు అని పోల్చడం మొదలు పెట్టారు. ఎందుకూ, ఏమిటీ, ఎలా? వాన ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది, మబ్బుల్లోకి నీళ్ళు ఎలా వెళ్ళాయి? ఇలాంటివి బోలెడు విషయాలు అడిగి తెల్సుకున్నాడు. మాటల వరకే ఈ తెలివితేటలన్నీ. చదువు విషయానికొస్తే మాత్రం గుడ్డు సున్నానే. అయితే ఆటలు, లేకపోతే మాటలు, అప్పుడప్పుడూ పాటలు...నాటు భాషలో చెప్పాలంటే అచ్చోసిన ఆంబోతులా గాలి గాడిలా తిని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు..బలవంతంగా కూర్చోపెట్టి ఏమయినా చెప్పాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు నాకు...కాకపోతే చుట్టూ ఉన్న వీడి వయసు పిల్లలు అక్షరాలు దిద్దుతుంటే ఆశ్చర్యంగా వుంటుంది, ఎలా కుదురు గా నేర్చుకుంటున్నారు అనిపిస్తోంది.. వీడిని చూసిన వాళ్ళు మాత్రం "వాళ్ళ నాన్న లాగా తెలివిగలవాడు, ఎలా అయినా బ్రతికేస్తాడు... నీలాగా పుస్తకాలు చదివి, ఊహల్లో తేలుతూ ప్రపంచం గురించి తెల్సుకోడులే, అదే వాడికీ మంచిది" అని సర్దిచేప్తున్నారు. చూద్దాం ఏదో రోజు వీడికి కుదురు రాకపోతుందా, చదువుకోక పోతాడా అని ఎదురు చూస్తున్నా. జూన్ లో స్కూల్ లో చేర్చాను. ఇంతకు ముందు వెళ్ళిన స్కూల్ లోనే ప్లే క్లాసు లో చేర్చాను. స్కూల్ కి వెళ్ళేప్పుడు ఎప్పుడూ పేచీ లేదు..అలానే ఈ సంవత్సరం కూడా సంతోషంగానే వెళ్తున్నాడు. పొద్దున్న ఆరు నుండి తొమ్మిది దాకా కథాకళి కార్యక్రమం నడుస్తుంది ఇంట్లో. వాడిని లేపి, పాలు తాగించి, టిఫిన్ తినిపించి, స్నానం చేయించి, రెడీ చేసి, మళ్ళీ బ్రేక్ లో తినడానికి మరో టిఫిన్ చేసి ఇంట్లో నుండి బయటకి పంపేసరికి తొమ్మిది. మళ్ళీ పన్నెండున్నర కి హాజరు. వీడికి ఫుల్ డే స్కూల్ మొదలవ్వాలంటే ఇంకా రెండేళ్ళు పడుతుందిట :( స్కూల్ లో ఈ మధ్య క్లాసు లో కొంచెం సేపు కుదురుగా కూర్చుని టీచర్ చెప్పేది వింటున్నాడని అన్నారు. పోయిన ఏడాది అయితే ఇదీ లేదు. స్కూల్ అంటే ఇసుక లో ఆటలు, పక్షులతో ఆటలు, కారాట, స్కేటింగ్, పెయింటింగ్ మాత్రమే. ఈ రోజు నుండి అయ్యగారికి హోం వర్క్ కూడా ఇస్తున్నారు (కలరింగ్, ఇంగ్లీష్ అక్షరాలని గుర్తుపట్టి సర్కిల్ చెయ్యడం, క్రాఫ్ట్ వర్క్..ఈ మూడిటిలో ఏదో ఒకటి ఇస్తారు)..తిండి విషయంలో మాత్రం కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు...అయితే physical activity దానికి తగ్గట్టు పెరగటం తో బరువు పెరగట్లేదు...ఒక కిలో under weight వున్నాడు..

జూన్ లో నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరిని కలిసాను..శ్రీరామ్ వాళ్ళ పాప మొదటి పుట్టినరోజుకి వాళ్ళ ఊరు తుని కి వెళ్లాను. తన పెళ్ళికి కూడా వెళ్ళలేదు (పండు గాడు పొట్టలో వున్నాడప్పుడు)...మొత్తానికి ఐదేళ్ళ తర్వాత తనని కలిసాను...చాలా చాలా సంతోషపడ్డాను..పాప అయితే ఒక్క సారి నన్ను చూపించి అత్త అని పరిచయం చేయగానే ఇక అత్త అత్త అంటూ ఒకటే పిలవడం..ఎంత ముద్దొచ్చేసిందో..తుని నుండి వస్తూ దార్లో రాజమండ్రి లో ఉంటున్న జ్యోతి దగ్గరకి వెళ్లి ఒక రోజు ఉండి వచ్చాను...చాలా ఏళ్ళకి కాలేజీ ఫ్రెండ్స్ ని కలుసుకోడం భలే బాగా అనిపించింది..వచ్చే నెల నా ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ప్రణతి దుబాయ్ నుండి వస్తోంది..నా దగ్గర నాలుగు రోజులు వుంటానంది. ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ నేను :)

మా ఆయనకి కొత్త వర్క్ వచ్చింది..సిమెంట్, స్టీల్, ఇసుక , కంకర తప్ప మరో ఊసు లేదు..సినిమాలకి కూడా తీసుకెళ్ళే తీరిక ఉండట్లేదు..పొద్దున్న తొమ్మిదికి వెళ్తే రాత్రి తొమ్మిదికి ఇల్లు చేరుతున్నాడు (మధ్యలో లంచ్ కి ఒక ఇరవయ్ నిమిషాలు వస్తాడు)...అక్టోబర్ కి కొంచెం ఫ్రీ అవుతాను, పండు గాడి దసరా సెలవులకి ఎటయినా వెళ్దాం అంటున్నాడు కానీ నాకు సందేహమే..ఒక వేళ తనకి తీసుకెళ్ళడం కుదరకపోతే పిల్లాడిని తనకి వదిలేసి నేనొక్కదాన్నే వెళ్ళిపోతా అని బెదిరిస్తున్నా ;)

అమ్మమ్మ కి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో చేర్చాము.తీవ్రమయిన gastroentitis. తన వయసు రీత్యా కోలుకోడానికి ఎక్కువ టైం పడుతోంది..ఇంకా హాస్పిటల్ లోనే ఉంది...చాలా డల్ అయిపొయింది :( మామయ్య, పెద్ది ఇక్కడే (మా ఊర్లోనే) వున్నారు..అమ్మ, నేను, వాళ్ళిద్దరూ కల్సి మేనేజ్ చేస్తున్నాము..అమ్మ, మామయ్య ఎంత చేసినా విసుక్కున్న అమ్మమ్మ పెద్ది ని చూడగానే చెంగున లేచి కూర్చుంది...ఎంతయినా పెద్ద కూతురు, తెలివి గల కూతురు, ముద్దుల కూతురు కదా అంటూ అమ్మ తెగ కుళ్ళు కుంటోంది...

ఈ నెలాఖరుకి కజిన్ వైఫ్ నోములనీ, వచ్చే నెలలో నా చిన్నప్పటి ఫ్రెండ్ పవన్ పెళ్లి అని, ఇంకా రెండు మూడు functions తో  మళ్ళీ బోల్డంత తిరుగుడు ఉంది..ఈ సందట్లో ఇల్లు మారడం, furniture షాపింగ్ ఇదంతా కూడా ఉంది..ఉద్యోగం, సద్యోగం లేకపోయినా క్షణం తీరిక లేని లైఫ్ అయిపొయింది..ఇక నేనేం ఉద్యోగం చెయ్యగలనో నాకు అర్ధం కావట్లేదు..ఉద్యోగం లో ఎప్పుడు చేరతావ్ అని కొందరు అడుగుతోంటే చచ్చే అంత విసుగ్గా ఉంది...అదేమయినా చెట్లకి కాస్తోందా? పిల్లాడిని మధ్యాహ్నం ఎవరికి అప్పగించాలి (ఆయా మీద వదిలెయ్యడం నాకు ఇష్టం లేదు), అయినా నాకు నచ్చే ఉద్యోగం దొరకాలి, ఆ ఉద్యోగం ఇచ్చే వాడికి నేను నచ్చాలి....ఇదంతా అడిగే వాళ్లకి ఎందుకు అర్ధం కాదో మరి....పక్క వాళ్ళ లైఫ్ గురించి ఎందుకు ఇంత ఉత్సుకత?

ఇంటి పనుల మీద విపరీతమయిన శ్రద్ధ కనబరుస్తున్నాను..అందరూ అనేదేంటంటే నాకు చేయడానికి పనేమీ లేక ఉన్న శక్తి, సమయం అంతా ఇల్లు శుభ్రంగా వుంచటం మీదే ఉపయోగిస్తూ ఒకరకమయిన obsession కి లోనవుతున్నానని..నిజమేనేమో మరి..ఏదయినా కొత్త పనిలో పడి మనసు మళ్ళించాలి..

ఆరోగ్యమయిన తిండి తినడం లో ఉత్సాహం చూపిస్తున్నాను కానీ exercise చెయ్యటంలో చూపించట్లేదు..అందుకే Gym లో చేరాలనుకుంటున్నా..అక్కడయితే పక్కవాళ్ళని చూసి అయినా కొంత motivate అవుతానేమో అన్న ఆశ..

   ఇండియాలో లైఫ్ ఇంత బిజీ గా ఉంటుందని ఊహించనే లేదు..కొత్త ఇంటికి వెళ్ళాక అయినా కొంచెం సర్దుకుని ఒక రొటీన్ లో పడాలి....ఎంత వరకూ చేస్తానో మరి..మొత్తానికి కాల చక్రం గిర్రు గిర్రు మని స్పీడ్ గా తిరిగిపోతుండటం తో సంతోషమయినా, బాధ అయినా ఏదీ ఎక్కువ సేపు నిలవట్లేదు..Emotional outbursts కి తీరిక, అవకాశం ఉండట్లేదు..చాలా విషయాలకి స్పందించడం కూడా మానేసాను..ఇది మంచికో, చెడుకో కాలమే చెప్తుంది నాకు :)

Friday, April 27, 2012

మాకూ ఒక డిగ్రీ కావాలి



బయట చేసే ఏ ఉద్యోగానికి అప్లై చేయాలన్నా దానికి సంబందించిన డిగ్రీ/experience వుండి తీరాలి (కొన్ని రకాల లేబర్ వర్క్స్ కి తప్ప). ఈ ఉద్యోగాలు చేస్తే జీతం వస్తుంది, పెర్ఫార్మన్స్ బాగుంటే ప్రశంసలు, పదోన్నతులూ కూడా వుంటాయి. సంఘంలో ఒక గుర్తింపు వస్తుంది. రోజులో కొంత భాగం మాత్రమే కేటాయించి ఈ ఉద్యోగాలు చేస్తారు. కానీ రోజు మొత్తం లో సగ భాగం, అవసరం బట్టి మిగతా సగ భాగం కూడా డ్యూటీ లోనే గడిపేసే గృహిణి ఉద్యోగానికి మాత్రం ఎలాంటి అర్హత వుండక్కర్లేదు, అవసరమే అన్నీ నేర్పిస్తుంది అన్న సూక్తి ప్రకారం గడిచిపోతుంది. జీతం వుండదు (భర్త తమకి అందించే పోషణ నే జీతం అనుకుంటే తప్ప). ప్రశంసలు కూడా తక్కువే (విమర్శలతో పోలిస్తే). ఇక పదోన్నతుల గురించి చెప్పనే అక్కర్లేదు (ఒక సారి ఈ రోల్ కి కమిట్ అయ్యామా, చావో, అనారోగ్యమో వస్తే తప్ప విముక్తి వుండదు).

ఇవన్నీ పక్కన పెడితే, అసలు ఈ పని చేయడానికి కావాల్సిన అర్హత లేమిటి అని ఎవరూ ఎందుకు ఆలోచించరు? అంట్లు తోమడం, బట్టలుతకడం, ఇల్లు శుభ్రం చెయ్యడం లాంటి పనులు ఎలాగోలా నేర్చుకోగలము. ఆఖరికి వంట కూడా కిందా మీదా పడి, అమ్మనో, అత్తగారినో అడిగి, వాళ్ళ చేత చివాట్లు తిని నేర్చుకోగలము. కానీ fuse పోతే ఎలా మార్చాలి, ప్లంబింగ్ వర్క్, తాపీ పని, కుట్టు పని, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ పనులు, ఇంకా పని మనుషులతో పని చేయించే techniques తెల్సి వుండటం - ఇలాంటివి ఎన్నో వుంటాయి గృహిణి చెయ్యాల్సిన పనుల లిస్టు లో. ఇలాంటి పనులు రాకపోతే ఇల్లు ఇల్లులా వుండదు.ప్రతి పనికీ వేరే వాళ్ళ మీద ఆధార పడటం చెయ్యాలి. ఇవన్నీ ఒకే చోట నేర్పిస్తే ఎంత బాగుంటుందో కదా.

వంట పని, టైలరింగ్, చైల్డ్ కేర్ తో పాటు పైన చెప్పిన పనులు కూడా చేర్చి ఒక కోర్సు లా పెడితే ఎలా వుంటుందో అన్న ఆలోచన వచ్చింది నాకు :P

Question bank

అతడు సినిమా లో గిరిబాబు కి ఒక డైలాగ్ వుంటుంది 'కూతురిని ఇవ్వమంటే question బ్యాంకు ని ఎందుకిచ్చావు దేవుడా' అంటూ...ఇప్పుడు నా పరిస్థితి అలాగే వుంది :(

పండు గాడు ఇప్పుడు 'ఎందుకు, ఏమిటి, ఎలా' అనే phase లో వున్నాడు. చిన్న పిల్లలు ప్రశ్నలు అడగటం మామూలే. అందరూ సందేహాల పుట్టలే, మనం వాళ్ళ సందేహాలు తీర్చాలి కూడాను. కానీ వాడు సింపుల్ ప్రశ్నలు అడిగితే పర్లేదు, కానీ 'పెళ్లి ఎందుకు' , 'గాలి ఎక్కడ' లాంటి ప్రశ్నలకి ('శుభలగ్నం' లో AVS గుర్తుకొస్తున్నాడా?) వాడికి అర్ధమయ్యే రీతిలో ఎలాంటి సమాధానం చెప్పాలో నాకు తోచట్లేదు. అయ్యగారు 100 % కన్విన్స్/satisfy అవకపోతే మళ్ళీ అడుగుతారు 'అమ్మా, నాకు అర్ధం కాలేదు..మళ్ళీ చెప్పు' అని :(

ఈ మధ్య కొత్తగా టూ వీలర్ కొనుక్కున్నాను వీడినేసుకుని తిరగడానికి. ఇక షికారు తీసుకెల్లినప్పుడు రోడ్డు మీద ఏది కనిపించినా 'అది ఏమిటి, ఎందుకు అక్కడ వుంది' అనే ప్రశ్న వేస్తాడు. ఆఖరికి flexi బోర్డు కొంచెం చిరిగి వున్నా, dislocate అయి వున్నా కూడా అది ఎందుకు అలా అయిందో చెప్పాలి నేను. ఏ జంతువు కనిపించినా దాని పేరు, అది ఎక్కడ నుండి వచ్చిందో, అక్కడ ఎందుకు వుందో కూడా చెప్పాలి.

నాకు సమాధానాలు చెప్పడం కష్టంగా లేదు కానీ, వాడికి తగ్గ సమాధానం చెప్పాలంటేనే వెంటనే తట్టట్లేదు. అబద్ధం చెప్పలేను, అలా అని నిజాన్ని దాచలేను. నిజం చెప్తే వాడికి అర్ధం కాదు, అర్ధమయ్యే దాక నన్ను వదిలిపెట్టటం వుండదు. ఉదాహరణకి, ప్రతి గురువారం అయ్యగారిని సాయి బాబా గుడికి తీసుకెళ్ళి అక్కడ జరిగే 'పల్లకి సేవ' చూపించాలి. గుడి ముందు భిక్షగాళ్ళు వుంటారు కదా, అప్పుడు వాడి ప్రశ్నల పరంపర ఇలా సాగుతుంది,

పండు: "అమ్మా, వాళ్ళెవరు"
నేను: "పూర్ పీపుల్ నాన్నా"
పండు: "అంటే?"
నేను: "వాళ్లకి డబ్బులుండవు అమ్మా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తలా కొంచెం డబ్బిస్తే ఆ డబ్బుతో అన్నం కొనుక్కుని తింటారు" (వాళ్లకి అందరూ డబ్బులివ్వడం చూస్తుంటాడు)
పండు: "వాళ్ళ దగ్గర డబ్బులెందుకు వుండవు?"
నేను: "పూర్ పీపుల్ కదా వాళ్ళు, అందుకనే వుండవు"
పండు: "ఎందుకు వుండవు?"
నేను: %^*(+$%£

చాలా చిన్న ప్రశ్న "పేద వాళ్ళ దగ్గర డబ్బెందుకు వుండదు?" అని. ఒకవేళ నేను "వాళ్ళు చదువుకోలేదు, ఉద్యోగాలు చెయ్యలేరు, కాలో చెయ్యో విరిగి వుంటే పనులు చెయ్యలేరు. చదువో, పనో ఏదో ఒకటి తెల్సి ఉంటేనే ఉద్యోగం చేయనిస్తారు, అప్పుడే డబ్బులుంటాయి" అని చెప్తే "వాళ్ళెందుకు చదువుకోలేదు" అని అడుగుతాడు. "డబ్బు లేక" అంటే మళ్ళీ "ఎందుకు లేదు" అనే ప్రశ్న వస్తుంది. ఒకవేళ 'చదువంటే ఇష్టం లేక చదువుకోలేదు, లేదా చదువుకుంటే, పని నేర్చుకుంటే డబ్బులు సంపాదించొచ్చు అని తెలీక చదువుకోలేదు' అంటే మళ్ళీ అడుగుతాడు 'ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు తెలీదు' అంటూ. ఇలా ఒకటి కాదు, ఎన్నో విషయాల్లో వాడికి అర్ధమయ్యేలా సమాధానం చెప్పలేకపోతున్నాను.

ఇంత చిన్న వయసులోనే వాడి సందేహాలు తీర్చలేకపోతున్నానే, రేపు పెద్దయ్యాక ఏమేమి అడుగుతాడో, నేనేం చెప్పాలో తలచుకుంటే కొంచెం భయంగా ఉంటోంది.

అసలు "పెళ్ళెందుకు" అనే వాడి ప్రశ్నకి నేను చెప్పే సమాధానం "పెళ్లి కొడుకూ, పెళ్లి కూతురు ఒకరికి ఒకరు నచ్చారు, ఇద్దరూ కల్సి వుండాలనుకున్నారు, అలా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి" అని. ఇప్పటికి అయితే వాడు కన్విన్స్ అయినట్టే కనిపిస్తున్నాడు కానీ కొంచెం పెద్దయ్యాక "కల్సి ఉండాలంటే పెళ్ళెందుకు, ఊరికే ఉండొచ్చు కదా' అని అడిగితే నేనేం చెప్పాలో ఏంటో? నా భయాలన్నీ అర్ధరహితమేమో అని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడూ. మనం ఎలా పెరిగాము ఈ సందేహాలతో? చుట్టూ ఉన్న సమాజం లో నుండి సమాధానాలు వెతుక్కుంటూనే కదా..వాడూ అంతే అని సరిపెట్టుకోడం నాకెందుకు చేత కావట్లేదో?

Wednesday, March 21, 2012

గుత్తికొండ బిలము - మా పల్నాటి సాహస యాత్ర

ఈ పోస్ట్ రాయాలని రెండు నెలల నుండి అనుకుంటూనే వాయిదా వేస్తున్నాను. జనవరి లో విజయవాడ లో జరిగిన పుస్తక ప్రదర్శన కి వెళ్లి అక్కడి నుండి గుంటూరు లో వున్న మా అక్క (మేము అమ్ములు అంటాము) వాళ్ళింటికి వెళ్లాను. ఇక్కడ మా అమ్ములక్క గురించి కొంత చెప్పాలి. తను graduation లో హిస్టరీ మెయిన్ సబ్జెక్టు గా తీసుకుంది. వాళ్ళ పుస్తకాల్లో వున్న చరిత్ర పాఠాలన్నీ ఔపోసన పట్టేసి అప్పటి సామ్రాజ్యాల పట్ల, రాజులు, వాళ్ళు పాలించిన ప్రాంతాల పట్ల విపరీతమయిన ఆసక్తి పెంచుకుంది. ఏదయినా చారిత్రాత్మకమయిన ప్రదేశం దగ్గరలో వుంది అంటే చూడకుండా ఉండలేదు.పోయిన ఏడాది జూలై లో ఏదో ఫంక్షన్ కోసం మేమంతా బళ్లారి లో కలిస్తే అందరినీ పోగేసి హంపి కి తీసుకెళ్ళింది. మిగతా వారి మాట ఎలా వున్నా నాకు మాత్రం ఇలాంటి యాత్రలు నచ్చుతాయి. అంతకుముందోసారి గుంటూరు వెళ్ళినప్పుడు  చేబ్రోలు లో వున్న ప్రాచీనమయిన దేవాలయాలు అన్నీ తిప్పింది. భక్తి తో కాదు, అక్కడి శిల్ప కళలు అవీ చూడటానికి. ఇలా పురాతనమయిన ప్రదేశాలు చూసీ చూసీ, వాటిలో లీనమయిపోయి ఏదో రోజు చంద్రముఖి అవతారం ఎత్తుతుందేమో అన్న భయం కూడా కలుగుతోంది నాకీ మధ్యన.

సరే ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఈ సారి నాకు గుంటూరులో ఒక రోజు ఉండగలిగే అవకాశం కలిగింది మా అత్తగారి దయ వలన (పండు గాడిని ఆమె చూసుకుంది). ఉన్న ఒక్క రోజు ఎలా సద్వినియోగ పరుస్తుందో అనుకుంటూ వాళ్ళింట్లో అడుగుపెట్టాను. అప్పటికే ప్రణాళిక సిద్ధం చేసేసింది. ఈ సారి పల్నాడు ఏరియా చూసెయ్యాలి అని. అందులో ముఖ్యంగా గుత్తికొండ బిలం తప్పనిసరిగా చూడాలి అని చెప్పింది. ఏమిటి దాని విశేషం అంటే అప్పుడెప్పుడో పల్నాటి యుద్ధం జరిగాక విరక్తి చెందిన బ్రహ్మ నాయుడు తపస్సు చేసుకోడానికి ఆ బిలం లోనికి వెళ్లి ఇక తిరిగి రాలేదుట. అలా ఆ బిలం ప్రసిద్ధి చెందిందట. సరే అని మరుసటి రోజు పొద్దున్నే ఏడింటికి అద్దె కారు మాట్లాడుకుని నేను, అమ్ములక్క, నీల్స్ (వాళ్ళ అమ్మాయి) డ్రైవర్ తో బయల్దేరాము. గుంటూరు నుండి ఒక నలభయి నిమిషాలు ప్రయాణం చేసి చిలకలూరిపేట లో highway మీద ఉన్న ఒక హోటల్ లో వడ,సాంబార్ బాగుంటుందని (ఇది కూడా అక్కే చెప్పింది, ఇక్కడ మరో విషయం చెప్పాలి..తనకీ నాలాగానే విపరీతమయిన తిండి పిచ్చి, పుస్తకాల పిచ్చి, సినిమాల పిచ్చి వుంది..ఏ కొత్త ఊరేళ్ళినా అక్కడ  ఏ ఫుడ్ బాగుంటుందో కనుక్కుని, వెతుక్కుని వెళ్లి తింటాం మేము) అక్కడ ఆగి బ్రేక్-ఫాస్ట్ చేసాము. అక్కడి నుండి బయల్దేరి మరికొంత సేపు ప్రయాణం చేసి కోటప్ప కొండ చేరుకున్నాము. కొండ మీదకి వెళ్ళే రోడ్ చాలా బాగుండింది.కోటప్పకొండ లోని త్రికోటేస్వరాలయం లో దేవుని దర్శనం చేసుకుని బయటకొచ్చాము. గుళ్ళో కొనుక్కున్న ప్రసాదం తినాలనుకుంటే ఒక రౌడీ కోతి వచ్చి లాక్కుని వెళ్లిపోయింది. దాన్ని నాలుగు తిట్లు తిట్టుకుని మాచర్ల ప్రయాణమయ్యాము.

ఇక్కడి నుండి మా తిప్పలు మొదలయ్యాయి. గుత్తికొండ బిలము గురించి చాలా మందిని అడిగితే తెలీదు పొమ్మన్నారు. మాచర్ల చుట్టుపక్కల్లో అని ఖచ్చితంగా తెల్సు కాబట్టి అటువేపు ప్రయాణం సాగించాము. చివరికి వెతుక్కుని వెతుక్కుని గుత్తికొండ ఊరు చేరుకున్నాము.ఆ ఊర్లో ఒకరిద్దరిని అడిగితే తెలీదు పొమ్మన్నారు. ఉసూరుమంటూ ఊరు దాటి వెళ్లబోతుంటే పొలిమేర్ల లో ఒక గుంపులోని వ్యక్తి నాకు తెలుసు అని కొండ గుర్తులతో అడ్రస్ చెప్పాడు, "తిన్నగా వెళ్తే సాగర్ కుడికాలువ బ్రిడ్జి వస్తుంది. కాలువ గట్టున ఉన్న మట్టి రోడ్ వెంబడి పోతే ఒక డొంక తగులుతుంది. ఆ డొంక లో కొంత దూరం వెళ్తే కొండ వస్తుంది. అందులోనే మీరడిగే బిలము వుంటుంది" అని.  సాగర్ కుడికాలువ పక్కన ఉన్న మట్టి బాట పట్టాము. మిట్టమధ్యానం, జనవరి నెల అయినా మాడు మాడ్చేసే గుంటూరు జిల్లా ఎండలు. చుట్టూ చీమ చిటుక్కుమన్నా వినిపించే అంత నిశ్శబ్దం. ఒకవేపు కాలువ, మరో వేపు మిరప, వరి పంట పొలాలు. ఎంతదూరం వెళ్ళినా ఆ మనిషి చెప్పిన డొంక రాదే, సరిగ్గానే వెళ్తున్నామా అనుకుంటూ ఇంకా ముందుకి పోయాము. కనీ కనిపించకుండా, కార్ కూడా సరిగ్గా పట్టని ఒక డొంక కనిపించింది చివరికి. డ్రైవర్ ఏమో బిక్క ముఖం వేసాడు. "మేడం, కార్ లోపలికి అయితే వెళ్ళగలదు. కానీ కార్ కి అక్కడేదయినా ప్రాబ్లం వస్తే వెనక్కి తిరి రావాలంటే చాలా కష్టం అవుతుంది. మనుషులెవరూ తిరిగే ప్రదేశంలా లేదు ఇది. ఆడవాళ్ళు, అంత రిస్క్ అవసరమంటారా" అన్నాడు. హన్నా, ఎంత మాటన్నావు, ఇంత దూరం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు అని ముగ్గురం అతన్ని బయల్దేరదీసాం. చేసేదేం లేక ఆ డొంక లోనికి కార్ పోనిచ్చాడు. భీభత్సమయిన రోడ్డు, ఎగుడు దిగుడు బాట వెంబడి పడి ఒక మూడు, నాలుగు కిలోమీటర్ లు పోయాక ఒక కొండ కనిపించింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ కొండ పైకి వెళ్ళాము. అక్కడ నరసంచారం వున్నట్టు కనిపించలేదు. కానీ చిన్న షెడ్, మండపం, అందులో దేవుడి విగ్రహం కనిపించాయి. ఎవరో ఒకరు వుండకపోతారా అని వెతుక్కుంటూ వెళ్లాం. ఒక గడ్డం ఆసామి కనిపించాడు. హమ్మయ్య అనుకుని అతన్ని వివరాలు అడిగాము. మేము కరెక్ట్ గానే గుత్తికొండ బిలానికే చేరుకున్నామని తెల్సుకుని సంతోషించాము. ఇక్కడ ఆ బిలము/గుహ ఎక్కడుంది అని అడిగితే నాతో రండి అని ఒక వేపుకి దారి తీసాడు. అతని వాలకం చూస్తే అనుమానించదగిన విశేషం ఏమీ కనిపించకపోయినా ఎందుకయినా మంచిదని డ్రైవర్ ని వెంట రమ్మన్నాము. ఖర్మ రా బాబూ అనుకుంటూ మమ్మల్ని అనుసరించాడు ఇష్టం లేకపోయినా. ఆ గడ్డం ఆసామి తనతో పాటు పెద్ద టార్చ్ లైట్ తేవడం చూసి ఎందుకూ అని అడిగాము. గుహ లోపల కరెంటు వుండదు తల్లీ, చీకటి, గబ్బిలాలుంటాయి అని చెప్పడం తో నేను, నీల్స్ హడిలి పోయాము. బాబోయ్ మేము రాము అంటే మా అమ్ములక్క మమ్మల్ని తినేసేలా చూసి రావాల్సిందే అని పట్టుబట్టింది. సరే ఏదయితే అది అయింది అని గుహ లోనికి వెళ్లాం. పైన గబ్బిలాలు, కింద వాటి విసర్జితాలు (గుహ లో దేవుడి విగ్రహం వుంటుంది కాబట్టి చెప్పులు తీసేయించాడు). మెట్లు అంతా పాకుడు పట్టి అడుగేస్తే పాతాళానికి జార్చేసేలా వున్నాయి. Oxygen కూడా సరిగ్గా లేక ఒకటే దగ్గు, ఆయాసం వచ్చాయి. మొత్తానికి తక్కుతూ తారుతూ ఒక పావుగంట నడిచాక నీళ్ళ చప్పుడు వినిపించింది. ఆ వేపుగా కొంత దూరం నడిచాక వాగు కనిపించింది. లైట్ వెలుతురు లో ఆ నీళ్ళు ఎంత స్వచ్చంగా వున్నాయో చూసాము. కప్పలు, పాములు, చేపలూ ఏమీ ఉండవని చెప్తే ధైర్యంగా ఆ వాగులో దిగి కాళ్ళూ, చేతులూ, ముఖం కడుక్కుని గట్టున ఉన్న చెన్న కేశవ స్వామి కి ఒక దణ్ణం పెట్టుకుని, కొబ్బరికాయ కొట్టి వెనక్కి బయల్దేరాము. ఆ వాగు వెంబడి పోతే ఏమొస్తుంది అని ఆ గడ్డం ఆసామిని అడిగితే సింపుల్ గా "మీ చావొస్తుంది, వెళ్తారా" అని అడిగాడు. కికికి అని ఒక వెకిలి నవ్వోటి నవ్వుకుని అతని వెంట బయటకి వెళ్ళే దారి పట్టాము. తర్వాత అతనే చెప్పాడు, బ్రహ్మ నాయుడు ఆ వాగు వెంబడి వెళ్ళే అదృశ్యం అయ్యాడు, తర్వాత ఎవరూ అటు వేపు వెళ్ళలేదు అని. బయటకి వచ్చే దారిలో రెండు మూడు సార్లు నేను దారి తప్పబోవడం, అతను కేకలేసి వెనక్కి లాగడం జరిగాయి.

మొత్తానికి గుహ బయటకి రాగానే గాలి పీల్చుకున్నాం. అలా మొత్తానికి మా అమ్ములక్కకి ఉన్న చరిత్ర పిచ్చి వలన ఒక చిన్నపాటి సాహసం చేసి ఆ గుహ చూసి వచ్చాము. అక్కడ ఆ గడ్డం ఆసామి కి కొంత డబ్బిచ్చి అతనికి ఒక నమస్కారం చేసి అతను వండుకున్న పులిహోర కొంత అడుక్కు తిని (ఆకలి మండిపోతోంది అప్పటికి) తిరిగి ఆ డొంక వెంట పడి, మట్టి రోడ్డు ఎక్కి మాచర్ల వెళ్ళే దార్లో పడ్డాము. మాచర్ల కి ముందు ఒక చిన్న ఊరిలో వెలసిన ఒక దేవత వుండే గుడికి కూడా వెళ్లి దర్శనం
చేసుకుని అక్కడి నుండి మాచర్ల లోని చేన్నకేసవ స్వామి ఆలయానికి వెళ్ళాము. ఆ ఊర్లోనే ఒక హోటల్ లో భోంచేసి (సాయంత్రం నాలుగయినా మంచి భోజనమే దొరికింది మాకు). ఆ ఊర్లో  ఉన్న బ్రహ్మ నాయుడు, బాల చంద్రుడు, నాగమ్మ విగ్రహాలు చూసుకుంటూ, చరిత్ర నెమరేసుకుంటూ తిరుగు ప్రయాణమయ్యాము. అటు నుండి గుంటూరు వచ్చే దారి అంతా కోతకి వచ్చిన మిరప చేలతో కళకళ లాడిపోతూ ఉండింది. దార్లో సత్తెనపల్లి లో ఉన్న గడియారం సెంటర్ దగ్గర బెల్లం జిలేబీలు బాగా వేస్తారని తెల్సుకుని ఆ అడ్రస్ కోసం వెతికి, వేసారి దొరక్క బిక్క ముఖాలేసుని గుంటూరు చేరుకున్నాము.

ఈ గుహ, గబ్బిలాల కథ చెప్పి నా కొడుక్కి తర్వాత వారం పాటు సునాయాసంగా అన్నం తినిపించాను :) తర్వాత వాడికి బోర్ కొట్టేసి మళ్ళీ యథా స్థితికి వచ్చేసాడనుకోండి.


ఈ సంగతంతా విని మా ఆయన "నువ్విలాంటి పిచ్చి పనులన్నీ చేసి నీకేదయినా అయితే నా కొడుకేం కావాలి" అని గోల. అంటే తన బాధ నాకేదన్నా అవుతుందని కాదు, నేను పోతే నా కొడుక్కి కష్టం అని అన్నమాట :( ఇదో పెద్ద సాహసం కాకపోయినా తన దృష్టిలో నేను చెయ్యకూడని పనే. అసలు ఒంటరిగా ముగ్గురు ఆడవాళ్ళు ఎలా వెళ్ళారు అలాంటి చోటుకి అని ఒకటికి పది సార్లు అడిగాడు కూడా.

Friday, March 2, 2012

:(

పండు గాడికి ఈ సోమవారం నుండి ఒకటే జ్వరం. జలుబు, దగ్గు తో మొదలయ్యి జ్వరం వచ్చేసింది. 104 ,105 డిగ్రీల జ్వరం. నాకే ఎప్పుడూ ఇంత ఎక్కువ temperature రాలేదు.కొద్దిగా ఒళ్ళు వెచ్చబడితేనే నానా హంగామా చేస్తుంటా. అలాంటిది వీడి ఒళ్ళు పేలి పోతుంటే నాకు నరక యాతన గా వుంది. మామూలుగా చెంగు చెంగున గంతులేసే పిల్లాడు రోజులో మూడు నాలుగు సార్లు జ్వరం ఎక్కువయ్యి నా ఒళ్ళో వాలిపోతే పిచ్చెక్కినట్టు ఉంటోంది నాకు. జ్వరం తగ్గగానే పాపం మామూలుగా అల్లరి చెయ్యాలనే చూస్తున్నాడు.కానీ ఓపిక ఉండట్లేదు వాడికి. ఇంకా ఎన్ని రోజులు పడాలో వాడు ఇదంతా. ఒక స్వాములోరి దగ్గరకి వెళ్లి తాయత్తు కూడా కట్టించాను. Medicines సరే సరి. టానిక్ అంటేనే దూరంగా పరిగెత్తే వాడు ఇప్పుడు బుద్ధిగా తాగుతున్నాడు. తిండి మాత్రం ససేమిరా అంటున్నాడు. ఇక ఈ దెబ్బతో వాడి స్కూల్ anniversary , రాక్షసుడి వేషం అన్నీ కట్.

పిల్లల్లో resistance పెరగాలంటే కొంత suffer అవాలని అర్ధం చేసుకోగలను కానీ ఇంతలా ఎలా భరించగలరు వాళ్ళు అనిపిస్తుంది. వాళ్ళని అలా చూస్తూ కన్న వాళ్ళు పడే నరకం పగ వాడికి కూడా వద్దు అనిపిస్తుంది. భగవంతుడా, ఇక చాలు.

Wednesday, February 22, 2012

ఇస్కూలు పిలకాయ కబుర్లు


(టైటిల్ ఖదీర్ బాబు రాసిన 'ఇస్కూలు పిలకాయల కథ' ని చూసి మరీ అదే కాపీ కొడితే బాగోదని కొంచెం మార్చా, పైగా ఇది కథ కూడా కాదు, పండు గాడి స్కూల్ కబుర్లు)

పండు గాడిని నవంబర్ 2011 లో స్కూల్ లో చేర్చాను.అప్పటికి వాడికి రెండున్నర ఏళ్ళు కూడా లేవు. అందరూ లబో దిబోమన్నారు "ఇంత పసి గుడ్డు ని స్కూల్ లో వేస్తావా, ఇంట్లోనే కదా ఉంటావు, నీకు వాడిని చూసుకోడం అంత కష్టంగా ఉందా, వాడు అలిసిపోతాడు, స్ట్రెస్ ఎక్కువ వుంటుంది, అదీ ఇదీ" అని నా తల తినేశారు. అయితే నేను ఎవ్వరి మాటా పట్టించుకోలేదు. వాడు పుట్టాక వాడి తిండి, నిద్ర, activity , హెల్త్ విషయంలో 'Mother 's  instinct ' అనేది ఒకటి వుంటుంది, దాని ప్రకారమే నడుచుకోవాలి అని అర్ధం చేసుకుని నిర్ణయించుకున్నాను. ఇంట్లో ఉంచితే ఆయా తో పాటు బయట కాకిలా తిరగడం, వాళ్ళ భాష నేర్చుకోవడం తప్ప ఇంకేమీ రాదు. అదే స్కూల్ లో అయితే తోటి పిల్లలతో ఆడుకోవడం, ఒక రొటీన్ కి అలవాటు పడటం, తిండి విషయంలో పక్క పిల్లలని చూసి ఏమయినా ఇంప్రూవ్ అవడం ఇలాంటివి జరుగుతాయి కదా అని  వేరే ఆలోచనలు పెట్టుకోకుండా స్కూల్ లో చేర్చాను.

అయితే మేము సెలెక్ట్ చేసుకున్న స్కూల్ లో వీడిని చేర్చుకోడానికి వయసు సరిపోదన్నారు. వచ్చే జూన్ (2012 ) కి ప్లే క్లాసు లో చేర్చుకుంటాము అన్నారు. కానీ అప్పటి దాకా వీడిని ఇంట్లోనే వుంచటం నాకు ఇష్టం లేక వేరే స్కూల్ కోసం వెతికాను. కొంచెం దగ్గరలోనే ఒకటి దొరికింది. అయితే ఇది చిన్న స్కూల్. UKG వరకే వుంది. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మా ఆయనకి స్కూల్ లో క్లాస్ మేట్, నాకేమో సీనియర్. కొంచెం తెల్సిన అమ్మాయి కాబట్టి పర్సనల్ కేర్ వుంటుంది, పైగా చిన్న స్కూల్ అవడం వలన attention బాగుంటుంది అని చేర్చాము. క్లాస్ రూమ్స్, ప్లే గ్రౌండ్ అంతా బాగున్నాయి నీట్ గా. ఈ సంవత్సరం ప్లే క్లాసు లో వుంచి, మళ్ళీ  జూన్ 2012 లో మేము ముందు అనుకున్న స్కూల్ లో ప్లే క్లాసు లో చేర్చుదాం అనుకున్నాము. ఎలాగు ప్లే క్లాసు రిపీట్ చేద్దామనుకున్నాము కాబట్టి ప్రిన్సిపాల్ తో చెప్పాము ' వీడి ని లైట్ తీసుకోండి, ఏం నేర్చుకోకపోయినా పర్లేదు, ఊరికే స్కూల్ అలవాటయితే చాలు' అని. ఆమె సరే అంది. బుక్స్ కూడా కొన్ని తీసుకున్నాను కానీ వాడిందే లేదు.

స్కూల్ కి బాగానే అడ్జస్ట్ అయి వెళ్తున్నాడు. రోజూ వాళ్ళ నాన్నే తీసుకెళ్ళడం, తీసుకురావడం. మొదటి మూడు నాలుగు రోజులు తప్ప ఇంకెప్పుడూ పేచీ పెట్టలేదు. స్కూల్ బాగానే నచ్చినట్టుంది లే అనుకున్నాము. మాటల్లో అడిగితే బాగానే చెప్పేవాడు స్కూల్ కబుర్లన్నీనూ. వాళ్లకి parent - టీచర్ మీటింగ్ ప్రతి నెలా మొదటి వారం లో వుంటుంది. అయితే వీడికి చదువు ఏమీ వుండదు కాబట్టి నేను రానవసరం లేదు అని చెప్పారు. సరే అనుకున్నాను. మధ్య మధ్యలో వాళ్ళ నాన్న అడిగితే ప్రిన్సిపాల్ ఏమీ ప్రాబ్లం లేదు, బాగానే ఉంటున్నాడు, కాకపోతే కొంచెం హైపెర్-ఆక్టివ్ అని చెప్పిందిట.

 మొన్నీ మధ్య ఒక మెసేజ్ పంపింది "మీరు మీటింగ్ కి రావాలి" అంటూ. సరే చాలా రోజులయింది (స్కూల్ లో చేర్చి మూడు నెలలు, అయితే జనవరి లో ఒక ఇరవయ్ రోజులు సెలవలే) కదా అని వెళ్లాను.ఆవిడ ఒక పావు గంట సేపు నా పుత్ర రత్నం వేసే వేషాలు చెప్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్ధం కాలేదు. తను మాకు పర్సనల్ గా కూడా తెల్సు కాబట్టి ఏదో కబుర్లు చెప్తున్నట్టే చెప్పింది, ఏం చెప్పిందో తన మాటల్లోనే,

'కీర్తి, అసలు ఎలా వేగుతున్నారు వీడితో మీరు? ఇక్కడ 60 కిడ్స్ వున్నారు, అందరినీ నెల లోపే మా దారిలోకి తెచ్చుకున్నాం, కానీ మీ వాడిని మాత్రం దార్లో పెట్టడం మా వల్ల కాలేదు. కోప్పడదామంటే చిన్న పిల్లాడు అని నోరు రావట్లేదు. వచ్చే ఏడాది ఎలానూ ప్లే స్కూల్ లోనే ఉంటాడు కదా అని మేమూ కొంచెం ఈజీ గా తీసుకున్నాం. ఒక్క అయిదు నిమిషాలు క్లాసు లో కూర్చోమంటే కూర్చోడు. భయం పెడదామని సీరియస్ గా ముఖం పెడితే వచ్చి నన్ను హగ్ చేసుకుంటున్నాడు (ఇది వాడు ఇంట్లో నా మీద ఉపయోగించే టెక్నిక్). ఎప్పుడూ బయట గ్రౌండ్ లోనే ఆటలు, లేకపోతే aquarium , పంజరం లో పక్షుల దగ్గర ఆటలు. స్కూల్ అంతా తిరుగుతుంటాడు, వాడికి ఏ క్లాసు రూం కి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్తాడు, ఆ టీచర్స్ కి కూడా వీడు బాగా పెట్ అయిపోయాడు, ఎవరూ ఏమీ అనట్లేదు. ఒకవేళ ఒక టీచర్ ఏమన్నా అంటే ఇంకో టీచర్ దగ్గరకి వెళ్లి ఆమెని ఎత్తుకోమంటాడు. ఇవన్నీ కాకపోతే ఆఫీసు రూం కి వెళ్లి అక్కడ క్లెర్క్ ని దబాయిస్తాడు చాక్లెట్స్ ఇవ్వు, క్రేయోన్స్ ఇవ్వు అని. ఇలా వాడి ఇష్టం అయిపొయింది'

నాకేమనాలో తోచలేదు. ఇంట్లో గారం ఎక్కువయిందని స్కూల్ లో చేరిస్తే ఇక్కడ మరీ మితిమీరిపోయింది. ఆఖరికి తనే చెప్పింది ఇక నుండి కొంచెం భయం పెడతాము, ప్రస్తుతానికి స్కూల్ కి అలవాటు పడ్డాడు, మీరేం వర్రీ అవద్దు, వచ్చే ఏడు సీరియస్ గా దార్లో పెడదాం అని. ఇంక నేనేం చెప్తాను? సరే అన్నాను.

వీడికి ఈ స్కూల్ బాగా అలవాటయ్యింది. వాచ్ మాన్, ఆయా కూడా బాగానే చూస్తున్నారు. అందరూ బాగా క్లోజ్ అయ్యారు. ఇప్పుడిక ప్లే క్లాసు కూడా వచ్చే ఏడు ఇక్కడే కంటిన్యూ చేసి LKG కి పెద్ద స్కూల్ లో చేర్చుదాం అనుకున్నాము. అయితే మరో వేపు ఇప్పుడు లేని భయం వచ్చే ఏడాది వీడికి ఎలా పెడతారు. అప్పుడూ ఇదే గారం అలవాటయ్యి చదువు లేకుండా ఆటల్లోనే గడిచిపోతుందేమో అని ఒక ఆలోచన. చదువంటే వీడేమీ ప్లే క్లాసు లోనే Einstein లా అయిపోవాలని కాదు. కనీసం 'A ,B ,C , D ' లు, rhymes అన్నా నేర్చుకోవాలిగా. ఇంట్లో చెప్దామంటే ఒక్క నిమిషం కుదురుగా ఉండట్లేదు. ఈ మధ్య 'చిట్టి చిలకమ్మా' 'Johny Johny ' rhymes నేర్పించాను.పుస్తకాలు తీస్తే పరుగు పెడతాడు. అప్పటికీ ఫ్లాష్ కార్డ్స్, CDs ద్వారా చెప్పాలనే చూస్తున్నాను. ఎంత సేపూ ప్రోక్లైనేర్ వీడియో, అది కాకపోతే ట్రైను, vehicles , బిల్డింగ్ బ్లాక్స్  తో ఆటలు లేకపోతే బయట షికారు. అప్పుడప్పుడూ మూడ్ బాగుంటే paint లు వేస్తాడు.

వచ్చే నెలలో వీడి స్కూల్ వార్షికోత్సవం. బోల్డన్ని డాన్సులు వున్నాయి. కానీ నా పుత్ర రత్నానికి ఇచ్చిన రోల్ ఏంటో తెలుసా 'రాక్షసుడు' :( దాని కోసం ఈ రోజెళ్ళి కడియాలు కూడా కొన్నాను. మా అమ్మ అయితే అది గోల కాదు ఇదేమి రోల్ అని. స్కూల్ లో వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఇలాంటి అచ్చోసిన బుల్లి అంబోతుకి రాక్షసుడి రోల్ కాక మరేమివ్వగలరు?

సో అలా మొదలయింది మా పండు గాడి స్కూల్ పర్వం. ఇంకెన్ని వేషాలు చూడాల్సివస్తుందో. పిల్లల పెంపకానికి మించి challenging టాస్క్ మరోటి కనిపించట్లేదు నాకు ప్రస్తుతానికి. Sigghhhh!

Monday, February 6, 2012

మా టీవీ మ్యూజిక్ అవార్డ్స్ - 2012


నేను టీవీ ఎక్కువ చూడను. పండు గాడు పుట్టాక అసలే తగ్గించేసాను. ఇప్పుడు ఎప్పుడయినా చూడాలని పెట్టుకున్నా కూడా నా పుత్రరత్నం చూడనివ్వడు. వెళ్లి ఆపేసి 'అమ్మా ..ఆకుందాం(ఆడుకుందాం)' అంటాడు :( పొద్దున్న వాడు స్కూల్ కి వెళ్ళినప్పుడు వంట, నెట్, పుస్తకాలతో సరిపోతుంది నాకు. నిన్న ఆదివారం అవడం తో అమ్మ వాళ్ళింటికి వెళ్ళాము. అక్కడ పొద్దున్నుండి చేతన్ భగత్ రాసిన R2020 (దీని గురించి రివ్యూస్ బ్లాగ్ లో రాస్తాను)  బుక్ పట్టుకుని కూర్చున్నాను. సాయంత్రం కూడా అది చదువుకుంటుండగా అమ్మ టీవీ పెట్టి మా టీవీ లో మ్యూజిక్ అవార్డ్స్ వస్తున్నాయి చూడు నువ్వు కూడా అంది. అదృష్టవశాత్తు పండు గాడు కూడా మమ్మల్ని విసిగించకుండా పక్క ఇంటి పిల్లలతో బిల్డింగ్ బ్లాక్స్ తో ఆడుకుంటూ కూర్చున్నాడు. అలా చాలా చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఒక రెండు గంటలు TV చూసే అవకాశం దక్కింది.

ఈ అవార్డ్స్ కార్యక్రమంలో నాకు నచ్చిన మొదటి విషయం ఏంటంటే అవార్డ్స్ అన్నీ కూడా కొత్త కొత్త వాళ్లకి (అదీ యువతకి) ఇచ్చారు. ఇంతకు ముందు ఉత్తమ గాయని/గాయకుడు అనే SPB /చిత్ర/సునీత/ఉదిత్ నారాయణ్ ఇంతకు మించి పేర్లు వినిపించేవి కావు. ఇప్పుడు అంతా ఫ్రెష్ టాలెంట్. చిన్న చిన్న పిల్లలు (అంటే నాకంటే చిన్నాళ్ళు కాబట్టి నాకు పిల్లల్లాగానే అనిపించారు) అందరూ. ఎంతో బాగా పాడుతున్నారు, మ్యూజిక్ ఇస్తున్నారు, డాన్సులు compose చేస్తున్నారు. నిజంగా చాలా చాలా నచ్చింది నాకు ఈ పరిణామం.

ఇక రెండో విషయం నాకిష్టమయిన సినీ గీత రచయిత అయిన 'సిరి వెన్నెల' సీతారామశాస్త్రి గారికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడం.

'చందమామ రావే, జాబిల్లి రావే' అంటూ చంటి పిల్లలకి జోల పాడినా,

'ప్రాగ్దిశ వేణియ పైన  దినకర మయూఖ తంత్రుల పైనా, జాగ్రుత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన' అంటూ తెలుగు పదాలను అత్యంత రమణీయంగా పాటలో కూర్చినా,

'బోటనీ పాఠం వుంది , మాటినీ ఆట వుంది దేనికో వోటు చెప్పరా' అని కాలేజీ కుర్రాళ్ళ అల్లరి, మనోభావాలని పాటగా మలిచినా,

'క్లాసు రూములో తపస్సు చేయుట వేస్ట్ రా గురు, బయట వున్నది ప్రపంచమంతా చూడరా గురూ' అంటూ పుస్తకాల్లో పాఠాలకి, జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలకి తేడా చెప్పినా,

'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని, మారదు లోకం, మారదు కాలం, ఎవ్వరు ఏమయిపోనీ దేవుడు దిగిరానీ' అని సమాజంలోని కుళ్ళు కుతంత్రాల గురించి ఆక్రోసించినా,

'అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా; నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చ్ఛ ను చూద్దామా, దాన్నే స్వరాజ్యమందామా' అంటూ సూటిగా గుండెల్లో బాకు దించినట్టుగా నిలదీసినా,


'చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్న వాడా..కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్ధం, బ్రతుకును కానీయకు వ్యర్ధం' అంటూ మానవ సేవయే మాధవ సేవ అన్న సూక్తి ని మనకి అర్ధమయ్యేలా చెప్పినా ,

'బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఐ, ఈ నేర్చుకున్నా' అంటూ మాస్ పాట రాసినా

'నువ్వు, నువ్వు, నువ్వే నువ్వు..నాలోనా నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వూ' అంటూ ప్రేయసి హృదయాన్ని అత్యంత సుందరంగా ఆవిష్కరించినా,

'జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది' అంటూ కవి యొక్క జీవిత సారాంశాన్ని కాచి వడబోసినా,

ఇలా ఏ సందర్భానికి అనుగుణంగా పాట వ్రాసినా హృదయానికి హత్తుకునేలా మాత్రమే కాకుండా హృదయాంతరాల్లోకి  దూసుకు వెళ్ళేలా వ్రాసిన ఘనత సిరివెన్నెల గారిదే. అలాంటి మహాకవి గొప్పతనం గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా పొగిడారు. కానీ నిన్న చూసిన ఫంక్షన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సిరివెన్నెల గారి గురించి ఇచ్చిన స్పీచ్ నాకు తెగ నచ్చేసింది.

'సీతారామ శాస్త్రి గారి లాంటి గొప్ప కవి సినిమా పాటలు రాయడం, ఆయన ప్రతిభ సినిమాలకే పరిమితమవ్వడం ఆయన దురదృష్టం, మన అదృష్టం' అన్నారు. చాలా చాలా బాగా మాట్లాడారు త్రివిక్రమ్ గారు. హాట్స్ ఆఫ్!
సినిమా పాటలలో సాహిత్యపు విలువలు అడుగంటుతున్న ఇప్పటి రోజుల్లో సిరివెన్నెల గారి లాంటి వాళ్ళు సినీ జగత్తు లో వుండటం మన అదృష్టం కాక మరేంటి?




ఈ వీడియో సరిగ్గా రన్ అవుతుందో లేదో నేను మొత్తం చూడలేదు. కానీ ఇంతకంటే మంచి లింక్ వేరేది దొరకలేదు.

దీన్ని ఏమంటారు?



ఇది నా పాత బ్లాగ్ లో మూడేళ్ళ క్రితం నేను వ్రాసిన ఒక పోస్ట్,
http://itsmylifenmyspace.wordpress.com/2008/11/22/nooru-saatham-telugu/

ఇది నేను ఈ రోజు పొద్దున్న చదివిన పోస్ట్,
http://myasabha.wordpress.com/2012/02/05/3823/

కాన్సెప్ట్ మార్చి దానికి తగ్గట్టుగా మాటలకి కొన్ని మార్పులూ చేర్పులూ చేసారు కానీ ఒరిజినల్ గా నేను వ్రాసిన పోస్ట్ కీ ఈ పోస్ట్ కీ చాలా పోలికలు కనిపించాయి. ఇలా వ్రాయడాన్ని ఏమంటారు? స్ఫూర్తి చెంది రాయడమా, లేక మూడేళ్ళ క్రితం నాకొచ్చిన ఆలోచనే ఈ సదరు బ్లాగర్ కి ఇప్పుడు వచ్చి ఉంటుందంటారా? (ఈ బ్లాగర్ నా పాత బ్లాగ్ కి follower , కామెంట్స్ ఎప్పుడూ చెయ్యలేదు కానీ అతను/ఆమె నా బ్లాగ్ ఫాలో అవడానికి subscribe అయినట్టు నాకు మెయిల్ వచ్చింది :) ) అప్పుడు నేనూ తన బ్లాగ్ చూసి నా రీడర్ లో add చేసుకున్నాను. నేను కూడా చాలా మంది బ్లాగ్స్ చదివి ఇలాంటి పోస్ట్స్ నేనూ రాయాలి అనుకున్న సందర్భాలు వున్నాయి కానీ ఇంత creative గా ఎప్పుడూ అలోచించి రాయలేదు :D

Friday, February 3, 2012

ఒక చిన్న సంఘర్షణ

చిన్నప్పుడు ఆరవ తరగతిలో అనుకుంటా భత్రుహరి సుభాషితాలు ఉండేవి తెలుగు పాఠాల్లో...వాటిల్లో నాకు బాగా నచ్చిన సుభాషితం ఇది,

ఒరులేయవి యొనరించిన నరవర
యప్రియంబు తన మనంబున కగు
తానొరులకు నవి సేయకుని
పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్

ఈ పద్యం యొక్క భావం అందరికీ తెలిసిందే,

ఇతరులు ఏ పని చేస్తే నీ మనసుకి కష్టం కలుగుతుందో అటువంటి పనిని నువ్వు ఇతరుల పట్ల చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలలోకెల్లా ఉత్తమమయిన ధర్మం అని.

కానీ నిజ జీవితంలో ఇది ఆచరించడం సాధ్యమేనా?

ఉదాహరణకి మనల్ని ఎవరన్నా అవమానిస్తే మన మనసుకి చాలా కష్టం కలుగుతుంది, వాళ్ళు మనకి బాగా దగ్గర వాళ్ళయితే ఒకసారి, రెండు సార్లు, పది సార్లు వోర్చుకుంటాము...కానీ పదే పదే (మన ఫీలింగ్స్ వాళ్ళకి చెప్పినా కూడా) మనల్ని వాళ్ళ ప్రవర్తన ద్వారా బాధిస్తుంటే ఇంకా వాళ్ళతో మంచిగా వుండటం వీలయ్యే పనేనా? ఎప్పుడో ఒక సారి కోపం వచ్చి తిరిగి ఒక మాట అనకుండా ఉండగలమా. అలా అనలేకపోయినా కనీసం వాళ్ళకి దూరంగా ఉంటాము కదా పట్టించుకోకుండా. అంతే కానీ అవతలి వ్యక్తి నన్ను ఎంత అవమానించినా అతని పట్ల నేను చాలా మామూలుగానే ఉంటూ అతన్ని గౌరవిస్తాను అని ఎంతమంది అనగలరు? తనకి ఇష్టమయినప్పుడు దగ్గరగా వచ్చి నవ్వుతూ మాట్లాడగానే పాత సంగతులు మర్చిపోయి తేలిగ్గా నవ్వెయ్యగలమా? మనం అలా చెయ్యకుండా వాళ్ళని పట్టించుకోకుండా వుంటే వాళ్ళకీ బాధ కలుగుతుంది కదా.

పుస్తకాల్లో చదివిన వాటిని జీవితంలో ఆచరించడం గొప్ప గొప్ప వాళ్ళు మాత్రమే చెయ్యగలరు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది సమాజంలో జనం మధ్య బ్రతకడానికి ఉపయోగపడని ఈ సూక్తులూ, సుభాషితాలు దేనికీ అని?

కొత్త బ్లాగ్

ఈ మధ్య కొన్ని కారణాల వలన ఫోటోలు, పుస్తకాలు-సినిమాల సమీక్షల కోసం కొత్త బ్లాగ్స్ మొదలుపెట్టాను. అవి బ్లాగర్ లో create చేసాను. నా తెలుగు బ్లాగ్ ఏమో వర్డ్ ప్రెస్ లో వుంది. నేను వ్రాసే మూడు బ్లాగులకి ఒకే డొమైన్ వుంటే బాగుంటుందనే ఆలోచనతో నా తెలుగు బ్లాగ్ లో వుండే పోస్ట్ లు అన్నిటినీ ఈ కొత్త బ్లాగ్ లో కాపీ చేసాను. ఎక్కువ పోస్ట్ లు లేకపోవడం తో నా పని సులభం అయింది. ఇక నుండి ఈ బ్లాగ్ లోనే రాస్తాను. ఇక నా తింగ్లిష్ బ్లాగ్ మాత్రం వ్రాయడం ఆపేస్తున్నాను.

హమ్మయ్య..ఒక పని అయిపొయింది :)

ముక్కు పుడక

రవితేజ నటించిన ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ సినిమా లో ఒక డైలాగ్ వుంటుంది గుర్తుందా, అదే ఆంధ్ర/తెలుగు అమ్మాయిలకి ముక్కు పుడక వుండి తీరుతుంది అనో ఏదో. నాకేమో అచ్చ తెలుగు అమ్మాయి అనిపించుకోవాలని తెగ కోరిక. మా ఇంట్లో పెద్ద వాళ్ళందరికీ ముక్కు పుడకలు వున్నాయి, మా అమ్మకి తప్ప. ఎప్పటి నుండో నేనూ ముక్కు కుట్టించుకుందాం అనుకుంటూనే నొప్పెడుతుందేమో అన్న ఒకే ఒక్క కారణం వలన వాయిదా వేస్తూ వచ్చాను. ఈ రవితేజ సినిమా చూసిన ప్రతి సారి వెర్రి ఆవేశం వస్తుంది కానీ నొప్పేమో అని మళ్ళీ భయపడుతూ చాలా ఏళ్ళు గడిపేశాను.

ఒక నెల రోజుల క్రితం ఆకస్మాత్హుగా మా అమ్మ మా ఇంటికొచ్చింది. ముఖంలో ఏదో తేడా. ఏంటా అని చూస్తే ముక్కు కుట్టించుకుని వుంది. ఏంటమ్మా అని అడిగితే అప్పుడు చెప్పింది. ఎవరో జ్యోతీషుడు తనని చూసి ఇలా అన్నాడుట ‘అమ్మా నువ్వు 57 ఏళ్ళకి చచ్చిపోతావు, కనుక ఆ లోపు ఏమన్నా తీరని కోరికలుంటే తీర్చేసుకో’ అని. అమ్మకి 52 ఏళ్ళు ఇప్పుడు. ఇంకో అయిదు ఏళ్ళే కదా బ్రతికేది ఈ లోపు చేయాలనుకున్న పనులన్నీ చేసేద్దాం అనుకుని స్కిన్ డాక్టర్ దగ్గరకెళ్ళి గన్ షాట్ పద్ధతి లో ముక్కు కుట్టిన్చేసుకుని వచ్చేసింది. నొప్పెట్టలేదా అని అడిగితే లేదు, చీమ కుట్టినట్లు వుంటుంది అంతే అని చెప్పింది.ముక్కు పుడక తో తన లుక్ మొత్తం మారిపోయింది. ఇక మనకీ ఉత్సాహం పొంగుకొచ్చేసింది. ఈ సారి ఎలా అయినా కుట్టించేయ్యాలి అని నిర్ణయించేసుకున్నా.అమ్మ, నాన్నకి చెప్పాను. అమ్మ సరే డాక్టర్ దగ్గరకి వెళ్ళు అని చెప్పింది. కానీ నాన్న మాత్రం ‘కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగోట్టిందిట, అలా వుంది మీ తల్లీ కూతుళ్ళ నిర్వాకం’ అని విసుక్కున్నారు. ఎప్పటిలాగానే మేము పట్టించుకోలేదు :P


పోయిన శనివారం పండు గాడిని అమ్మకి అప్పగించి నేను డాక్టర్ దగ్గరకి వెళ్లి ముక్కు, చెవులూ (రెండో చోట) కుట్టించేసుకున్నాను. అస్సలు నొప్పి పుట్టలేదు. కాకపోతే ముక్కుపుడక కొత్త కాబట్టి ముఖం కడుక్కునేప్పుడు, తుడుచుకునేప్పుడు కొంచెం జాగ్రత్హగా ఉండాల్సి వస్తోంది. ఇక మా ఆయన మాత్రం తెగ గింజుకున్నాడు నా కొత్త అవతారం చూసి. అంటే తనని నేను సలహా అడగలేదని కోపం. అయినా నేను ఒక సారి ఫిక్స్ అయితే నా నిర్ణయం మార్చుకోనని తనకి తెల్సు. మళ్ళీ తనని సలహా అడిగి తను వద్దంటే మానను కదా. అందుకే నేను అడగలేదు. ఊరికే వెళ్ళే ముందు మాట చెప్పాను అంతే.

మొత్తానికి నేనిప్పుడు అచ్చమయిన తెలుగింటి ఆడపడుచుని అయిపోయానోచ్! :D

అమ్మ మనసు

మా అమ్మ ద్వారా అమ్మ మనసు, అమ్మ ప్రేమ ఎలా వుంటుందో నేను చూసాను, అనుభవించాను అని అనుకున్నాను సంవత్సరం క్రితం వరకూ. ఆ ప్రేమలో వుండే మాధుర్యం, ఆ మనసులోని మమత అయితే అర్ధం చేసుకోగాలిగానేమో కానీ ఆ మనసు కొన్ని సందర్భాలలో పడే వేదన ఏంటో మాత్రం నేను అమ్మనయ్యాకే అర్ధమవుతోంది నాకు. అమ్మ తన బిడ్డకు ఏదయినా కష్టం వచ్చినప్పుడు బాధ పడడం, వేదన చెందడం తెల్సు కానీ ఏ పసి బిడ్డని చూసినా తన బిడ్డ గుర్తుకురావడం, ఆ పసికందు బాధని చూసి తల్లడిల్లడం నేను అమ్మనయ్యాకే అనుభవమవుతోంది.
 
పండు తల్లి పుట్టక ముందు నేనెప్పుడూ పసి పిల్లలని ఆడించలేదు, కనీసం ఎత్తుకోలేదు. అసలు ఆ అవకాశం రాలేదు, ఒక వేళ వచ్చినా భయపడేదాన్నేమో.ఎప్పుడో చిన్నప్పుడు మామయ్య కొడుకుని ఎత్తుకున్నాను కానీ ఎక్కువ సేపు లేదు. వాళ్ళ పనులు ఎలా చెయ్యాలో కూడా తెలీదు, ఎవరన్నా చేస్తే గమనించలేదు.
పిల్లల్ని లాలించడం, పెంచడం అంతా ప్రకృతే నేర్పిస్తుంది అని ఈ సంవత్సరం రోజుల్లో నాకు అర్ధమయింది. ఇప్పుడు నాకు ఏ పాప/బాబు ని చూసినా నా పండు తల్లే గుర్తొస్తుంది. ఆ పాప/బాబు ఏడుస్తుంటే బాధేస్తుంది. ఇంతకు ముందు అలాంటి సంఘటన చూసినప్పుడు అయ్యో అనుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఆ బాధ నా మనసుని తాకుతోంది. ఎంతలా అంటే నా మనసులోని ఆ బాధ కళ్ళల్లో నుండి ప్రవహించే అంత. పేపర్ లో ఎవరన్నా బిడ్డని చెత్త కుండీలో వేసి వెళ్ళారని వార్త చదివిన రోజు గుండెను మెలిపెట్టినంత బాధగా వుంటుంది. ఆ పసికందుకి వచ్చిన కష్టం నేను తీర్చలేను. కానీ ఆ కష్టం వాళ్ళ నాకు కలిగే వేదన, బాధ చెప్పలేనంత తీవ్రంగా ఉంటోంది. ఆ బిడ్డ కూడా నా పండు తల్లి లాంటిదే కదా, ఎందుకీ కష్టం వచ్చింది అన్న బాధ.
 
మొన్నో రోజు ఆటో లో వస్తుంటే రోడ్ మీద ట్రాఫ్ఫిక్ జామ్ అయింది. ఒక పావుగంట సేపు ఆటో ఆగిపోయింది. పక్కనే ఫ్లయ్ ఓవర్ కింద ఒక కుటుంబం. పిల్లలు ఆడుకునే బెలూన్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ఆ కుటుంబంలో తల్లీ, తండ్రి, ఇద్దరు బిడ్డలు వున్నారు. ఒకరు మూడు నాలుగేళ్ల వాడు. పాపకి రెండేళ్ళు ఉంటాయేమో. వాళ్ళ అమ్మ నాన్న ట్రాఫిక్ లో ఆగిపోయిన వాహనాల దగ్గరకి వచ్చి బెలూన్స్ అమ్ముకుంటూ వుంటే పిల్లలిద్దరూ అటూ ఇటూ పరిగెడుతూ వున్నారు. పండు తల్లి పుట్టక ముందు అయితే ఇలాంటి దృశ్యాలని పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఈ సారి మాత్రం నాకు ఎంత టెన్షన్ కలిగిందో  చెప్పలేను. సడెన్ గా ఏ బండి కదిలి వాళ్ళు దానికి అడ్డం పడి దెబ్బ తగిలించుకుంటారో అని. ఇంట్లో పండు గాడిని క్షణం కనిపెట్టుకోకుండా వున్నా ఏదో ఒక చోట పడి దెబ్బలు తగిలించుకుంటాడు. అలాంటిది వాళ్ళ అమ్మ నాన్న ఆ పిల్లలని రోడ్ మీద అంత నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేసారు అనిపించింది ఒక క్షణం. ఆ తల్లి కూడా నా లాంటిదే కదా. మరి ఆమెకి నాకున్న ఆదుర్దా ఉండదా అని. ఆ స్థానం లో పండు గాడు వుంటే నాకు ఊపిరి కూడా ఆడేది కాదేమో అనిపించింది. కానీ ఆ తల్లి తండ్రులు అంత కష్టపడేది ఆ పసి పిల్లల జానెడు పొట్ట నింపడం కోసమే కదా. పొట్ట కూటి కోసం అంత పసి పిల్లల గురించి వాళ్ళకున్న కేర్ ని ప్రదర్శించలేని వాళ్ళ నిస్సహాయత తలచుకుంటే దిగులేసింది. ఇంటికి వచ్చాక కూడా చాలా సేపు ఈ సంఘటన గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను.
 
ఇంతకు మునుపు నేను కేవలం ఒక మనిషిగానే అలోచించేదాన్ని. ఇప్పుడు ఒక తల్లిలా ఆలోచిస్తున్నాను. రెండిటికీ చాలా తేడా వుంది కదా.

బూబూ వాళ్ళ అమ్మ

మా పండు గాడు  ఈ మధ్య మా కాలనీలో చిన్న సైజు సెలెబ్రిటి అయిపోయాడు. ఎవరయినా కొత్త వాళ్ళు మా ఇల్లు కనుక్కోవాలంటే మా అయన పేరో, నా పేరో, ఆయన చేసేపనో చెప్తే కష్టం. అదే వాళ్ళకో బాబు వున్నాడు అంటే మాత్రం  టక్కున   ”ఓహ్, బూబూ రెడ్డి వాళ్ళ ఇల్లా?” అని చూపించేస్తున్నారు. నేను వాడికి పెట్టిన పేరు బూబూ అని మాత్రమే. తోక చుట్టుపక్కల వాళ్ళు తగిలించారు :twisted: పండు గాడు పొద్దున్నే లేచి రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరినీ “హే,ఓయ్” అని అరుస్తూ పిలుస్తుంటాడు. ఇంకా కెవ్వు కెవ్వు మని కేకలు పెడుతుంటాడు. వీడి కేకలు వీధి చివరి దాకా వినిపిస్తున్తాయని చివరి ఇంట్లో వుండే వాళ్ళు చెప్తుంటారు.
 
పైగా దొరగారికి పెత్తనాలు కూడా ఎక్కువే :P  అలా వీడు అందరికీ బాగా గుర్తు అయిపోయాడు.
అమ్మ వాళ్ళింట్లో వున్నప్పుడు రోజూ మాతో ఆడుకోడానికి మహి అని ఒక పాప వచ్చేది. ఆ పాప వాళ్ళ అమ్మని అందరూ మహి వాళ్ళ అమ్మ అనే పిలిచేవారు. ఆమె అసలు పేరు లక్ష్మి అని దాదాపు సంవత్సరం తర్వాత తెల్సింది నాకు. అదీ ఆమెనే డైరెక్ట్ గా అడిగితే చెప్పింది. అప్పుడు అదేంటో కొత్తగా వింతగా అనిపించింది నాకు. ఇప్పుడు నన్ను కూడా ఇక్కడ అందరూ బూబూ వాళ్ళ అమ్మ అనే అంటున్నారు. నాకు నా పేరంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు బూబూ వాళ్ళ అమ్మ అనే పేరు, గుర్తింపు ఇంకా ఇష్టంగా వున్నాయి :)

కోరి తెచ్చుకున్న తంటా

నా అంత తిక్కమేళం ఎవరూ వుండరేమో :evil:  దారిన పోయే దరిద్రాన్ని డబ్బిచ్చి కొనుక్కుని ఇంటికి తెచ్చుకుని దాంతో మనశ్శాంతి లేకుండా చేసుకోడం నాకే చెల్లింది. నాకు క్రాస్ వార్డ్  పజిల్స్  పూర్తి చెయ్యడం ఇష్టం. అవి కూడా తెలుగు వ్యాకరణానికి సంబంధించినవి మాత్రమే. ఆదివారం ఈనాడు అనుబంధం చివరి పేజీ లో వచ్చే పజిల్ లాంటివన్నమాట. అది ఒకసారి మొదలు పెట్టానంటే ఇక సరిగ్గా పూర్తి చేసేవరకూ ఏ పనీ చెయ్యలేను. కానీ ఈనాడు లో వచ్చే పజిల్స్ నాకు తేలిగ్గానే వచ్చేస్తాయి. ఇక వేరే ఏ రకమయిన పజిల్స్ జోలికి వెళ్ళను నేను. ఎందుకంటే అప్పటికప్పుడు అది పూర్తి కాకపోతే నాకు పిచ్చెక్కుతుంది.
 
ఇలాంటి నేను ఊరికే ఉండకుండా మొన్నో రోజు పండు గాడికి వాక్సిన్ వేయించడానికి డాక్టర్ దగ్గరకి వెళ్లి వస్తూ దార్లో ఎవడో ఈ Rubik’s Cube అమ్ముతూ వుంటే పాతిక రూపాయలిచ్చి కొన్నా. ఆ క్షణంలో అది సరిగ్గా చెయ్యగలనని ఎందుకు అనుకున్నానో నాకు తెలీదు. మొత్తానికి ఇంటికొచ్చి దాన్ని అటూ ఇటూ తిప్పి గందరగోళం చేసినా సాల్వ్ చేయలేకపోయాను. ఇక ఆ రోజు నుండి ఇదే పనిలో వున్నా. పండుగాడు పడుకున్న టైములో 90 % సమయం దీనికే తగలేస్తున్నా…అయినా రావట్లేదు. :( ఈ రోజు ఇలా కాదని నెట్లో వెతికి ఈ సైట్ పట్టాను. కానీ ఇందులో solution చదివితే ఇంకా గందరగోళంగా వుంది.  ఎప్పటికి ఇది సాల్వ్ చేస్తానో మరి. ఈ లోపల తిక్క రేగి దీన్ని దూరంగా విసిరి పారేస్తానేమో కూడా. తిప్పి తిప్పి చేతులు నొప్పెడుతున్నాయి. ఒక్క కలర్ మాత్రమే సాల్వ్ చేయగలుగుతున్నా :P   ఇంకా అయిదున్నాయి.

అజ్ఞానాంధకారం

జీవితంలో చాలా సార్లు నాకు అనిపిస్తుంది, కొన్ని విషయాల గురించి ఎంత తక్కువ  information తెలిసి వుంటే అంత మంచిది అని…నిన్న పొద్దున్న మా పండు గాడితో ఆడుకోడానికి పక్క వీధిలో పాప వచ్చింది. స్కూల్ టైం లో ఎలా వచ్చిందా అనుకుంటూ అదే అడిగాను,
“ప్రీతీ, ఏంటి స్కూల్ కి వెళ్ళలేదా ఈ రోజు”
“లేదు ఆంటీ, సెలవు కదా”
“పండగ ఏం కాదే, ఎందుకూ సెలవు?”
“అయ్యో, మీకు తెలీదా…ఈ రోజు బంద్, ఏవో గొడవలవుతాయని అంటున్నారుగా”
“గొడవలా, ఎందుకూ?”
“ఎందుకో మరి అందరూ కొట్టుకుంటారని చెప్తున్నారు, హిందూ ముస్లిమ్స్ గొడవ పడతారట..టీవీ చూడరా మీరు” అని చెప్పి ఆటల్లో మునిగిపోయింది.
ఈ మధ్య టీవీ కాదు కదా, కనీసం పేపర్ కూడా చూడట్లేదు నేను. మాకొచ్చేది సాక్షి (మా ఆయన వీరాభిమాని జగన్ కి, ఇద్దరం తరచూ గొడవపడుతుంటాం కూడా)…అందులో మెయిన్ పేపర్, జిల్లా ఎడిషన్  చస్తే చదవను నేను. ఫ్యామిలీ పేపర్ మాత్రం చదువుతా…ఎప్పుడయినా నెట్ లో ఈనాడు చదువుతాను అంతే. టీవీ లో న్యూస్ చానల్స్ చూడటం మానేసి చాలా రోజులే అయింది :) 
అప్పుడిక టీవీ పెడితే ఏ ఛానల్ లో చూసినా ఒకటే న్యూస్. అయోధ్య తీర్పు గురించి. ఈ అయోధ్య గొడవ అప్పుడెప్పుడో అయింది కదా ఇప్పుడు కొత్తగా ఏంటి అనుకుని కొంచెం కుదురుగా కూర్చుని చూస్తే అప్పుడు అర్ధమయ్యింది. చాలా కాలం నుండి కోర్టులో నలుగుతున్న ఈ కేసులో ఈ రోజు తీర్పు చెప్పబోతున్నారు అని. సో అదీ నాకున్న జ్ఞానం ఈ విషయంలో.
ఈ ప్రీతి అనే పాప కి ఏడేళ్ళు. తను పుట్టక ముందు ఎక్కడో UP  లో జరిగిన గొడవ గురించి ఆ అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు. ఇంకొంచెం పెద్దయ్యాక హిస్టరీ క్లాసు లో తెల్సుకుంటుందేమో. కానీ ఇప్పుడయితే ఆ లేత మనసుకి అర్ధమయ్యింది ఒకటే, హిందువులు – ముస్లింలు కొట్టుకుంటారు అని. అసలిద్దరికీ వచ్చిన తేడా ఏంటో, ఎందుకు కొట్టుకుంటారో, ఎవరి స్వార్థం వల్ల గొడవ ఇంత దాకా వచ్చిందో  ఆ పసి మనసు ఊహకి అందని విషయం. క్లాసు పుస్తకాల్లో బోల్డన్ని మంచి మంచి మాటలుంటాయి మత సామరస్యం మీద. కానీ తనకి నిజ జీవితంలో కనిపిస్తుంది ఏంటి? పరస్పర విరుద్ధమయిన ఈ రెండు విషయాల మధ్య ఆ పాప ఎంత అయోమయానికి గురవుతుంది?
రాజకీయాలు, మతం, ఈ గొడవలు అన్నీ పక్కన పెట్టి నా (ఒక సాధారణ వ్యక్తి) చుట్టూ వున్న పరిస్థితి గురించి చెప్పాలంటే ఇక్కడ హిందూ-ముస్లిం అనే తేడా కేవలం ఆచార వ్యవహారాల్లోనూ, దేవుడిని కొలిచే పద్దతిలోనూ  కనిపిస్తుంది తప్పితే ఇద్దరికీ మధ్య గొడవలు అయ్యే సంఘటనలు, సందర్భాలు వుండవు (నాకు కనిపించలేదు). రంజాన్ అయితే వాళ్ళు మాకు బిర్యాని పంపితే, సంక్రాంతి అప్పుడు మేము వాళ్లకి అరిసెలు పంపుతాం. రొట్టెల పండుగ కి మేము దర్గాకి వెళ్లి మొక్కుకుంటే వినాయక చవితి పూజల్లో వాళ్ళు దేవుడి విగ్రహం దగ్గరకి వచ్చి దండం పెట్టుకుంటారు. ఎవరి ఆచారాలు వాళ్ళవి. ఎదుటి వారి పద్ధతిని, సంప్రదాయాన్ని ఎవరూ వేలెత్తి చూపరు. ఇలా హాయిగా గడిచిపోతోంది కదా..
ఈ దేశంలో ఒక సాధారణ పౌరుడికి ఈ మతం వల్ల లేని ఇబ్బంది, ఈ పౌరులకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులకి ఎందుకు? మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నామని, మాకోసం మీరు పోరాడుతున్నారు అన్న తప్పుడు సంకేతం జనాలకి ఇచ్చి ఆ జనం కొట్టుకు చస్తుంటే చూసి మీ popularity పెంచుకుంటూ, భావి తరాలని ఒక అయోమయం లోకి నెట్టేస్తూ ఎటు తీసుకెళ్తున్నారు ఈ సమాజాన్ని?
ఆ వివాదాస్పద స్థలంలో మసీదు కట్టుకుంటారో, మందిరం కట్టుకుంటారో మీ చావు మీరు చావండి…మా (ప్రజల)  జోలికి రాకండి అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది. ఇదంతా చూసాక ఎందుకు ఇదంతా ఆలోచించడం, తెల్సుకోవడం  అనిపిస్తుంది. Ignorance is  a  bliss అన్నది ఎంత నిజమో కదా.
ఇక ఈ విషయంలో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎలాంటి గొడవలు జరగకపోవడం చాలా ఆనందంగా వుంది. ఇది ఆ తీర్పు అందరికీ అనుకూలం అయినందువలన (పేపర్లో అలా రాసారు) అని అంటున్నారు. కాదు కాదు ఈ ప్రశాంతత ఆ కొట్టుకు చచ్చే వాళ్ళలో, గొడవలు పెంచే వాళ్ళలో వచ్చిన మార్పు వలన అని అనుకోవాలని వుంది :) ఈ రోజు పొద్దున్న వీధిలో పిల్లలంతా స్కూల్ కి రంగు రంగుల బట్టలు (శుక్రవారం సివిల్ డ్రెస్ అంట) వేసుకుని సీతాకోకచిలుకల్లా గంతులేస్తూ వెళ్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇదే ప్రశాంతత ప్రతి రోజూ కావాలి.

గారెలు

తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనే సామెత వుంది కదా మనకి…ఇంకా గారెలు లేని తెలుగింటి విందు భోజనం ఊహించలేము…అలాగే పండగలకి, పబ్బాలకి గారెలు లేని వంట వుండదు…ఇలా గారెలు మన తెలుగింటి వంటల్లో రారాజులుగా వెలుగుతున్నా కూడా తెలుగింటి అమ్మాయినయిన (నువ్వు అమ్మాయి ఏంటి గృహిణి కదా అంటే అలాగే చదువుకోండి కాదని ఎవరన్నారు)  నేను నిన్నటి దాకా గారెలు వండలేదు అంటే నమ్ముతారా? నమ్మితీరాలి మరి అది నిజం కాబట్టి. తిండి పిచ్చి విపరీతంగా వున్నా కూడా నేను గారెల జోలికి పోలేదు ఇన్నాళ్ళు. సరే సుత్తి లేకుండా సూటిగా విషయానికొస్తా, మీకూ అదే కావాలి కదా :)


నాకు నూనెలో దేవేసే వంటకం ఏది చేయాలన్నా చచ్చేంత భయం. నేను ఆరవ క్లాసులో వుండగా ఒక సారి మా ఇంటికి చుట్టాలొచ్చారు. అమ్మ గారెలు చేద్దామని నూనె స్టవ్ మీద పెట్టి వచ్చిన వాళ్ళతో మాటల్లో పడింది. అలా అలా సోది చెప్తూ పక్క గదిలోకి వచ్చింది. ఒక అయిదారు నిమిషాలయ్యాక అదే గదిలో వున్న నన్ను పిలిచి స్టవ్ మీద నూనె పెట్టాను కాగిందో లేదో చూసి రా అని చెప్పింది. నీళ్ళు కాగాయో లేదో ఎలా చెక్ చేస్తాం, వేలు నీటిలో పెట్టి కదా, అలానే నూనె కూడా చెక్ చేయాలేమో అని వెళ్లి తిన్నగా మూకుట్లో వేలు పెట్టా :neutral: ఇంక చెప్పడానికేముంది? ఇల్లు ఎగిరి పోయేలా కేకలు, అమ్మ పరిగెత్తుకు రావడం, నాన్న ఫస్ట్  ఎయిడ్ చేయడం అమ్మని కేకలెయ్యడం, చుట్టాలు బిత్తరపోవడం అన్నీ అయ్యాయి. ఇక అమ్మ ఆ రోజు నుండి ఈ రోజు వరకూ నన్ను తనతో ఉన్నంత కాలం నూనె జోలికి వెళ్ళనివ్వలేదు.

పెళ్ళయ్యాక మా ఆయనతో UK  వెళ్ళాక కూడా ఎప్పుడూ పూరి, బజ్జి, గారె ఇలాంటివి వండలేదు చాలా కాలం. ఎప్పుడో తను పక్కన వుంటే బజ్జీలు చేశా ఒకటో రెండు సార్లు అంతే. కానీ నాకు నూనె లో వేయించే అన్ని వంటకాలు చాలా చాలా ఇష్టం. మా ఆయనకి కూడా చాలా ఇష్టం కానీ నా భయం గురించి తెలిసాక ఎప్పుడూ చేయమని అడగలేదు. ఇండియా వచ్చేసాక ఇక ఎప్పుడు ఇలాంటివి తినాలనిపించినా అమ్మని అడిగితే క్షణాల్లో చేసి పెట్టేది. కానీ ఈ సారి మాత్రం నేనే నేర్చుకోవాల్సిన అవసరం వచ్చి పడింది. పండు బాబు పక్కింటికి, ఎదురింటికి వెళ్లి వాళ్ళు పెట్టె గారెలు, బొండాలు తెగ ఇష్టంగా తింటున్నాడు. వాడి కోసం అయినా చేయాలి అనుకున్నా. మొన్న ఒక ఆదివారం రోజు బజ్జీలు చేసుకుని తిన్నాను. దాంతో కొంత ధైర్యం కూడా వచ్చింది :D నిన్న వాడు గోడ పట్టుకుని నడుచుకుంటూ గడపలు దాటాడు. ఏడో నెలలో పాకుతూ గడపలు దాటినప్పుడు అమ్మ గవ్వలు చేసింది. ఇప్పుడు గారెలు చేయడానికి అమ్మ ఇక్కడ లేదు కదా, అందుకని నేనే చేసేద్దామనుకున్నా.

మా ఆయనకి చెప్పదల్చుకోలేదు ముందుగా. రోజూ పొద్దున్న ఏడున్నర నుండి ఎనిమిదిన్నర వరకూ పండు బాబు ని తను చూసుకుంటుంటే నేను వంట చేసేస్తాను. ఈ రోజు కూడా అలానే వంటింట్లో దూరి తలుపు గడి పెట్టేసుకున్నాను. మధ్యలో తను ఎన్ని సార్లు తీయమన్నా తీయలేదు. నేను శ్రద్ధగా వంట చేసుకునేప్పుడు ఎవరన్నా వచ్చి పలకరిస్తే భలే చిరాకు. అయినా తను ఊరుకోకుండా బాబుని తీసుకుని బయట కిటికీ దగ్గరకొచ్చి తొంగి చూడడానికి ప్రయత్నించాడు. నేను చేసేది కనిపించకుండా మేనేజ్ చేశాను 8)

ఎందుకయినా మంచిదని ముందు లంచ్ కి కూరలు సిద్ధం చేసేసి గారెలు మొదలుపెట్టాను (గారెలు బాగా రాకపోతే మూడ్ ఆఫ్ అయి వంట చేయబుద్ధి అవదేమో అని). పిండి సిద్ధం చేసుకుని, మూకుడు స్టవ్ మీద పెట్టి నూనె పోసాను. ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకుని పిండి తో గారెలా చేయాలని చూస్తే ఎంతకీ ఆ షేప్ రాదే? గారె కి చిల్లు వుండాలి అని నాకు తెల్సిన ప్రాధమిక సూత్రం. నేను కవర్ మీద వత్తే అప్పుడు చిల్లు పెట్టినా నూనె లో జార్చే టైం కి చిల్లు పోతోంది. ఎంత ప్రయత్నించినా గారె ఆకారం మాత్రం సరిగ్గా రాలేదు. ఒక నాలుగయిదు గారెలకి మాత్రం చిల్లు వచ్చింది.  ఎలాగోలా పిండి మొత్తం గారెలు (?) లాగా చేసేసి నూనెలో వేయించాను. సొంత తెలివి ఉపయోగించలేదు కాబట్టి రుచి మాత్రం బాగానే వుంది. మినప్పప్పు, ఉప్పు తప్ప వేరే ఏం కలపలేదు :D


ఎనిమిదిన్నరకి వంటింటి తలుపు తీసి అప్పటికే బయట పిల్లి పిల్లని చంకనేసుకుని కాలు కాలిన పెద్ద గండు తండ్రి పిల్లిలా పచార్లు చేస్తున్న మా ఆయన్ని లోపలి రమ్మన్నాను. ఏమి చేసావ్ తల్లీ ఇంత సేపూ అంటూ వచ్చి నేను చేసిన గారెలు(?) చూసాడు.

“ఓహ్, బొండాలా ఈ రోజు టిఫిన్” అన్నాడు.
“$&£(^$£^” :evil:
“అదేంటి ముఖమలా పెట్టావ్? ఇవి బొండాలే కదా”
“కాదు, సరిగ్గా చూడు” అంటూ చిల్లున్న గారెలు పైన కనిపించేలా పెట్టాను.
“ఓహ్, వడలా, భలే భలే” అంటూ చిన్న ముక్క తీసుకుని తిన్నాడు. పండు బాబు కి కూడా ఒక గారె చేతికి ఇచ్చి కూర్చోపెడితే వాడే చిగుళ్ళతో లాగి పీకి ఎలాగోలా కొంత తిన్నాడు. సో అలా సాగింది నా మొదటి గారెల ప్రహసనం :)
మొదటి ఫోటోలో వున్నది బాగా వచ్చిన (ప్లీజ్ మీరలా ముఖాలు పెట్టకండి, నేను హర్ట్ అవుతా) గారెలు, రెండో ఫోటోలో వున్నవి ఏంటో మీ ఊహకే వదిలేస్తున్నా :P


తింగరబుచ్చి

నేను చాలా తెలివయిన దాన్నని నాకు నమ్మకం :cool:   కొన్ని సార్లు అది నిజమని నిరూపణ అయినా ఎక్కువ సార్లు అది కేవలం నా అహంకారం అని తేటతెల్లమవుతుంది. కనీసం అప్పుడయినా నా తెలివితేటల మీద నాకున్న అపార నమ్మకం సడలుతుందా అంటే లేదు. ఏదో ఈ సారికి ఇలా అయింది కానీ ఇంకోసారి ఇలా జరగనిస్తానా అనుకుంటా. మళ్ళీ అలాంటి సంఘటన జరిగినప్పుడు మళ్ళీ అలానే పప్పులో కాలేస్తుంటా. సరే ఇది అర్ధమవ్వడానికి మనం ఒక సారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్దాం.

2003  సంవత్సరం, అక్టోబర్ నెలలో నాకు పెళ్లి కుదిరింది. 2004  మార్చ్ లో ముహూర్తం. ఆడపిల్ల పెళ్లి అనగానే నగల షాపింగ్ వుంటుంది కదా. మా అమ్మకి నగల గురించి తెల్సింది సున్నా :P అప్పటివరకూ నాకేం నగలు చేయించినా, మా అమ్మమ్మ సలహానో, అత్తమ్మ (మేనమామ భార్య) సలహానో అడిగి వాళ్ళేం చెప్తే అది చేయించేది. ఇక నాకూ అస్సలేమీ తెల్సేది కాదు. నా పెళ్ళికి కావాల్సిన నగలు చాలా వరకూ ముందే చేయించేసారు. కనుక పెళ్లి కుదిరాక ఎక్కువ కొనాల్సిన అవసరం లేకపోయింది. ఏదో ఒక రెండు మూడు సెట్స్, గాజులు చేయించారు అంతే. ఇవన్నీ కూడా హైదరాబాద్ వెళ్లి మా అత్తమ్మ తీసుకువెళ్ళిన షాప్స్ లో ఏదో కొనేసుకున్నాను. షాప్ వాళ్ళు ఏది చూపెట్టినా బాగుందనిపించేది. అత్తమ్మ ఏది బాగుంది అని అంటే అదే నాకూ నచ్చేసేది. కొనేసుకునేదాన్ని. తరుగు, మజూరి ఇలాంటివన్నీ నాకు తెలీదు అప్పట్లో. అక్కడితో నా నగల షాపింగ్ అయింది. పెళ్లి అయింది. నగలన్నీ లాకర్లో పెట్టి తాళం అమ్మకిచ్చి నేను విమానమెక్కేసాను.

నాలుగేళ్ళు UK లో ఉద్యోగం వెలగబెట్టాను. మధ్యలో ఎన్నో సార్లు ఇండియా వచ్చాను. ఫ్రెండ్స్ అందరూ ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు ఏం నగలు చేయించుకున్నావ్ అంటే తెల్ల ముఖమేసేదాన్ని. ఇండియా ట్రిప్ ఏ మూడు వారాలో వుండేది. ఆ హడావుడిలో అసలు నాకు నగలు కొనుక్కోవాలన్న ఐడియా కూడా వచ్చేది కాదు. కొనుక్కుని ఎప్పుడు పెట్టుకోవాలిలే అని ఊరుకునేదాన్ని. మా ఆయన కూడా నేను పొరపాటున నగల టాపిక్ తెచ్చినా (చాలా అరుదుగా జరుగుతుంది ఇది) వినీ విననట్టు ఊరుకుంటాడు. ఎన్ని తెలివితేటలో కదా :evil:   అలా అలా నాలుగేళ్ళు గడిచాక మూటా ముల్లె సర్దుకుని ఇండియా వచ్చేసాం. వచ్చాక పండు బాబు బొజ్జలోకొచ్చాక ఇక వేరే పనీ పాటా ఏమీ లేక ఒకానొక దుర్(సు)ముహూర్తంలో నాకు ఏ మాత్రం ఐడియా లేని నగల ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఒక వారం రోజులు అంతర్జాలం లో నగల సైట్స్ అన్నీ వెతికి, ఆర్కుట్ లో ఫ్రెండ్స్ బుర్రలు తినేసి ఏవేవో మోడల్స్ చేయించుకుందామని డిసైడ్ చేసుకున్నాను :D


ఇక షాపింగ్ కి ఎక్కడికెళ్ళాలి అన్న మీమాంస మొదలయింది. హైదరాబాద్ వెళ్దాం అంటే బొజ్జలో పిల్లాడు అలసి పోతాడేమో ప్రయాణం వలన అని ఆ ప్లాన్ మానుకున్నాను. అయినా మా ఊరు నగల షాప్స్ కి చాలా ప్రసిద్ధి. అందరూ ఇక్కడ కొనుక్కుంటుంటే నేను ఎక్కడికో వెళ్ళడం దేనికి అని మా ఊర్లోనే కొందాం అని నిర్ణయించుకున్నాను. ఇక్కడ నుండే నా తెలివితేటలని మీరు బాగా అర్ధం చేసుకోవడం మొదలు పెట్టాలని మనవి. ఇక తోడు ఎవరిని తీసుకెళ్దాం అని అలోచించి చించి మరో గత్యంతరం లేక అమ్మ ని తీసుకెళ్ళాను. మా అమ్మకి నగల గురించి ఎంత తెల్సో ముందే చెప్పాను కదా. తను కూడా ఏవో కొనుక్కోవాలనుకుంది. తర్వాత ఏ షాప్ కి వెళ్ళాలి అని ఇరుగమ్మని పోరుగమ్మని సలహా అడిగితే వాళ్ళో షాప్ పేరు చెప్పారు. ఒకానొక సాయంత్రం సుస్టుగా టిఫినీలు చేసి షాపింగ్ కి బయల్దేరాం.

షాప్ కి వెళ్లి నేను అనుకున్న మోడల్స్ గురించి చెప్తే ఆ షాప్ వాడు “అమ్మా, నెట్లో చూసిన మోడల్స్ చేయించాక మీకు నప్పుతాయని గ్యారంటీ లేదు, అన్ని డబ్బులు తగలేసి మళ్ళీ మీకు ఆ నగ నప్పకపోతే బాధపడాల్సి వస్తుంది” అని భయపెట్టేసాడు. అంటే మరి వాడు వాడి షాప్ లో వున్న రెడీమేడ్ నగలు అమ్ముడుపోవాలని చూస్తాడు కానీ ఆర్డర్ చేస్తే ఎక్కడి నుండో చేయించి తెప్పించేంత ఓపిక ఎక్కడ వుంటుంది. ఇది మన అపారమయిన తెలివితేటలకి అందని పాయింటు. సరే ఇక వాడి మాటలు విన్నాక ఆర్డర్ చేద్దాం అన్న ఆలోచన మానేసి అక్కడ వున్న వాటిల్లోనే సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. అమ్మ తనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకుంది. నేను కూడా ఒక సెట్ సెలెక్ట్ చేసుకున్నాను. antique గోల్డ్ మీద కెంపులు, పచ్చలు వున్నసెట్.

ఇక బిల్లింగ్ పర్వం మొదలయింది. చెప్పాను కదా మనకి తరుగు, మజూరి అంటే తెలీదు అని. కనుక వాడు వేసిన బిల్లు చూసి కళ్ళు తిరిగాయి. ఇదేంటి నేను 88  గ్రాముల సెట్ కొనుక్కుంటే మీరు బిల్లు లో 108  గ్రాములకి వేసారు అని. ఇప్పుడు కళ్ళు తిరగడం వాడి వంతయింది. అమ్మ నా చెవిలో చెప్పింది తరుగు ఏదో వేస్తారు అని. ఈ విషయం నేను వాడిని అడగక ముందు కదా చెప్పాలి అని అమ్మని కోప్పడ్డాను. నాకేం తెల్సు నువ్వింత తెలివయిన దానివని అని అమ్మ సమర్ధించుకుంది. మా ఈ గుస గుసల సారాంశం అర్ధం కాని షాప్ అతను ఏమనుకున్నాడో ఏమో ఒక తెల్ల కాగితం తెచ్చి నాకు తరుగు, మజూరి ఎలా వేస్తారు, రాళ్ళు, రప్పలు వాటివిలువలు, KDM  అంటే ఏంటి అని ఒక పది నిమిషాల పాటు క్లాసు తీసుకున్నాడు. అప్పటికీ అర్ధం కాకపోడానికి నేనేమన్నా మొద్దునా? కాదు కదా. సరే ఇప్పుడు బిల్లింగ్ కాన్సెప్ట్ అర్ధమయింది కానీ బేరం ఎలా ఆడాలి (షాపింగ్ లో బేరం చేసి తీరాలి అన్న ప్రాధమిక సూత్రం ఒక ఫ్రెండ్ చెప్పింది) అని ఆలోచించాను. సహాయం కోసం అమ్మ వేపు చూస్తే తనూ అదే విధంగా నన్ను చూస్తూ వుంది. హతవిధీ ఇప్పుడేంటి మార్గం అనుకున్నా. తరుగేమో దగ్గర దగ్గర 25 % వేసాడు. అసలు ఎంత వేస్తే కరెక్ట్ గా వేసినట్టో మాకు తెలీదు కదా. ఇద్దరం కళ్ళతోనే సైగలు చేసుకుని మీరు మరీ ఎక్కువ తరుగు వేస్తున్నారండీ అన్నాను ఏదో పెద్ద తెల్సినట్టు. కానీ వాడికి అప్పటికే మా ఇద్దరి తెలివితేటలు అర్ధమయ్యాయి కాబట్టి ఇక తగ్గదల్చుకోలేదు. లేదమ్మా మేము మజూరి అసలు వెయ్యలేదు కదా, అందుకే తరుగు ఎక్కువ వేస్తాం. బయట షాప్స్ లో అయితే తరుగు వేసి, మజూరి కూడా వేస్తారు గ్రాముకి ఇంత అని చెప్పాడు. వాదించడానికి మాకేం తెల్సని? ఇక చేసేదేం లేక నోరు మూసుకుని వాడు వేసిన బిల్ ప్రకారం డబ్బు కట్టేసి నగలు తెచ్చేసుకున్నాం (చివర్లో ఏదో తగ్గించాలి కదా అన్నట్టు ఒక అయిదు వందలో, వెయ్యో తగ్గించాడు).

ఇంటికి వచ్చేసాం తెగ మురిసిపోతూ. ఇక కొన్నవి ఫ్రెండ్స్ కి చూపించుకోవాలి కదా. ఫోటోలు తీసి ఒక ఫ్రెండ్ కి చూపించా చాట్ విండో లో . తను నగల విషయంలో గండర గండి. వివరాలు అన్నీ అడిగి ఇక నన్ను తిట్టడం మొదలు పెట్టింది. షాపింగ్ కి వెళ్ళే ముందు ఏమేం మోడల్స్ చేయించుకోవాలో కనుక్కున్నదానివి తరుగు ఎంత వేస్తారో ఒక ఐడియా కోసం అన్నా కనుక్కోలేదా అని ఒక రేంజ్ లో కేకలేసింది. అదేంటి నువ్వు చెప్పలేదు కదా అన్నాను. మరీ ఇంత దద్దమ్మవని తెలీక అంది :twisted:   నాకు కోపమొచ్చేసింది ఇక. పోవే పుస్కీ అని చాట్ విండో క్లోజ్ చేసేసాను. ఇక నా మనసు మనసులో లేదు. ఎక్కువ పే చేసామేమో అని అనిపించింది. ఆర్కుట్లో ఫ్రెండ్స్ ని అడిగాను, తరుగు ఎంత వేస్తారు మామూలుగా అని. 10 % – 15 % అని చెప్పారు. వోల్లమో, వోరి నాయనో అని గుండెలు బాదేసుకున్నాను :cry:   నేను ఎక్కువ పే చేసాను అని చెప్తే తిరిగి షాప్ కి వెళ్లి బేరమాడు అని సలహా ఇచ్చారు. కానీ డబ్బులిచ్చేసాక షాప్ వాడు ఎందుకు తగ్గిస్తాడు? ఈ విషయం అమ్మకి చెప్తే తనూ డీలా పడిపోయింది. నీ  పెళ్ళికి ముందు నగలు చేయించినా చాలా ఏళ్ళయింది కదా, ధరలు, తరుగులు మారి ఉంటాయనుకున్నాను, కానీ మరీ ఇంత ఎక్కువ తేడా తో మనల్ని మోసం చేస్తారని అనుకోలేదు అని వాపోయింది. హైదరాబాద్ కి ఫోన్ చేసి అత్తమ్మ తో చెప్పి లబో దిబో అన్నాను. తను మాత్రం ఏం చేస్తుంది, ఓదార్చింది. ఈ సారి జాగ్రత్తగా కొనుక్కుందువులే అని చెప్పింది. ఈ విషయాలేవీ మా ఆయనకి చెప్పలేదు,ఇంకా ఏడిపిస్తాడని.
తర్వాత ఒక నెల గడిచాక నేను, మా ఆయన చెన్నై కి వెళ్లాం. అక్కడ నగల షాప్ కి తీసుకెళ్ళాడు నాకేదయినా కొందామని (పెళ్ళయ్యాక అదే మొదటిసారి). నాకేమో గుండెలు లబ్ డబ్ అంటున్నాయి. అసలే భాష కూడా తెలీదు ఇక్కడ బేరం ఎలా అని. మొత్తానికి ఒక uncut diamonds , పచ్చలు వున్న సెట్ ఒకటి నచ్చింది ఇద్దరికీ.
షాప్ వాడు వేసిన బిల్ ఒకటికి రెండు సార్లు చూసాను.ఈ బిల్ ఏంటో కొత్తగా వుంది. రాళ్ళూ, రప్పలకి ఒక రేట్, బంగారానికి ఒక రేట్ ఇంకా తరుగు 16 % వేసాడు. తరుగు విషయం ఏదో గుడ్డిలో మెల్ల లాగా వున్నా ఈ రాళ్ళూ, రప్పల విషయంలో మనకేమీ తెలీదు. ఆ కారట్స్ ఏంటో ఆ గోల ఏంటో. ఇప్పుడెలా అడగాలా అని దీనంగా మా ఆయన వేపు చూసా. డబ్బులివ్వడమే తన డ్యూటీ అన్నట్టు నా వంక నిర్వికారంగా చూసాడు. అప్పటికే నాకు ఆకలేస్తుంది. ఇక ఓపిక లేక సరే అని వాడు బిల్ లో ఎంత అమౌంట్ వేసాడో అంత పే చేసేసి సెట్ తీసుకున్నాం. మా ఊరికి వచ్చేసాక ఆ సెట్, బిల్ తో సహా ఫోటోలు తీసి మళ్ళీ ఫ్రెండ్స్ కి చూపించా (అంతకు ముందు తిట్లు తిన్న అమ్మాయి కి కూడా). ఇంతకు ముందు అంత కాకపోయినా మళ్ళీ క్లాసు పీకింగ్ సెషన్ అయింది :roll:   రాళ్ళూ, రప్పలకి రేట్ వేసినప్పుడు తరుగు అంత వెయ్యకూడదట. ఏమో ఈ గోల నాకు అర్ధం కాలేదు. సరే చేసేదేముంది అని ఆ విషయం అక్కడితో వదిలేసా. ఇక ఆ తర్వాత డెలివరీ, బాబు పుట్టడం వాడితో బిజీ అయిపోయాను.
ఇప్పుడిక వర్తమానం లోకి రండి (ఇంకా మీరు ఈ పోస్ట్ చదువుతూ వుంటే),
 
ఈ మధ్య మా పండు బాబుకి పెత్తనాలు ఎక్కువయ్యి నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతోంది. ఏముంది కుక్క తోక వంకర అన్నట్టు నా మనసు మళ్ళీ బంగారం మీదకి, చీరల మీదకి పోయింది. ఆషాడ మాసం వచ్చే టైం కదా, బంగారం రేట్ కొద్దిగా తగ్గింది అని పేపర్లో చూసాను. సరే ఈ సారి అయినా తెలివిగా కొందాం అని అనుకుని కొత్త డిజైన్లు ఏవి బాగుంటున్నాయో అంతర్జాలంలో మళ్ళీ వెతుక్కుని, తరుగు ఎంత వుండాలి, స్టోన్స్ కి రేట్ ఎంత, కారట్స్ గురించిన వివరాలు అన్నీ తెల్సుకున్నాను. ఇక నగల షాపింగ్ లో నాకు తిరుగే లేదనుకున్నాను. అయితే ఈ సారి ఎవరితో షాపింగ్ కి వెళ్ళాలి అన్న సందేహం వచ్చింది. అమ్మ పండు దగ్గర వుండాలి, మా ఆయనకి ఏవో పనులున్నాయని అస్సలు కుదరదు అన్నాడు. ఇక ఏం చేయాలో తోచక పక్క వీధిలో ఆంటీ ని అడిగాను. ఆవిడ వస్తాను అన్నారు. ఆ ఆంటీ వాళ్ళెప్పుడూ నగలు తీసుకునే షాప్ కి తీసుకెళ్ళింది.
 
నేను అనుకున్న డిజైను చెప్పాను షాప్ అతనికి (ఈ మధ్య ఇవి లేటెస్ట్ అంట కదా అని). అవి ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం నుండీ వున్నాయి కదండీ, మీరు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయంటారు ఏంటి అంటూ అదో రకంగా చూసాడు. నాకు గాలి తీసేసినట్టయింది. ఛీ ఎదవ జన్మ అనుకున్నాను. అలాంటివి ఇప్పుడెవరూ ఇష్టపడట్లేదు అని కరాఖండి గా చెప్పేసాడు. ఇంకేముంది మనకి మళ్ళీ మీమాంస మొదలయింది. సరే నా జన్మ ఇంతే అనుకుని షాప్ వాడినే లేటెస్ట్ మోడల్స్ చూపించమని అడిగాను. ఏవో పెండెంట్ సెట్స్ చూపించాడు. వాటిల్లో ఒకటి పెట్టుకుని చూస్తే నాకు బాగున్నట్టే అనిపించింది. ఆంటీ కి కూడా నచ్చింది. సరే తీసుకుందాం అని బిల్ వేయమన్నాను మనసులో ఎలా బేరం మొదలు పెట్టాలి అని ప్రాక్టీసు చేసుకుంటూ. బిల్ చూస్తే తరుగు లేదు, కానీ మజూరి గ్రాముకి 350 రూపాయలు వేసాడు. ఇది మళ్ళీ మనకి కొత్త. షాప్ వాడిని తరుగు గురించి అడిగితే ఇప్పుడు తరుగు వెయ్యట్లేదండీ, స్టోన్ రేట్ కూడా వెయ్యట్లేదు. అంతా కలిపే మజూరిలో వేస్తున్నాం అన్నాడు. దీనంగా ఆంటీ వేపు చూసా. ఆంటీ కూడా నిజమే అన్నట్టు తల ఆడించారు. ఈ లోపు షాప్ అతను వేరే ఎవరో వస్తే అటు వెళ్ళాడు. ఆంటీ ని అడిగా, ఏమన్నా తగ్గిస్తాడా అని. లేదమ్మా మాకెప్పుడూ ఒక రేట్ వేస్తాడు. ముప్పై ఏళ్ళగా తెల్సు, ఎక్కువ వెయ్యడు అని నమ్మకంగా చెప్పారు. సరే ఇంకేముంది చేసేది అని అతను చెప్పిన అమౌంట్ కట్టేసి సెట్ తీసుకుని ఇంటికొచ్చేసాను. అమ్మకి, మా ఇంటాయనకి చూపిస్తే బాగుంది అన్నారు. రేట్ గురించి వాళ్ళేమీ మాట్లాడలేదు.
 
తర్వాత కొంచెం తీరికగా కూర్చుని ఆలోచించా. ఈ షాప్ అతను కరెక్ట్ రేట్ వేశాడా లేదా ఎలా తెల్సుకోవడం అని. మొత్తం సెట్ రేట్ లో నుండి బంగారం రేట్ తీసేస్తే మజూరి ఎంతో వచ్చింది. తరుగు 15  % వేస్తే ఎంత రేట్ పడేదో చూసాను. రెండిటికీ 4000  తేడా వచ్చింది. అంటే 15 % తరుగు వేసి వుంటే నేను 4000 తక్కువకే ఆ సెట్ కొనుక్కోగాలిగేదాన్ని. సరే స్టోన్స్ రేట్ కూడా కలుపుకుని వేసాడేమో అనుకున్నా ఒక్క క్షణం. మళ్ళీ నా నెత్తిన నేనే ఒక మొట్టికాయ వేసుకున్నా. నేను కొన్న సెట్లో స్టోన్స్ ఎక్కువ లేవు. మొత్తం కలిపి నాలుగో, ఐదో ఉన్నాయంతే. అవి కూడా సెమి ప్రేషియస్ స్టోన్స్. అంటే మళ్ళీ 4000 ఎక్కువ ఇచ్చి వచ్చానన్నమాట. ఈ సారి ఇంకెవరికీ చెప్పలేదు, చెప్పి తిట్లుతినలేదు. ఇక నన్ను ఎవరూ బాగు చెయ్యలేరు అనుకుని నన్ను నేనే తిట్టుకున్నా.ఒక్కో సారి ఒక్కో కాన్సెప్ట్ తెల్సుకుంటూ, ఒక్కో విధంగా నష్టపోతూ వున్నా.

ఇప్పటికయినా బుద్ధి తెచ్చుకుని ముందు ముందు జాగ్రత్తగా అలోచించి కొంటానో లేదో మరి. నగల షాపింగ్ చెయ్యడం కూడా ఒక ఆర్ట్. అది నేనెప్పటికీ నేర్చుకుంటానో? :neutral:

పండు బాబుకి ప్రేమతో…

విదేశాలలో వున్న మన వాళ్ళని మీకు అక్కడ ఏమి నచ్చుతుంది అని అడిగితే నూటికి 95 శాతం మంది చెప్పే సమాధానాలలో మొదటి మూడు నాలుగు కారణాలలో ఒకటి,

“బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళ జోక్యం వుండదు మన విషయాలలో” అని. ఎవరికి వారు తాము ఇండియాలో ఎదుర్కొన్న పరిస్థితులని బట్టి అలా అనుకుంటారేమో. కానీ నేను మాత్రం ఎప్పుడూ అలా అనుకోలేదు, ఎందుకంటే బంధువుల వలన, ఇరుగు పొరుగు వారి వలన నేనెప్పుడూ ఇబ్బంది పడింది లేదు. అందరూ వీలయినంత వరకూ స్నేహంగా ఉంటూ ప్రేమని పంచారు, కుదరకపోతే దూరంగా వున్నారు.
ఆరేళ్ళు ఇండియాకి దూరంగా ఉండి ఇప్పుడు తిరిగి వచ్చాక నా అభిప్రాయం ఇసుమంతయినా మారలేదు. తోటివారిని ఆదరించడంలో, సహాయం చేయడంలో, ప్రేమని పంచడంలో మన వాళ్లెప్పుడూ ముందే వుంటారు. ఎక్కడో కొందరు స్వార్థపరులు, అత్యుత్సాహవంతులు వుంటారు, కాదనను. దేవుడి దయ వలన నేను ఇంకా అలాంటివారిని ఎదుర్కోలేదు. పండు బాబు ని తీసుకుని నేనూ, మా ఆయనా వేరే ఇంటికి వచ్చేసాక నాకు పరిచయమయిన ఇరుగు పొరుగు వాళ్ళు మాతో ఎంతో బాగుండటం చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది.
మేము ఈ ఇంటికి వచ్చే అప్పటికి నాకు ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళెవరూ పరిచయం లేరు. ఇదే ఊర్లో చాలా ఏళ్ళుగా ఉంటున్నా, ఈ ఏరియా మాత్రం కొత్తే మాకు. వచ్చిన రెండు మూడు నెలలకే చుట్టూ పక్కల వాళ్ళు బాగా పరిచయమయ్యారు. పండు బాబు వలన ఇంకా కొంచెం దగ్గరయ్యారని చెప్పుకోవచ్చు.

ఎదురింట్లో ఒక అక్క వుంటారు. ఆవిడ వర్కింగ్ లేడీ. ఇద్దరు పిల్లలు. ఇంటి పనులు అన్నీ ఆమే చేసుకుంటారు (పనమ్మాయి లేదు). కనుక ఆవిడ ఎప్పుడూ బిజీ గానే వుంటారు. ఆ అక్క వాళ్ళ పాప ఇంటర్ చదువుతోంది. పండు అంటే చాలా ఇష్టం. రోజూ కనీసం ఒక్క సారయినా వచ్చి వాడిని పలకరించి వెళ్తుంది. ఇంచు మించు ప్రతి రోజు కాలేజ్ నుండి వచ్చాక వాడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆడిస్తుంది. మొన్నో రోజు ఇలానే వాళ్ళింట్లో ఆడుకుంటూ వున్నాడు. అప్పుడు ఆ అక్క వాళ్ళ బాబు బయట నుండి వస్తూ బొండాలు తెచ్చాడుట. మా బుచికి ఏమో వాటి మీద పడిపోయి తినాలని ట్రై చేశాడుట (నేను ఇంట్లో ఏమీ పెట్టి పంపనని అనుకోవద్దు, మా వాడికి అప్పుడే పొరుగింటి పుల్లకూర రుచిగా అనిపిస్తోంది మరి). కానీ అవి హోటల్ నుండి తెచ్చినవి కావడంతో అక్క వద్దని తీసేసుకుని వాడికి వేరేవి తినేవి ఏవో పెట్టి పంపింది. వాళ్ళ పాప వచ్చి నాకు చెప్పింది, పండుకి బొండాలు చేసి పెట్టండి అని. కానీ నాకు బద్ధకం కదా. అసలు నూనెలో వేయించేవి ఏవీ నేను చెయ్యను (ఆరోగ్యానికి మంచిది కాదు అన్న స్పృహతో కాదు, నూనె అంటే భయం నాకు :P ). అదే చెప్పాను తనతో. వెళ్లి వాళ్ళ అమ్మతో చెప్పినట్టుంది. ఈ రోజు సాయంత్రం అక్క పాపం వీడి కోసం తీరిక చేసుకుని ఇంట్లోనే బొండాలు చేసి పంపింది. ఆవిడ ఇద్దరు పిల్లలతో ఇంటి పని, వంట పని, ఆఫీసు పని చేసుకోలేక సతమతమవుతుంటే ఇదొక అదనపు పని కదా. చాలా మొహమాట పడిపోయాను. పండు గాడు ఏమవుతాడు ఆమెకి? ఎందుకింత ఆప్యాయత? పసి పిల్లాడి కోసం చేసి ఉండొచ్చు. కానీ నేను అసలు ఊహించలేదు. చిన్న విషయమే ఇది. కానీ మనసుకి హత్తుకునే విషయం. UK  లో వుంటే ఇలా వాడి గురించి, వాడి ఆకలి గురించి అమ్మ నాన్నలం అయిన మేము తప్ప ఇంకెవరన్నా ఆలోచించేవారా? లేదు కదా…
ఇలాగే మరో విషయం. పక్క వీధిలో ఇంకో ఆంటీ వుంటారు. నా ఆర్కుట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. ఆవిడ ఇడ్లీలు చాలా బాగా చేస్తారు. అవి తిన్నాక ఇక నేను చేసే ఇడ్లీలు వేస్ట్ అనిపిస్తుంది నాకు. దానికి తగ్గట్టే పండు బాబు ఆ ఆంటీ చేసిన ఇడ్లీలు బాగా లాగిస్తాడు, నేను ఇంట్లో చేస్తే అర ఇడ్లి కూడా తినడు :( నేను ఎంత ప్రయత్నించినా ఆవిడ అంత బాగా చేయలేకపోతున్నాను. నేను అడగకపోయినా ఆంటీ ప్రతి రోజు వీడికి ఇడ్లీలు పంపిస్తుంది ఉదయం టిఫిన్ టైం కి. వాళ్ళింట్లో వేరే ఏ టిఫిన్ అయినా సరే వీడి కోసం మాత్రం ఇడ్లీలు చేసి పంపుతుంది.

ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో. పక్కింటి ఆంటీ అయితే పండు బాబు ఏడవటమో, అరవటమో చేస్తే వెంటనే వాళ్ళ పాపని పంపించి వీడిని తీసుకురమ్మంటుంది. కొంచెం సేపు ఆడించి పంపిస్తుంది. పసిపిల్లల పట్ల ఇష్టం వుండటం సహజమే. కానీ మేము UK లో ఉండి ఉన్నట్టయితే వాడికి చుట్టూ ఇంత మంది ప్రేమని పంచే వాళ్ళు వుండరు కదా. వీళ్ళంతా నాకు చిన్నప్పటి నుండి తెల్సిన వాళ్ళు కారు, అసలు పరిచయమే లేదు. కేవలం పొరుగున ఉంటున్నాం, పసి పిల్లాడు వున్నాడనే దీంతో వాళ్ళు నాకు ఇలాంటి సహాయం చేస్తున్నారు. ఇంత బిజీ బిజీ జీవితాల్లో కూడా పక్క వారి గురించి ఆలోచించే వారి మధ్య వుండటం అదృష్టమే కదా :)

సాగర తీరాన…సంధ్యా సమయానా..

మొన్న ఆదివారం మా పండు బాబు ని తీసుకుని బీచ్ కి వెళ్ళాము. బీచ్ మా ఇంటికి ఇరవయ్ కిమీ దూరంలోనే వున్నా కూడా మేము 4-5  ఏళ్ళకి ఒకసారి కానీ వెళ్ళం. దగ్గరే వుంది కదా ఎక్కడికి పోతుందిలే అని నిర్లక్ష్యం అన్నమాట :) మొత్తానికి ఆదివారం రోజు అమ్మ, నాన్న, నేను, తమ్ముడు, పండు బాబు తో బయల్దేరాం. మా ఆయన్ని అడిగితే ఫోజు కొట్టాడు. మేము లైట్ తీసుకున్నాం.

సాయంత్రం 5  గంటలకి బీచ్ ఒడ్డుకి చేరుకున్నాం. ఆదివారం అవడంతో చాలా చాలా రద్దీగా వుంది. అప్పుడెప్పుడో 2004  లో సునామీ వచ్చిన తర్వాత రోజు బీచ్ ఎలా వుంటుందో చూడాలని వెళ్లాం. మళ్ళీ ఇదే వెళ్ళడం. ఇప్పుడక్కడ బోల్డన్ని షాప్స్ వచ్చేసాయి. బాగా కమర్షియల్ అయిపోయింది. బీచ్ ఒడ్డు ఎంత మారిపోయినా సముద్రం అదే కదా…అదే గాంభీర్యం, అదే హోరు, అదే చల్లని గాలి. చిన్నప్పుడు అయితే నీళ్ళలో దిగి కేరింతలు కొట్టాలని వుండేది కానీ ఈ సారి అలా ఏం అనిపించలేదు. అమ్మ, నాన్న, తమ్ముడు మాత్రం వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లా మారిపోయి అలలతో ఆడి ఆడి అలిసిపోయారు. పండు బాబు ని కూడా వాడి వాకర్ లో వేసి తిప్పారు. అంత నీటిని చూసి వాడు మొదట భయపడ్డాడు కానీ నీళ్ళతో ఆటల్లో పడ్డాక బాగా ఎంజాయ్ చేసాడు. నేను మాత్రం ఒడ్డున కూర్చుని సముద్రాన్ని చూస్తూ కూర్చున్నాను. ఐస్ క్రీమ్స్ తిన్నాము :D


సాయంత్రం 6 .30  దాకా గడిపి ఇంటికి బయల్దేరాము. వస్తుంటే బోల్డన్ని కార్లు ఎదురుపడ్డాయి. ఇంకా బైక్స్ మీద కుర్రాళ్ళు. విపరీతమయిన వేగంతో డ్రైవ్ చేస్తున్నారు. ఏముంది చీకటి పడ్డాక బీచ్ కి చేరుకోడం, అర్ధరాత్రి దాకా తప్ప తాగి అక్కడ షాప్స్ లో దొరికే పీతలు, చేపలు, చికెన్ మింగడం, ఏ తెల్లవారుజామునో ఇళ్ళకి చేరుకోడం. మన రాష్ట్రంలో గుడులూ, బడులూ లేని ఊర్లు ఉంటాయేమో కానీ మందు షాపులు లేని ఊర్లు మాత్రం ఉండవేమో. బీచ్ వున్న ఆ పల్లెటూరు చాలా చిన్నది. వేరే ఏ షాప్స్ పెద్దగా కనిపించలేదు కానీ కనీసం 4 -5  మందు షాపులు అన్నా చూసి వుంటాను :mad:
సో అదీ సంగతి :)

నాన్నా..పులి

చిన్నప్పుడు మనందరం నాన్నా..పులి కథ చదువుకున్నాం కదా, ఆ కథలో లాంటి విషయం నా జీవితంలో కూడా జరిగింది.ఇప్పుడే మా పండు బాబు బజ్జున్నాడు, ఒక గంట దాకా లేవడన్న ధైర్యం తో ఈ పోస్ట్ రాయటానికి సిద్ధమయ్యాను.
 
నేను పదవ తరగతి వరకూ క్లాసు ఫస్ట్/సెకండ్ వచ్చేదాన్ని. అలాగే పదో క్లాసు పరీక్షల్లో నాకు మంచి మార్కులు వచ్చాయి. ఇప్పుడంటే 91% అంటే పెద్దగా పట్టించుకోరు కానీ అప్పట్లో అది టాప్ స్కోరు కిందే లెక్క. ఇక ఇంటర్ కూడా అదే స్కూల్/కాలేజీ లో చదివిద్దామని నాన్న అనుకున్నారు. కానీ మనం వినం కదా. ఇంట్లో ఉండి చదివి చదివి విసిగిపోయాను, కనుక హాస్టల్ లో చేరతాను అని గోల చేసాను (అసలు కారణం నా క్లోజ్ ఫ్రెండ్స్ అంతా నారాయణ మహిళా కళాశాల లో చేరుతున్నారు. అక్కడే హాస్టల్ లో వుంటున్నారు, నేనూ వాళ్ళతో వుండాలని). అప్పట్లో మా ఊర్లో రత్నం, నారాయణ కాలేజీలు టాప్ లో ఉండేవి. నాకు ఫీజు లో రాయితీ ఇస్తాం వాళ్ళ కాలేజీలో చేరితే అని ఆఫర్ ఇవ్వడం తో నేను ఇక కొండెక్కేసాను. మా వాళ్లకి ఇక తప్పక నన్ను హాస్టల్ లో చేర్చారు.
హాస్టల్ లో చేరిన మొదటి వారం బాగానే గడిచింది. తర్వాత మొదలయ్యాయి నా పాట్లు. ఇంట్లో అయితే ఆరింటికి లేచినా సరిపోయేది. ఇష్టమొచ్చి నప్పుడు చదువుకోవచ్చు. బయట ప్రంపంచం కనిపిస్తుంది. టీవీ, సినిమాలు, ఇంటికొచ్చే చుట్టాలు, తమ్ముడితో పోటీలు, పేచీలు అంతా సందడి సందడిగా వుండేది. హాస్టల్ లో తెల్లారుజామున నాలుగింటికి లేవాలి, స్టడీ అవర్స్ కి వెళ్ళాలి , స్నానం దగ్గర, మెస్ దగ్గర క్యూలో నిల్చోవాలి, జైలు లాంటి కాంపస్, చుట్టూ పారిపోకుండా ముళ్ళ కంచెతో గోడ, కళ్ళు తెరిస్తే తాటకి లాంటి వార్డెన్ ముఖం, క్లాసుకి వెళ్తే యముడి లాంటి లెక్చరర్ ముఖం వీటితో నెల రోజులకే హాస్టల్ ముఖం మొత్తేసింది. నెలకి ఒక్కసారి ఇంటికి పంపించేవారు. ఇంటికి రాగానే అమ్మని చుట్టేసుకుని నేనిక హాస్టల్ కి వెళ్ళను మొర్రో అని ఏడ్చేసాను. కానీ ఏం లాభం లేకుండా పోయింది. నాన్న చండశాసనుడు, అస్సలు కరగలేదు. టంచనుగా సెలవు అయిపోగానే హాస్టల్ లో దించేసి వచ్చేసారు.
ఇలా లాభం లేదని ఒక ఉపాయం ఆలోచించాను. బాగా చదివే స్టూడెంట్స్ ని సూపర్ స్పెషల్ బాచ్ (SSB) లో వేసేవాళ్ళు. నన్నూ అందులో వేసి తోమడం స్టార్ట్ చేసారు. చదవకుండా సున్నాలు తెచ్చుకుంటే ఇంట్లో ఉంటేనే చదువుతోంది, హాస్టల్ లో చదవట్లేదు అని ఇంటికి తీసుకెళ్ళి పోతారని ప్లాన్ వేసి తర్వాత పెట్టిన వీకెండ్ పరీక్షలు సరిగ్గా రాయకుండా కొన్ని సబ్జక్ట్స్ లో సున్నాలు, మరి కొన్నిట్లో అయిదు,పది మార్కులు తెచ్చుకోడం మొదలుపెట్టాను. అలా ఒక రెండు నెలలు గడిచాయి. సూపర్ స్పెషల్ బాచ్ లో వున్నా నన్ను తీసుకెళ్ళి సూపర్ డ్రిల్లింగ్ బాచ్లో వేసారు :cry: ఇక్కడ మరీ టార్చర్ పెట్టేవారు. తెగ తిట్టేసేవారు, నాకేమో మాట పడాలంటే తెగ ఉక్రోషంగా వుండేది. ఇంట్లో వాళ్ళు మాత్రం తిక్క బాగా కుదిరింది అని నా ముఖం మీదే అనడం స్టార్ట్ చేసారు. ఇంటికి తీసుకెళ్ళే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అలా నేను వేసిన మొదటి ప్లాన్ బెడిసికొట్టింది. చచ్చినట్టు మళ్ళీ అన్ని పరీక్షల్లో మంచి మార్క్స్ తెచ్చుకుని హాఫ్-ఇయర్లీ పరీక్షలోచ్చేసరికి మళ్ళీ SSB లో చేరాను.

అప్పటికి నా మిగతా ఫ్రెండ్స్ అందరూ హాస్టల్ లైఫ్ కి అలవాటు పడ్డారు కానీ నా వల్ల మాత్రం కాలేదు. ఎలా అయినా ఇక్కడ నుండి బయట పడాలి అనుకున్నాను. తర్వాత ప్రతి వారం పది రోజులకి ఒక సారి కడుపు నొప్పి, తల నొప్పి అని చెప్పి వార్డెన్ తో హాస్పిటల్ కి వెళ్ళేదాన్ని. వాళ్ళేవో మందులిచ్చి పంపించేవారు, అవి ఎవరికీ తెలీకుండా బయట పారెసేదాన్ని. అమ్మ వాళ్ళు హాస్టల్ కి వచ్చిన ప్రతి సారి వార్డెన్ చెప్పేవారు..పాపం మీ అమ్మాయి బాగా సిక్ అయిపోతోంది అని. నేను నిజంగానే బరువు కూడా కొంచెం తగ్గి, నీరసంగా కనిపించడంతో అమ్మ నమ్మేసింది. ఇక ఇంట్లోనే చదువుకో లే నాన్నకి నేను చెప్పి ఒప్పిస్తా అనింది. కానీ ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే మా నాన్న దగ్గర నా పప్పులుడకలేదు. ఇంటికి తీసుకురాడానికి నాన్న ఒప్పుకోలేదు. ఫైనల్ గా ఒక సారి ఒక ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ నా ఫ్రెండ్ ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కార్ ఎక్కేసి హాస్టల్ నుండి బయటకి వచ్చేసాను. గేటు పాస్ స్లిప్ ఒకటి సంపాదించి దాని మీద మా ప్రిన్సి సంతకం నేనే పెట్టేసాను 8) ఇంటికి వచ్చిన నన్ను నాన్న చెడా మడా తిట్టి హాస్టల్ లో పడేసి వెళ్ళారు :evil: ప్రిన్సి నాకు వార్నింగ్ఇచ్చింది. ఇక నా కోపం పరాకాష్టకి చేరింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకి ముందు హాస్టల్ లో ఉన్నట్టుండి ఒక అర్ధ రాత్రి పొట్ట పట్టుకుని మెలికలు తిరిగిపోడం మొదలు పెట్టాను. నాలో అంత గొప్ప నటి వుందని అప్పుడే తెల్సింది నాకు :P వార్డెన్, ప్రిన్సి, రూం మేట్స్ అందరూ హడలి పోయేటట్టు గావు కేకలు, పెడబొబ్బలు పెట్టేసరికి ప్రిన్సి కూడా మాతో బయల్దేరి హాస్టల్ వాన్ లో టౌన్ కి వచ్చింది. వాళ్ళు మామూలుగా తీసుకెళ్ళే హాస్పిటల్ రాత్రుళ్ళు వుండదు. Emergency  కి తీసుకెళ్దాం అనుకుంటుంటే అంత నొప్పిలో మా ప్రిన్సి కి గుర్తు చేశా..నాన్న డాక్టర్ కదా మేడం, ఇంటికి తీసుకెళ్ళండి అని. ఎందుకొచ్చిన రిస్క్ అనుకుందో ఏమో మా ఇంటికే తీసుకెళ్ళమని డ్రైవర్ కి చెప్పింది. అలా అర్ధరాత్రి రెండు గంటలకో ఏమో నన్ను ఇంట్లో తీసుకోచి అమ్మ వాళ్లకి అప్పచెప్పి వెళ్ళారు. నా ఏడుపు చూసి నాన్న కూడానమ్మేశారు . Injection  తీసుకొచ్చారు. చచ్చింది గొర్రె, ఇప్పుడు వద్దు అంటే తిట్లు తప్పవు. ఎలారా బాబూ అనుకుంటుండగానే నాన్న వేసేసారు. కాసేపు అటూ ఇటూ దొర్లి పడుకున్నాను. అమ్మ పాపం చాలా భయపడింది.తర్వాత రోజు నాన్న ఏవో మందులిచ్చి వాడమన్నారు. అవి తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేసా. అవి అమ్మ చూసి విషయం అర్ధం చేసుకుంది. రెండు రోజుల పాటు అమ్మ నాన్నతో ఏం చెప్పిందో ఏమో కానీ పరీక్షలు ఇంట్లో వుండే రాయడానికి నాన్న ఒప్పుకున్నారు. ప్రిన్సి కి కూడా నా ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఒప్పించారు. పరీక్షలన్నీ ఇంట్లో వుండే రాసేసాను. ఇక సెకండ్ ఇయర్ ఎలా అయినా ఇంట్లో వుండే చదవాలి అనుకున్నాను. కానీ నాన్న ఒప్పుకోలేదు. మళ్ళీ admission కోసం హాస్టల్ కి వెళ్తే ప్రిన్సి చెప్పేసింది నాన్నకి, మేము చేర్చుకోము అని. హాస్టల్ లో ఎవరన్న నా దొంగ వేషాల గురించి చెప్పారో ఏమో నాకు తెలీదు. కానీ కచ్చితంగా చెప్పేసింది. Disciplinary యాక్షన్ తీసుకోవాలి మీ అమ్మాయి చేసిన పనులకి (సంతకం forgery చెయ్యడం), కానీ మంచి స్టూడెంట్ కాబట్టి correspondent గారు వద్దు అన్నారు. ఇంటికి తీసుకెళ్ళిపొండి అని చెప్పేశారు.
 
నాన్న కోపానికి అంతే లేదు. కానీ ఏం అనలేదు. ఇక చేసేదేం లేక సెకండ్ ఇయర్ Day scholar గా పంపించడానికి ఒప్పుకున్నారు. హమ్మయ్య అనుకున్నా…అక్కడితో కథ సుఖాన్తమయ్యేది. కానీ దేవుడనేవాడు వున్నాడు కదా. చేసిన తప్పులన్నీ చూస్తూ వున్నాడు కదా. మరి మనకి బుద్ధి వచ్చేలా చెయ్యాలి కదా..
 
సెకండ్ ఇయర్ హాయిగా ఇంట్లో ఉండి చదువుకోడం మొదలు పెట్టాను. అంతా బాగానే ఉంది అనుకునేంతలో నాకు మళ్ళీ కడుపు నొప్పి రావడం మొదలయ్యింది. ఈ సారి నిజంగానే. అప్పుడప్పుడూ వచ్చేది. నాన్నకి చెప్తే అస్సలు పట్టించుకోలేదు.
 
వచ్చిన ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోయేది…కనుక నేనూ పెద్దగా పట్టించుకోలేదు..ఆఖరికి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు వచ్చేసాయి. పూర్తిగా చదువు గోలలో పడిపోయాను.
 
ఆ రోజు సంస్కృతం పరీక్ష రాసి ఇంటికి వచ్చాను. భోజనం చేసి అలా మేను వాల్చానో లేదో కడుపులో కుడి వేపు తీవ్రమయిన నొప్పి. అప్పటిదాకా ఎప్పుడూ అంత తీవ్రంగా రాలేదు. సాయంత్రం అయే సరికి భరించలేనంతగా ఎక్కువయింది. నాన్నతో చెప్తే నిజమేనని నమ్మారు. ఏవో మందులిచ్చారు కానీ తగ్గలేదు. రాత్రికి ఇక వాంతులు కూడా మొదలవ్వడంతో అప్పుడు అందరూ కంగారు పడి స్కానింగ్ కి తీసుకెళ్ళారు. అప్పెండిసైటిస్ అని చెప్పారు. ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. నాకింక ఏడుపు ముంచుకొచ్చేసింది. ఇంకా మూడు పరీక్షలు వున్నాయి. నాకు ఇంటర్ తర్వాత బిట్స్ పిలాని లో ఇంజనీరింగ్ చేయాలని కోరిక. ఇప్పుడు ఈ పరీక్షలు రాయకపోతే నా రెండేళ్ళ శ్రమ వృధా అవుతుంది. అందరినీ బ్రతిమాలుకున్నాను. అంతా అలోచించి చివరికి అదేదో conservative ట్రీట్ మెంట్ ఏదో ఇచ్చి ఒక్క వారం రోజుల తర్వాత ఆపరేషన్ చేస్తాం అని  చెప్పారు. ఆ వారం రోజులు ఏవేవో మందులూ, మాకులు, పత్యం తిని పరీక్షలు రాసాననిపించాను. బాగానే రాసాను కానీ పరీక్షలయిన మరుసటి రోజే పేపర్స్ లీక్ అయ్యాయి కేన్సిల్ చేసి మళ్ళీ పెట్టాలి అన్నారు. హతవిధీ అనుకున్నాను. ఆ ట్రీట్ మెంట్ ఫలితమో ఏమో నేను కొద్దిగా కోలుకున్నాను. ఇంకో ఇరవయ్ రోజుల్లో ఎంసెట్ పరీక్ష వుంది. పదిహేను రోజుల్లో ఐ ఐ టి పరీక్ష. మధ్యలో TCET .  ఇవన్నీ రాసాక చేయించుకుంటా అని మొండికేసాను. మొండివాడు రాజు కంటే బలవంతుడు అని ఊరికే అనలేదు కదా. సరే అని వాయిదా వేసారు. ఆ కొద్ది రోజులూ చాలా జాగ్రత్హగా ఉండమని చెప్పారు డాక్టర్స్. మొత్తానికి TCET ,   ఐ ఐ టి ఎలాగో రాసాననిపించాను. అస్సలు బాగా రాయలేదు ఇంటర్ పరీక్షలు కేన్సిల్ అయ్యాయన్న దిగులు, హెల్త్ పాడయింది అన్న దిగులు తో సరిగ్గా రాయలేదు.

మే తొమ్మిదో తారీఖున ఎంసెట్ పరీక్ష. ఆ రోజు ఆరవ తేది. ఆ సాయంత్రం మళ్ళీ నొప్పి మొదలయ్యింది. వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. స్కాన్ లో తేల్చి చెప్పేశారు, బర్స్ట్ అయింది ఇక ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాను అని, ఇక నా చేతుల్లో ఏముంది కనుక, వెంటనే అడ్డంగా పొట్ట కోసేసి ఆపరేషన్ చేసేసారు. హాస్పిటల్ లో వున్న నన్ను అందరూ పరామర్శించి వెళ్ళారు. నాకేమో ఎంసెట్ రాయలేనేమో అని దిగులు. ఇంటర్ ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టినప్పుడు ఎలా రాస్తానో, బిట్స్ లో admission  కి తగిన స్కోరు వస్తుందో రాదో అన్న అపనమ్మకం. ఐ ఐ టి ఆశ వదిలేసాను. TCET  రాసావు కదా అందులో ఏదో స్కోరు వస్తుంది కదా, డొనేషన్ కట్టేస్తాము అని అమ్మ నాన్న చెప్పారు. కానీ నాకు తమిళనాడు లో చదవడం ఇష్టం లేదు. ఏదో ఊరికే రాసాను అంతే. ఇక మిగిలింది ఎంసెట్ ఒక్కటే కదా. తొమ్మిదో తేది వచ్చేసింది. ఇంకో మూడు గంటల్లో పరీక్ష. నాకేమో వెళ్లి రాయాలని వుంది. అమ్మతో చెప్పాను. ఈ ఒక్క సారి నా మాట వినండి అని బ్రతిమాలాను. అమ్మమ్మ అయితే ససేమిరా అంది. నాన్న అమ్మ మాత్రం ఏ కళ నున్నారో ఒప్పుకున్నారు. wheelchairlo తీసుకెళ్ళి పరీక్ష రాయించారు. నాకిప్పటికీ నమ్మశక్యంగా వుండదు ఆ రోజు ఎలా వెళ్లి రాసానో అని. పరీక్ష హాల్లో అంతా నన్ను జాలిగా చూసారు. అస్సలు calculation అనేది చెయ్యకుండా A B C D  లు ఏవి తోస్తే అవి మార్క్ చేసేసి వచ్చాను.

పరీక్ష రాసేసి వచ్చాక ఇక అడ్డంగా పడిపోయాను. ఆ పడడం మళ్ళీ ఇంటర్ ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టారు కదా, అప్పుడు లేచాను. అప్పటికి కొంత తేరుకున్నాను కానీ అస్సలు ఏమీ చదవలేకపోయాను. పూర్తిగా depression  లో కూరుకుపోయాను. ఏదో రాసాననిపించాను అంతే. బిట్స్ పిలాని ఆశలు వదిలేసుకున్నాను. KCET రాసాను తర్వాత. కానీ దేని మీదా ఆశ లేదు. డిగ్రీలో చేరడానికి కూడా సిద్దమయ్యాను.
ప్రతి రోజూ ఏడ్చేదాన్ని. ఫస్ట్ ఇయర్ లో వుండగా అలా అబద్ధాలు చెప్పి ఉండకపోతే సెకండ్ ఎఅర్లో నిజంగా నొప్పి రావడం మొదలయిన వెంటనే నాన్న స్కానింగ్ కి పంపేవారు, అప్పుడే ఆపరేషన్ చేసేసేవారు కదా అనుకునేదాన్ని.రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్లో 90 % వచ్చింది. కానీ ఆ స్కోరు తో బిట్స్ లో సీట్ రాదు. TCET లో మంచి స్కోరు వచ్చింది. ఇష్టం లేకపోయినా తమిళనాడులో చేరాలని డిసైడ్ అయ్యాను. KCET లో కూడా పర్లేదు మంచి స్కోరు వచ్చింది. కానీ తమిళనాడు లోనే చేరాలని అనుకున్నాను. EAMCET రిజల్ట్ వచ్చే రోజు అస్సలు నా మనసు మనసులో లేదు. నా ఫ్రెండ్స్ అందరికీ మంచి మంచి రాంక్స్ వచ్చి వుంటాయి. నేనసలు qualify  కూడా అయి ఉండను అనుకున్నాను. అమ్మ వాళ్ళు మాత్రం ఎక్కడో మినుకుమినుకు మంటున్న ఆశతో రిజల్ట్స్ చూసారు. 8050  రాంక్. నాకు నోట మాట రాలేదు. ఆనందభాష్పాలు అంటే ఏంటో మొదటి సారి అర్ధమయ్యింది నాకు. అది ఏమంత పెద్ద గొప్ప రాంక్ కాకపోయినా ఆ రాంక్ తో మంచి కాలేజ్ లోనే సీట్ వస్తుంది. Govt  కాలేజ్ లో కాకపోయినా ప్రైవేటు కాలేజెస్ లో వస్తుంది.
 
నా టైం బాగుండి సిద్ధార్థ లో నాకు ఇష్టమయిన బ్రాంచ్ లోనే సీట్ వచ్చింది. కానీ ఇప్పటికీ నాకు ఆ guilt ఫీలింగ్ పోలేదు. అప్పుడు అలా ఆకతాయిగా ప్రవర్తించకుండా ఉండి వుంటే ఇంకా మంచి చోట చదివే అవకాశం వుండేదేమో. చేజేతులా నాశనం చేసుకున్నాను నా చదువుని అనిపిస్తుంది. అప్పటి వరకూ క్లాసు లో టాప్ 3 – 5 లో వుండేదాన్ని, తర్వాత above  average  స్టూడెంట్ గా మారిపోయాను. ఒక చిన్న అబద్ధం అలా నా జీవితాన్ని మార్చేసింది.
 
దేవుడు బాగా బుద్ధి చెప్పాడు నాకు :neutral:

ఒక చిన్ని ప్రేమ కథ

విజయవాడ రైల్వే స్టేషన్
 
2000 మార్చ్ నెల మొదటి వారం. ఎండలు అప్పుడప్పుడే ముదురుతున్నాయి. సాయంత్రం 6 గంకి గొల్లపూడి-పోరంకి (నెంబర్ 1) సిటీ బస్సులో నుండి స్టేషన్ ముందు బస్సు స్టాప్ లో దిగాను. ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసి ఒక రెండు రోజులు సెలవు దొరకడం తో ఇంటికి బయల్దేరాను. లగేజ్ ఎక్కువ లేకపోడం తో నేనే బాగ్ మోసుకుంటూ టికెట్ కౌంటర్ దగ్గరకి వెళ్లి నెల్లూరు కి ఒక టికెట్ తీసుకుని ప్లాట్ ఫాం మీదకి వెళ్లాను. నేనెప్పుడూ ఎక్కే గోరఖ్ పూర్ – కొచ్చిన్ ఎక్స్ప్రెస్ ఈ సారయినా ఒకటో ప్లాట్ ఫాం మీదకి వస్తుందేమో అని ఆశగా డిస్ప్లే వేపు చూసాను…ఊహు…అదేం ఖర్మో ఎప్పుడూ లాస్ట్ ప్లాట్ ఫాం మీదకే వస్తుంది ఆ రైలు.ఆఖరి ప్లాట్ ఫాం మీద ఏమీ షాప్స్ వుండవు, జనాలు వుండరు, వెయిట్ చెయ్యాలంటే బోరు.అందుకే ఇష్టం లేదు నాకు. కానీ చేసేదేం లేక కాళ్ళీడ్చుకుంటూ మెట్లెక్కి చివరి ఫ్లాట్ ఫారం మీదకి చేరుకున్నాను. రైలు రావడానికి ఇంకా అరగంట టైం వుంది.వాక్ మాన్ లో నాకిష్టమయిన పాత హిందీ పాటలు వింటూ కాలక్షేపం చేస్తూ వున్నాను. ఆ రోజు లక్నో వర్క్ చేసిన బేబీ పింక్ కలర్ చుడిదార్ వేసుకుని వున్నాను. ఇంటికి వచ్చేప్పుడు ముఖం వేళ్ళాడేసుకుని రావొద్దని అమ్మ వార్నింగ్ ఇవ్వడంతో చక్కగా గంజి పెట్టిన డ్రెస్ వేసుకుని తలస్నానం చేసి హాస్టల్ లో బయల్దేరాను. ఎందుకో ఆ రోజు కొంచెం ప్రత్యేకంగా వున్నానేమో అనిపించింది ప్లాట్ ఫాం మీద ఒకరిద్దరు ఒంటరిగా కూర్చుని వున్న నన్ను కొంచెం తదేకంగా చూస్తుంటే. ఇరవయ్ ఏళ్ళ ఆడపిల్ల కి తనని ఎవరన్నా  ఒకటికి రెండు సార్లు గమనిస్తూ వుంటే ఎలా అనిపిస్తుందో నాకూ అలానే అనిపించి లోలోన మురిసిపోయాను :)


రైలు వస్తున్నట్టు అనౌన్సుమెంటు వినిపించింది. బాగ్ పట్టుకుని లేచి నిల్చున్నాను. నా వెనకాల బెంచి మీద నుండి మరో సాల్తి వెంటనే లేచి నిలబడడం తో వెనక్కి తిరిగి చూసాను. ఎవరో ఒకబ్బాయి, పాతికేళ్ళు ఉంటాయేమో. రైలు వచ్చి ఆగింది. నేను జనరల్ కంపార్ట్ మెంట్ టికెట్ కొనుక్కున్నా కూడా అందులో ఎప్పుడూ సీట్  ఉండదని రిజర్వ్డ్ కంపార్ట్ మెంటే ఎక్కుతాను. టీ.సీ కి ఒక వంద ఇస్తే సీట్ ఇచ్చేవారు. అప్పుడు కూడా అలానే రిజర్వ్డ్ కంపార్ట్ మెంట్ వైపు నడిచాను. నా వెనకాలే ఆ అబ్బాయి కూడా. భోగి అంతా ఖాళీగా వుంది ఆ రోజు ఎందుకో. మొత్తం భోగీలో పది మంది కూడా లేరు. ఒక ఖాళీ కూపే లో కిటికీ సీట్ చూసుకుని సెటిల్ అయ్యాను. మళ్ళీ పాటలు వింటూ నా లోకంలోకి వెళ్ళిపోయాను.విజయవాడ జంక్షన్ కావడంతో రైలు ఒక 20 నిమిషాల పైనే ఆగి తీరిగ్గా బయల్దేరింది కూతేసుకుంటూ. రైలు కదలగానే ప్రకాశం బ్యారేజ్ చూడటం కోసం కిటికీ లో నుండి బయటకి చూడసాగాను. ఎదురు సీట్ లో కూడా నా లాగే మరో శాల్తీ అలానే చూస్తుండటం తో తల తిప్పి చూసాను. ఇందాక కనిపించిన అబ్బాయి. భోగీ అంతా ఖాళీగా పెట్టుకుని నా ఎదురుగానే సెటిల్ అవాలా అని విసుగ్గా ముఖం తిప్పుకున్నాను (అతనికి రిజర్వేషన్ వున్నట్టు అనిపించలేదు మరి). కూపేలో ఒక్కదాన్నే అయితే నా ఇష్టం వచ్హినట్టు కాళ్ళు చాపుకునో పడుకునో ప్రయాణం చెయ్యొచ్చు అనుకున్నాను. ఇప్పుడు ఎదురుగా ఒకబ్బాయిని పెట్టుకుని ఫ్రీగా ఉండలేను కదా. సరేలే ఎం చేస్తాం అని ప్రకాశం బ్యారేజ్ చూడసాగాను. కొంచెం సేపట్లో రైలు బ్యారేజ్ దాటి స్పీడ్ అందుకుంది. నేను మళ్ళీ పాటలు వింటూ కూర్చున్నాను.

ఇంతలో టీ.సీ వస్తే టికెట్ + వంద ఇచ్చాను. క్యాసెట్ అయిపోవడం తో వాక్ మాన్ పక్కన పెట్టి బాగ్ లోనుండి స్వాతి వీక్లీ తీసుకుని చదవడం మొదలు పెట్టాను. హాస్టల్ లో వున్నా కూడా స్వాతి తెప్పించుకునేదాన్ని. అదే జర్నీలో చదవొచ్చని తెచ్చుకున్నాను. ఫయిర్ బ్రాండ్ పేరుతో ఒక సీరియల్ వచ్చేది.

అది చదువుతూ వుండగా “ఎక్స్క్యూజ్ మీ ” అని వినిపించింది. తలెత్తి చూసాను. ఎదురు సీట్లో వున్న అబ్బాయి. “వాక్ మాన్ ఇస్తారా” అని అడిగాడు. ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు, కానీ ఇవ్వను అని చెప్పలేను కదా.సో ఇచ్చాను.మళ్ళీ బుక్ లోకి తల దూర్చాను.

మధ్యలో అతను నన్ను గమనిస్తున్నట్టు అనిపించి తలెత్తి చూసాను. నిజమే పాటలు వింటూ (వింటున్నాడో లేక ఆ పాత పాటలు వినలేక వింటున్నట్టు నటిస్తున్నాడో అర్ధం కాలేదు) నన్ను చూస్తూ వున్నాడు. నేను తలెత్తగానే చూపు తిప్పేసుకున్నాడు. నేను పట్టించుకోనట్టు మళ్ళీ పుస్తకంలోకి తల దూర్చాను. ఇంకొంచెం సేపయ్యాక మళ్ళీ ఓరకంట చూసాను. దొంగ సచ్చినోడు ఇంకా నన్నే చూస్తున్నాడు. కోపంగా లేచి వెళ్లి అటు వేపు ఖాళీగా వున్న సైడ్ లోయర్ బర్త్ లో కూర్చున్నాను. అతను ఏదో పనున్నట్టు తన బాగ్ ఓపెన్ చేసి ఏదో చూసుకున్నాడు . అసలే ఖాళీ భోగీ. ఏమయినా వెధవ వేషాలు వేస్తే ఎలా అనుకున్నాను. కానీ చూస్తే అలా లేదు. జీన్స్ వేసుకుని కొంచెం పొడుగ్గా  వున్నాడు.డీసెంట్ గానే అనిపించాడు.నా లాగే స్టూడెంట్ అనుకుంటా.సర్లే ఇంకెంత 3 గంటలు జర్నీ. సైట్ కొట్టుకోనీ వాడి ఆనందాన్ని నేనెందుకు తప్పు పట్టాలి, ఓవర్ చేస్తే అప్పుడు చూసుకుందాంలే అని మళ్ళీ చదువుకోసాగాను.
ఒంగోలు స్టేషన్ వచ్చింది. అతను నా దగ్గరకి వచ్చి వాక్ మాన్ ఇచ్చేస్తూ “మంచి పాటలండీ, పాత హిందీ సినిమా లంటే నాకు చాలా ఇష్టం” అనేసి రైలు దిగి వెళ్ళాడు. అబ్బో పర్లేదే అనుకుంటూ వాక్ మాన్ బాగ్లో పెట్టేసి కిటికీ నుండి బయటకి చూడసాగాను. రైలు కదలసాగింది. ఇతనేమో ఇంకాఎక్కలేదు . అక్కడే దిగిపోయాడా అనుకుంటే అతని బాగ్ లోపలే వుంది. ఇదే సీన్ ఒక పదేళ్ళ తర్వాత జరిగి వుంటే ఏ ఉగ్రవాదో అనుకుని హడలి చచ్చేదాన్నేమో. ఇంతలో ప్లాట్ ఫాం మీద నుండి పరిగెత్తుకుంటూ వచ్చి రైలెక్కాడు. నా సీట్ దగ్గరకి వచ్చి ఎదురుగా కూర్చుని బిస్కట్ ప్యాకెట్ ఓపెన్ చేసి నాకు ఆఫర్ చేసాడు.హమ్మో తింటే ఇంకేమన్నా ఉందా, ఎన్ని సినిమాల్లో చూడలేదు. వద్దు అన్నాను. ఏమనుకున్నాడో ఏమో మళ్ళీ ఏం మాట్లాడకుండా తన సీట్  వేపు వెళ్లి బాగ్ లో నుండి ఏదో బుక్ తీసి చదువుకుంటూ బిస్కట్లు తినసాగాడు. అనవసరంగా అపార్ధం చేసుకున్నానేమో అనిపించింది.

స్వాతి చదవడం అయిపొయింది. బోరు కొట్టి అటూ ఇటూ దిక్కులు చూస్తూ కూర్చున్నాను. అప్రయత్నంగా అతని వేపు చూసాను. వెంటనే లేచి వచ్చి నా ఎదురుగా సెటిల్ అయ్యాడు. ఎప్పుడు చదవడం ఆపుతానా అని చూస్తున్నాడో ఏంటో మరి.
“ఎక్కడి దాకా వెళ్తున్నారు” అని అడిగాడు
“నెల్లూరు” అన్నాను.
“బెజవాడ లో చదువుతున్నారా?”
“ఆ”
“ఇంజినీరింగా?”
“ఆ”
“నేను కూడా ఇంజినీరింగే నండీ. Trichyలో M.Tech చేస్తున్నాను”
నిన్నెవరు అడిగారు నాయనా అనుకుంటూ “ఓహో” అన్నాను.
“సిద్ధార్థ లోనా”
వామ్మో ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం శ్రేయస్కరం కాదు అనుకుని “కాదు, కోనేరు లక్ష్మయ్య కాలేజీ” అని అబద్ధం చెప్పేసి నా బాగ్ ఓపెన్ చేసి అందులో ఏదో వెతకసాగాను (ఏమీ లేదు ఉత్తుతినే).
మళ్ళీ ఇక అతని వేపు తిరిగే సాహసం చేయకుండా కిటికీ లోనుండి  బయటకు చూస్తూ కాసేపు, నిద్రపోయినట్టు నటిస్తూ కాసేపు మేనేజ్ చేసాను. ఈ లోగా నెల్లూరు స్టేషన్ వచ్చేసే టైం అయింది. రైలు పెన్నా బ్రిడ్జి మీదకి రాగానే అతని వేపు చూడకుండా నా బాగ్ తీసుకుని దిగుదామని లేచాను. నా వెనకే అతను డోర్ దాకా వచ్చాడు.
రైలు బ్రిడ్జి దాటగానే సడెన్ గా అడిగాడు “మీ పేరేంటి?” అని.
అసలా ప్రశ్న ఊహించకపోడం తో అప్రయత్నంగా నిజం చెప్పేసాను “సిరిచందన” అని.
“చాలా బాగుందండీ, నా పేరు శ్రీనివాస్” అన్నాడు. మళ్ళీ ఏదో అడుగుదామనుకున్నాడు కానీ నేను యమా సీరియస్ గా ముఖం తిప్పుకున్నాను. ఇక మాట్లాడలేదు.
స్టేషన్ రాగానే రైలు దిగాను.నా వెనకే అతనూ దిగాడు.నేను ఇక వెనక్కి కూడా తిరిగి చూడకుండా గబగబా బయటకి వచ్చేసాను. అప్పటికే రాత్రి 10 దాటింది. సేఫ్ గా ఇల్లు చేరుకున్నాను.అతని సంగతి ఇక మర్చిపోయి నా రొటీన్ లో పడిపోయాను.
*********************************************
దాదాపు రెండున్నర నెలల తర్వాత external exams రాసేసి ప్రాక్టికల్ ఎక్సామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ వున్నాను. ఆ రోజు మధ్యహ్నం మా హాస్టల్ రూము లో కూర్చుని ఏవో రికార్డ్స్ చూసుకుంటూ వున్నాను. ఇంతలో కింద నుండి ఎవరో పిలుస్తున్నారు,
“3/4 సిరి ఫోన్” అని.
నాకు సాధారణంగా హాస్టల్ కి ఎవరూ ఫోన్లు చేయరు. ఈ టైములో ఎవరబ్బా అనుకుంటూ కిందకి వెళ్లి ఫోన్ తీసుకున్నాను,
“హలో”
“హలో, సిరిచందన గారా అండీ?”
“అవునండీ, మీరెవరు”
“నా పేరు శ్రీనివాస్ అండీ. రెండు నెలల క్రితం ట్రైన్లో కలిసాం. మీరు విజయవాడ నుండి నెల్లూరు వెళ్తున్నారు గోరఖ్ పూర్ – కొచ్చిన్ ఎక్స్ ప్రెస్ లో “
“హలో, గుర్తొచ్చానా అండీ”
“ఆ…ఆహ”
“Trichy లో చదువుతున్నానని చెప్పానూ”
అతను గుర్తొచ్చి నా మెదడు ఒక్కసారిగా మొద్దుబారినట్టయింది.
“ఆ..ఆ”
“గుర్తొచ్చానా”
“ఆ”
“మిమ్మల్ని ఒక్కసారి కలిసి మాట్లాడాలండీ”
“……”
“ప్లీజ్..మీ contact  నం కనుక్కోడానికి చాలా కష్టపడ్డానండీ. మీరేమో KLC అని చెప్పారు. అక్కడ మా ఫ్రెండ్స్ కి మీ పేరు, ఊరు  చెప్పి కనుక్కోమంటే ఎవరూ లేరన్నారండీ.ఎందుకయినా మంచిదని సిద్దార్ధలో ఫ్రెండ్స్ ని కూడా అడిగితే అప్పుడు తెల్సిందండీ. అబద్ధం ఎందుకు చెప్పారు?”జ
అప్పటికి నాకు కొంచెం మెదడు స్వాధీనంలోకి వచ్చినట్టనిపించింది.
“నాకెందుకు ఫోన్ చేసారు. ఆ రోజు మిమ్మల్ని చూసి మీకు నిజం చెప్పాలనిపించలేదు, చెప్పలేదు అంతే”
“ప్లీజ్..మీరు నన్ను మరోలా అనుకోకండి.నేను చెప్పేది వినండి”
“ఇది హాస్టల్ ఫోన్. ఇలాంటి కాల్స్ చెయ్యడం ఏమీ బాగాలేదు, ఇంకెప్పుడు ఇలా కాల్ చెయ్యకండి”
“ప్లీజ్ కట్ చేయకండి, ఒక్కసారి మీతో మాట్లాడాలి.రెండు నెలల నుండీ చాలా డిస్టర్బ్ అయి వున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి రైల్వే స్టేషన్ లో8th ప్లాట్ ఫాం లో వెయిట్ చేస్తూ వుంటాను. అక్కడే మిమ్మల్ని మొదటి సారి చూసాను. మీరు ఒక్క సారి వచ్చి నేను చెప్పేది వినండి. ప్లీజ్”

నేను ఫోన్ పెట్టేసాను. నాకు గుండె దడ మొదలయ్యింది. ఏమిటిది? ఏం జరుగుతోంది? అంతా గందరగోళంగా అనిపించింది. పరుగున వచ్చి నా రూములో పడ్డాను. అసలెవరతను? ఒక్క సారి రైల్లో కల్సి ప్రయాణం చేసినంత మాత్రాన ఎంత ధైర్యంగా ఫోన్ చేసాడు? నా పేరు చెప్పి చాలా పొరబాటు చేసాను. ఇప్పుడేం చేయాలి. ఇలా పదేపదే ఫోన్ చేసి విసిగిస్తే ఎలా? ఫోన్లో మాటలు ఎక్స్టెన్షన్ లో ఎవరన్నా వింటే ఏమన్నా ఉందా? (మా హాస్టల్ కి వచ్చే ఫోన్లు అన్నీ బోయ్స్ హాస్టల్ నుండే కనెక్ట్ అవుతాయి). ఎలా ఇప్పుడు?

ఒక సీసా మంచి నీళ్ళు తాగి మంచం మీద పడుకుని ఆలోచించసాగాను.
అసలతను ఎందుకు కాల్ చేసాడు. స్టేషన్ కి వెళ్తే ఏం చెప్తాడు? ప్రేమిస్తున్నాను అంటాడా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడా? లేకపోతే ఇంకేం చెప్తాడు. ఇరవయ్ ఏళ్ళ అమ్మాయి ఎలా ఆలోచిస్తుందో అలానే ఆలోచించాను. అతను నన్ను కల్సుకోవాలనుకోడానికి ఇంతకంటే వేరే కారణం ఏమీ కనిపించలేదు నాకు. వెళ్ళకూడదు అనుకున్నాను.
ఇంతలో నాలో వున్నా చిలిపి పిల్ల నిద్ర లేచింది. వెళ్తే ఏమవుతుంది? మనమేమన్నా అతను ఐ లవ్ యు చెప్పగానే ఎస్ చెప్తామా ఏంటి?  అసలతను ఏ ధైర్యం తో చెప్తాడో చూద్దాం. థ్రిల్ ఎందుకు మిస్ అవాలి నేను ? వెళ్దాం, ఏమయితే అదవుతుంది. పిలిచింది స్టేషన్ కే కదా, ఏ పార్కో, సినిమాకో కాదుగా అనుకున్నాను.

భయం భయంగానే రెడీ అయి బయల్దేరాను. ఫ్రెండ్స్ అడిగితే పిన్ని వాళ్ళింటికి అని చెప్పాను. స్టేషన్ కి వెళ్ళే బస్సు ఎక్కి కూర్చుని అతను ఎలా ఉంటాడో గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించాను.ఊహూ..గుర్తురాలేదు. పొడుగ్గా, చామనచాయతో వున్నాడు, జీన్స్ వేసుకున్నాడు. అంతకు మించి ముఖం ఎలా ఉంటుందో అసలు గుర్తు రాలేదు. ఒక వేపు తప్పు చేస్తున్నానన్న భయం, టెన్షన్. మరో వేపు ఏదో తెలీని థ్రిల్, excitement. అమ్మ నాన్నలకి తెలిస్తే కాళ్ళు విరక్కొడతారు. ఎలా తెలుస్తుంది? ఎవరన్నా చూస్తే? చూస్తే ఫ్రెండ్ తో మాట్లాడుతోంది అనుకుంటారు. స్టేషన్ లో అంత మంది వుంటారు కదా, సో అపార్ధం చేసుకోరు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ కూర్చున్నాను. ఆరుం పావు కి స్టేషన్ దగ్గర బస్సు దిగాను. అదే బస్సులో వెనక్కి వెళ్ళిపోదామా అనిపించింది. ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళడం దేనికి అని సర్దిచెప్పుకుని స్టేషన్ లోపలి వెళ్లి ఒక ఫ్లాట్ ఫారం టికెట్ కొనుక్కుని మెట్లెక్కి దిగి  8th ప్లాట్ ఫాం మీదకి వెళ్లాను. జీవితం లో ఎప్పుడూ అంత టెన్షన్  పడలేదు. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. ఏదో రైలు వచ్చే టైం అనుకుంటా. జనాలు చాలా మందే వున్నారు. మెల్లగా నడుచుకుంటూ వెళ్లి అప్పుడే ఖాళీ అయిన ఒక బెంచ్ మీద కూర్చున్నాను. రైలేదో వచ్చింది. అంతా హడావుడిగా వుంది. ఇంతలో నా పక్కన ఎవరో వచ్చి నిల్చున్నట్టనిపించి తల తిప్పాను.ఎదురుగా అతను. గుర్తుపట్టాను. అప్రయత్నంగా లేచినిల్చున్నాను.
“హలో, చందనగారు..బాగున్నారా? “
“ఆ”
“ఇక్కడ కూర్చుందామా?”
“ఆ”
అతను కూర్చున్నాడు. నేనూ అదే బెంచ్ చివర కూర్చున్నాను. అతనెందుకో విజయగార్వంగా ముసిముసి  నవ్వులు నవ్వుతున్నట్టనిపించింది. ఛీ ఛీ ఎందుకొచ్చానా అనుకున్నాను.
“జ్యూస్ ఏమన్నా తీసుకుంటారా” అని అడిగాడు
“ఊహూ వద్దు “అన్నాను
“పర్లేదు తెస్తాను” అని లేచి వెళ్లి పక్కనే వున్న జ్యూస్ స్టాల్ వేపు నడిచాడు. అతన్నే గమనిస్తూ కూర్చున్నాను (జ్యూస్లో ఏదన్న కలిపితే కనిపెట్టడానికి). ఆరడుగులకి కొంచెం తక్కువ ఉంటాడేమో. స్నఫ్ కలర్ ప్యాంటు వేసుకుని క్రీం కలర్ ఫుల్ హాండ్స్ షర్టు ని టక్ చేసుకుని ఏదో పెళ్లి చూపులకి ప్రిపేర్ అయినట్టు వచ్చాడు. పర్లేదు బాగానే వున్నాడు. మంచి ఫీచర్స్.
రెండు గ్లాసులు పట్టుకుని వచ్చి ఒకటి నాకిచ్చి తానోటి తీసుకున్నాడు.
“మొసాంబి జ్యూస్ ఒక్కటే వుంది అక్కడ. అదే తెచ్చాను”
“…..”
జ్యూస్ మెల్లగా సిప్ చేయసాగాను. ఒక రెండు నిమిషాలు ఏం మాట్లాడలేదు.
“ఐ లవ్ యు చందన. మీరొప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను”
సినిమాల్లో అయితే ఇలా సడన్ గా చెప్తే అమ్మాయికి పొలమారుతుంది. కానీ నేను ఇది ముందే ఊహించి ఉండటంతో నాకేం అవలేదు. మౌనంగా వింటూ వున్నాను.

“మిమ్మల్ని ఫస్ట్ టైం ఈ ప్లాట్ ఫాం మీద చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా ఒద్దిగ్గా, క్యూట్ గా వుంది అనుకున్నాను. తర్వాత రైల్లో నాలుగు గంటలూ మిమ్మల్నే గమనిస్తూ వున్నాను. చాలా చాలా నచ్చేసారు. మీరు రైలు దిగిపోగానే మిమ్మల్ని మర్చిపోతాను అనుకున్నాను. కానీ తర్వాత ఒక్క రోజు కూడా మీ గురించి ఆలోచించకుండా లేను ఇన్ని రోజుల్లో. మీతో ప్రయాణించిన ఆ నాలుగు గంటలు నా జన్మలో మర్చిపోలేను. అలాంటిది మీతో లైఫ్ అంతా కల్సి వుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. మీ పేరు, ఊరు, చదువు తప్ప ఇంకేం తెలీదు నాకు. ఎలాగోలా మిమ్మల్ని కల్సి నా మనసులో మాట చెప్పాలనుకున్నాను. నాకు ఎలా చెప్పాలో కూడా అర్ధం అవట్లేదు. నాకు మీరు చాలా నచ్చారు” అంటూ ఒక్క క్షణం ఆపాడు.
 
నేను తల వంచుకుని ఒడిలో పర్స్ ని గిల్లుతూ వింటున్నాను. అసలేంటి ఇతను. ఇంత సూటిగా ప్రపోజ్ చేస్తున్నాడు. ఇంత ధైర్యం ఏంటి? ఏం తెల్సు ఇతనికి నా గురించి?

“నా గురించి మీకేమీ చెప్పకుండా ఇలా ప్రపోజ్ చేయడం తప్పే. మాది వైజాగ్. అమ్మ నాన్న ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్స్. ఒక తమ్ముడు వున్నాడు. మెడిసిన్ చేస్తున్నాడు వరంగల్ లో. ఇంకో మూడు నెలలో నా ప్రాజెక్ట్ అయిపోతుంది, కాంపస్ ప్లేస్ మెంట్ వచ్చింది. బెంగుళూరు HAL లో. మీరు తప్పుగా అనుకోనంటే ఇంకో మాట. మేము కూడా మీకాస్టే. మీ ఫోన్ నెంబర్ కోసం ప్రయత్నిస్తూ మీ పేరు చెప్పినప్పుడు మీ కాలేజీ లో వున్ననా ఫ్రెండ్స్ చెప్పారు. పేరెంట్స్ అందరినీ నేను ఒప్పిస్తాను”

“ఒక్క క్షణం..ఒక్క క్షణం నన్ను ఊపిరి పీల్చుకోనిస్తారా?” అని కోపంగా అడిగాను.
“అయ్యో..సారీ. చెప్పండి”
“మిమ్మల్ని కలవడం ఇది రెండో సారి. అప్పుడే ప్రేమ, పెళ్లి, పెద్దవాళ్ళ దాకా వెళ్ళిపోయారు. ఎలా కనిపిస్తున్నాను మీకు? ఫోన్ చెయ్యగానే వచ్చేసింది. యస్ చెప్పేస్తుంది నేను ప్రపోజ్ చెయ్యగానే అనుకుంటున్నారా?” మాట్లాడుతుంటే నా గొంతు వణికింది. ఇంకో క్షణంలో ఏడ్చేచేసాలా వున్నాను.

“అయ్యొయ్యో. మీరు అలా అప్ సెట్ అవకండి. ఈ దొరికిన కొంచెం టైములో నా ఉద్దేశం మీకు అర్ధమయ్యేలా చెప్పాలనే పెళ్లి విషయం దాకా వెళ్లాను. అంతే కానీ మీరు వెంటనే ఒప్పేసుకోవాలని కాదు. ప్లీజ్..మీరలా బాధ పడకండి. ముందు ఫ్రెండ్స్ లా ఉందాం. మీ చదువు పూర్తి అవడానికి ఇంకా ఒక సంవత్సరం టైం వుంది కదా. అప్పటికి మీకు నేను నచ్చితే పెద్దవాళ్ళతో చెప్దాము”

నాకప్పటికే కళ్ళు తిరిగుతున్నట్టు అనిపించింది. ఇంకాసేపు అక్కడ వుంటే ఏం జరుగుతుందో అని భయమేసి వెళ్ళడానికి లేచి నిల్చున్నాను. అతనూ లేచాడు.
“ప్లీజ్ చందన నన్ను అపార్ధం చేసుకోకండి. నాకింతకు ముందు ఏ అమ్మాయిని చూసినా ఇలా అనిపించలేదు. ప్రేమ సంగతి పక్కన పెట్టండి. కనీసం ఫ్రెండ్ లా అయినా నన్ను ట్రీట్ చెయ్యలేరా”
“పరిచయం లేని వాళ్ళతో స్నేహం చెయ్యలేను. ఐ యాం సారీ. ఇంకెప్పుడూ నాకు కాల్ చెయ్యకండి. అసలింత వరకూ రావడం కూడా తప్పే. కానీ మీరు పదేపదే ఫోన్స్ చేస్తారేమో అని చెయ్యొద్దు అని చెప్పడానికే వచ్చాను. నాకు ఇలాంటివి నచ్చవు. దయచేసి ఇంతటితో వదిలెయ్యండి”  గబగబా  ముందుకునడిచాను.
“అది కాదండీ. జస్ట్ లెటర్స్ రాస్తాను. రిప్లై ఇవ్వండి చాలు”
“ప్లీజ్. నా వెంట రాకండి. ఎవరన్నా చూస్తే బాగోదు”
“మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి, బట్ నేను మనస్పూర్తిగా చెప్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం”
నేనేమీ మాట్లాడకుండా స్టేషన్ బయటకు వచ్చి ఆటో కోసం నిల్చున్నాను. అతను వెంటే వున్నాడు.
“ప్లీజ్ చందన, ఉత్తరాలు రాస్తే ఏమవుతుంది. మీకు నేను నచ్చితేనే కదా. మీ పేరెంట్స్ ఒప్పుకుంటేనే కదా పెళ్లి. ముందు స్నేహం చెయ్యడానికి ఏముంది?”

ఆటో వచ్చి ఆగింది. నేను వెంటనే ఎక్కి పోనిమ్మన్నాను. ఆటో డ్రైవర్ ముందు సీన్ ఎందుకు అనుకున్నాడో ఏమో “సరే చందన, బై..నేను చెప్పింది ఆలోచించండి” అన్నాడు. ఆటో ముందుకుకదిలింది.
హాస్టల్ కి ఎలా వచ్చానో, రూం కి ఎలా చేరుకున్నానో ఇక ఏమీ గుర్తులేదు. అడ్డంగా మంచం మీద పది ఏడవడం మొదలు పెట్టాను.ఎంత తప్పు చేసాను పిలవగానే అతని ఉద్దేశం ఊహించి కూడా వెళ్లాను.ఛీ ఛీ ఏమయింది నాకు అని ఆలోచిస్తూ ఆ రాత్రి అంతా భారంగానే గడిపాను. ఫ్రెండ్స్ అడిగితే పిన్ని వాళ్ళింట్లో డిన్నర్ చేసాను అని మెస్ కి కూడా వెళ్ళలేదు. ఒక వారం పట్టింది నాకు మామూలు అవడానికి. ఈ లోగా ప్రాక్టికల్స్ పూర్తయ్యి సెలవులిచ్చారు. ఇంటికి వెళ్లిపోయాను.

సెలవుల్లో ఇంట్లో వున్నప్పుడు అతను గుర్తొచ్చి చాలా గిల్టీగా ఫీల్ అయేదాన్ని ఎందుకు స్టేషన్ కి వెళ్ళానా అని. సెలవులు పూర్తి అయి కాలేజికి వచ్చేసాను.
 
నా హాస్టల్ అడ్రెస్ కి  రెండు ఉత్తరాలు వచ్చాయి. నాకు మామూలుగా లెటర్స్ రాసే వాళ్ళ నుండి కాదని కవర్స్ చూస్తే అర్ధం అయింది. అతనే అయి ఉంటాడు అనుకుంటూనే ఓపెన్ చేసాను. నా క్షేమ సమాచారాలు అడుగుతూ తన కాలేజీ విషయాలు రాసాడు. ఆఖర్లో తప్పకుండా రిప్లై ఇవ్వమని తన అడ్రెస్ ఇచ్చాడు. రెండో ఉత్తరం కూడా ఇంచు మించు అలానే వుంది. నేను రిప్లై ఇవ్వలేదు. అలా ఒక నెల గడిచింది. ఇక అతని గురించి మరచిపోతున్న టైం లో మళ్ళీ ఒక శనివారం మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. నాకు అతనే ఏమో అనిపించి నా ఫ్రెండ్ ఒకమ్మాయి తో మాట్లాడించాను (అంతకుముందు ఆ అమ్మాయికి జరిగిన విషయం చెప్పి తిట్లు కూడా తిన్నాను). చూస్తే అతనే ఫోన్ చేసింది. నా ఫ్రెండ్ అతనికి నేను హాస్టల్ లో లేను అని చెప్పింది. హాస్టల్ ఖాళీ చేసి మా పిన్ని వాళ్ళింటికి షిఫ్ట్ అయానని చెప్పి ఇంకెప్పుడూ కాల్ చేయొద్దు అని చెప్పి కట్ చేసింది. తర్వాత అతని నుండి ఇక ఫోన్ కానీ, ఉత్తరం కానీ రాలేదు. నా ఫైనల్ ఇయర్ అయిపోయి ఆ ఊరు నుండి వచ్చేసాను.
 
ఈ కథ ఇక్కడితో కంచికి వెళ్ళిపోయింది.



ఆరంభశూరత్వం

ఈ తెలుగు బ్లాగ్ రాయటం మొదలుపెట్టాలనుకున్నప్పుడు పెద్ద పుడింగిలా అనుకున్నా, క్రమం తప్పకుండా ఇంగ్లీష్ బ్లాగ్ ఎలా రాస్తానో ఇదీ అలానే రాయాలని…కానీ ఒక 7-8 పోస్టులు రాసిన తర్వాత దీని ముఖం చూసిన పాపాన పోలేదు :D
ఇలా ఈ మధ్య కాలంలో నేను చాలా పనులు ఎంతో ఉత్సాహంగా మొదలు పెట్టడం, కొన్ని రోజుల్లో బోర్ కొట్టి వదిలెయ్యడం జరిగింది….మచ్చుక్కి కొన్ని చెప్తా,
1. ఎంబ్రాయిడరీ – ఆ మధ్య పెద్దికి ఒక చీర మీద కుందన్స్ కుట్టిచ్చా..ఆవిడేమో దాన్ని పొరుగింటి పుల్లమ్మ బాగుంది అనగానే దానం చేసేసింది…చేసిందే కాకుండా “మీరు తీసుకోండి పర్లేదు, మా కీర్తి ఎలానూ ఇంట్లో ఖాళీగా వుంది, నేను మరోటి కుట్టించుకుంటా” అని చెప్పిందిట…ఇక నాకు ఒళ్ళుమండి “ఛీ పో! నేనింక కుట్టను” అని చెప్పేసా…అంతే  ఆ పూసలు, దారాలు, సూదుల పెట్టె ఒక మూల పడిపోయింది :evil:
2. ఉన్ని స్వెట్టర్ – సినిమాలు చూసి చూసి ప్రెగ్నంట్ అయిన వాళ్ళంతా పుట్టబోయే పాపాయికి స్వెట్టర్లు, టోపీలు గట్రా కుడతారు కదా అని నేను కూడా నాకు, మా తోడి కోడలికి పుట్టబోయే పిల్లలకి స్వెట్టర్లు కుట్టిస్తా అని మా అత్తగారితో గొప్పగా చెప్పా…తీరా మొదలెడదామనుకునే అప్పటికి ఎవరో చెప్పారు “ఈ టైములో అలా ఎక్కువ సేపు కూర్చుంటే నడుం పట్టేస్తుంది” అని..అంతే ఆ మాటకి భయమేసి ఇక ఆ పని జోలికి పోలేదు…మా అత్తగారు ఇప్పటికీ వేళాకోళం చేస్తుంటారు “ఏం పాపా, స్వెట్టర్లు కుట్టేసావా, ఏ రంగువి” అని :oops:
3. తమిళ భాష నేర్చుకోవడం – తరచూ చెన్నై కి షాపింగ్ అనో, ఇతర పనులకో వెళ్తుంటాం కదా, వాళ్ళ భాష నేర్చుకుందాం అని పుస్తకాలు కొనుక్కొచ్చా..ఒక 4-5 రోజులు చాలా శ్రద్ధగా అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ దాకా నేర్చేసుకుని ఆ తర్వాత బోర్ కొట్టి ఆ పుస్తకాలు ఎక్కడో దాచేసా…కళ్ళెదురుగా కనిపిస్తే గిల్టీ గా ఫీల్ అవుతానేమో అని 8)
4. ట్రాష్ టు ట్రెజర్ – మా ఇంట్లో వుండే చెత్త సామాన్లు మాత్రమే కాకుండా వాళ్ళింట్లో వీళ్ళింట్లో పనికిరాని వస్తువులని పోగేసి ఇంట్లో చేర్చా వాటితో ఏవేవో కళాఖండాలు చేయాలని…మొదలు పెట్టాక నా అయిడియాలు నాకే నచ్చక మధ్యలోనే  ఆపేసా…ఆ చెత్త సామాన్లు పారేస్తూ అమ్మ నా వైపు చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను :neutral:
ఇలా చెప్తూ పోతే అంతే వుండదు..అదేంటో అసలేపని పూర్తి చెయ్యాలనిపించట్లేదు…ఎప్పుడూ అలా పడుకుని ఆలోచిస్తూ గడిపేస్తున్నా టైం అంతా….అదే బాగుంది నాకు…కాకపోతే ఏదో చేసెయ్యాలని ఆత్రం మాత్రం వుంది :P