Wednesday, March 21, 2012

గుత్తికొండ బిలము - మా పల్నాటి సాహస యాత్ర

ఈ పోస్ట్ రాయాలని రెండు నెలల నుండి అనుకుంటూనే వాయిదా వేస్తున్నాను. జనవరి లో విజయవాడ లో జరిగిన పుస్తక ప్రదర్శన కి వెళ్లి అక్కడి నుండి గుంటూరు లో వున్న మా అక్క (మేము అమ్ములు అంటాము) వాళ్ళింటికి వెళ్లాను. ఇక్కడ మా అమ్ములక్క గురించి కొంత చెప్పాలి. తను graduation లో హిస్టరీ మెయిన్ సబ్జెక్టు గా తీసుకుంది. వాళ్ళ పుస్తకాల్లో వున్న చరిత్ర పాఠాలన్నీ ఔపోసన పట్టేసి అప్పటి సామ్రాజ్యాల పట్ల, రాజులు, వాళ్ళు పాలించిన ప్రాంతాల పట్ల విపరీతమయిన ఆసక్తి పెంచుకుంది. ఏదయినా చారిత్రాత్మకమయిన ప్రదేశం దగ్గరలో వుంది అంటే చూడకుండా ఉండలేదు.పోయిన ఏడాది జూలై లో ఏదో ఫంక్షన్ కోసం మేమంతా బళ్లారి లో కలిస్తే అందరినీ పోగేసి హంపి కి తీసుకెళ్ళింది. మిగతా వారి మాట ఎలా వున్నా నాకు మాత్రం ఇలాంటి యాత్రలు నచ్చుతాయి. అంతకుముందోసారి గుంటూరు వెళ్ళినప్పుడు  చేబ్రోలు లో వున్న ప్రాచీనమయిన దేవాలయాలు అన్నీ తిప్పింది. భక్తి తో కాదు, అక్కడి శిల్ప కళలు అవీ చూడటానికి. ఇలా పురాతనమయిన ప్రదేశాలు చూసీ చూసీ, వాటిలో లీనమయిపోయి ఏదో రోజు చంద్రముఖి అవతారం ఎత్తుతుందేమో అన్న భయం కూడా కలుగుతోంది నాకీ మధ్యన.

సరే ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఈ సారి నాకు గుంటూరులో ఒక రోజు ఉండగలిగే అవకాశం కలిగింది మా అత్తగారి దయ వలన (పండు గాడిని ఆమె చూసుకుంది). ఉన్న ఒక్క రోజు ఎలా సద్వినియోగ పరుస్తుందో అనుకుంటూ వాళ్ళింట్లో అడుగుపెట్టాను. అప్పటికే ప్రణాళిక సిద్ధం చేసేసింది. ఈ సారి పల్నాడు ఏరియా చూసెయ్యాలి అని. అందులో ముఖ్యంగా గుత్తికొండ బిలం తప్పనిసరిగా చూడాలి అని చెప్పింది. ఏమిటి దాని విశేషం అంటే అప్పుడెప్పుడో పల్నాటి యుద్ధం జరిగాక విరక్తి చెందిన బ్రహ్మ నాయుడు తపస్సు చేసుకోడానికి ఆ బిలం లోనికి వెళ్లి ఇక తిరిగి రాలేదుట. అలా ఆ బిలం ప్రసిద్ధి చెందిందట. సరే అని మరుసటి రోజు పొద్దున్నే ఏడింటికి అద్దె కారు మాట్లాడుకుని నేను, అమ్ములక్క, నీల్స్ (వాళ్ళ అమ్మాయి) డ్రైవర్ తో బయల్దేరాము. గుంటూరు నుండి ఒక నలభయి నిమిషాలు ప్రయాణం చేసి చిలకలూరిపేట లో highway మీద ఉన్న ఒక హోటల్ లో వడ,సాంబార్ బాగుంటుందని (ఇది కూడా అక్కే చెప్పింది, ఇక్కడ మరో విషయం చెప్పాలి..తనకీ నాలాగానే విపరీతమయిన తిండి పిచ్చి, పుస్తకాల పిచ్చి, సినిమాల పిచ్చి వుంది..ఏ కొత్త ఊరేళ్ళినా అక్కడ  ఏ ఫుడ్ బాగుంటుందో కనుక్కుని, వెతుక్కుని వెళ్లి తింటాం మేము) అక్కడ ఆగి బ్రేక్-ఫాస్ట్ చేసాము. అక్కడి నుండి బయల్దేరి మరికొంత సేపు ప్రయాణం చేసి కోటప్ప కొండ చేరుకున్నాము. కొండ మీదకి వెళ్ళే రోడ్ చాలా బాగుండింది.కోటప్పకొండ లోని త్రికోటేస్వరాలయం లో దేవుని దర్శనం చేసుకుని బయటకొచ్చాము. గుళ్ళో కొనుక్కున్న ప్రసాదం తినాలనుకుంటే ఒక రౌడీ కోతి వచ్చి లాక్కుని వెళ్లిపోయింది. దాన్ని నాలుగు తిట్లు తిట్టుకుని మాచర్ల ప్రయాణమయ్యాము.

ఇక్కడి నుండి మా తిప్పలు మొదలయ్యాయి. గుత్తికొండ బిలము గురించి చాలా మందిని అడిగితే తెలీదు పొమ్మన్నారు. మాచర్ల చుట్టుపక్కల్లో అని ఖచ్చితంగా తెల్సు కాబట్టి అటువేపు ప్రయాణం సాగించాము. చివరికి వెతుక్కుని వెతుక్కుని గుత్తికొండ ఊరు చేరుకున్నాము.ఆ ఊర్లో ఒకరిద్దరిని అడిగితే తెలీదు పొమ్మన్నారు. ఉసూరుమంటూ ఊరు దాటి వెళ్లబోతుంటే పొలిమేర్ల లో ఒక గుంపులోని వ్యక్తి నాకు తెలుసు అని కొండ గుర్తులతో అడ్రస్ చెప్పాడు, "తిన్నగా వెళ్తే సాగర్ కుడికాలువ బ్రిడ్జి వస్తుంది. కాలువ గట్టున ఉన్న మట్టి రోడ్ వెంబడి పోతే ఒక డొంక తగులుతుంది. ఆ డొంక లో కొంత దూరం వెళ్తే కొండ వస్తుంది. అందులోనే మీరడిగే బిలము వుంటుంది" అని.  సాగర్ కుడికాలువ పక్కన ఉన్న మట్టి బాట పట్టాము. మిట్టమధ్యానం, జనవరి నెల అయినా మాడు మాడ్చేసే గుంటూరు జిల్లా ఎండలు. చుట్టూ చీమ చిటుక్కుమన్నా వినిపించే అంత నిశ్శబ్దం. ఒకవేపు కాలువ, మరో వేపు మిరప, వరి పంట పొలాలు. ఎంతదూరం వెళ్ళినా ఆ మనిషి చెప్పిన డొంక రాదే, సరిగ్గానే వెళ్తున్నామా అనుకుంటూ ఇంకా ముందుకి పోయాము. కనీ కనిపించకుండా, కార్ కూడా సరిగ్గా పట్టని ఒక డొంక కనిపించింది చివరికి. డ్రైవర్ ఏమో బిక్క ముఖం వేసాడు. "మేడం, కార్ లోపలికి అయితే వెళ్ళగలదు. కానీ కార్ కి అక్కడేదయినా ప్రాబ్లం వస్తే వెనక్కి తిరి రావాలంటే చాలా కష్టం అవుతుంది. మనుషులెవరూ తిరిగే ప్రదేశంలా లేదు ఇది. ఆడవాళ్ళు, అంత రిస్క్ అవసరమంటారా" అన్నాడు. హన్నా, ఎంత మాటన్నావు, ఇంత దూరం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు అని ముగ్గురం అతన్ని బయల్దేరదీసాం. చేసేదేం లేక ఆ డొంక లోనికి కార్ పోనిచ్చాడు. భీభత్సమయిన రోడ్డు, ఎగుడు దిగుడు బాట వెంబడి పడి ఒక మూడు, నాలుగు కిలోమీటర్ లు పోయాక ఒక కొండ కనిపించింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ కొండ పైకి వెళ్ళాము. అక్కడ నరసంచారం వున్నట్టు కనిపించలేదు. కానీ చిన్న షెడ్, మండపం, అందులో దేవుడి విగ్రహం కనిపించాయి. ఎవరో ఒకరు వుండకపోతారా అని వెతుక్కుంటూ వెళ్లాం. ఒక గడ్డం ఆసామి కనిపించాడు. హమ్మయ్య అనుకుని అతన్ని వివరాలు అడిగాము. మేము కరెక్ట్ గానే గుత్తికొండ బిలానికే చేరుకున్నామని తెల్సుకుని సంతోషించాము. ఇక్కడ ఆ బిలము/గుహ ఎక్కడుంది అని అడిగితే నాతో రండి అని ఒక వేపుకి దారి తీసాడు. అతని వాలకం చూస్తే అనుమానించదగిన విశేషం ఏమీ కనిపించకపోయినా ఎందుకయినా మంచిదని డ్రైవర్ ని వెంట రమ్మన్నాము. ఖర్మ రా బాబూ అనుకుంటూ మమ్మల్ని అనుసరించాడు ఇష్టం లేకపోయినా. ఆ గడ్డం ఆసామి తనతో పాటు పెద్ద టార్చ్ లైట్ తేవడం చూసి ఎందుకూ అని అడిగాము. గుహ లోపల కరెంటు వుండదు తల్లీ, చీకటి, గబ్బిలాలుంటాయి అని చెప్పడం తో నేను, నీల్స్ హడిలి పోయాము. బాబోయ్ మేము రాము అంటే మా అమ్ములక్క మమ్మల్ని తినేసేలా చూసి రావాల్సిందే అని పట్టుబట్టింది. సరే ఏదయితే అది అయింది అని గుహ లోనికి వెళ్లాం. పైన గబ్బిలాలు, కింద వాటి విసర్జితాలు (గుహ లో దేవుడి విగ్రహం వుంటుంది కాబట్టి చెప్పులు తీసేయించాడు). మెట్లు అంతా పాకుడు పట్టి అడుగేస్తే పాతాళానికి జార్చేసేలా వున్నాయి. Oxygen కూడా సరిగ్గా లేక ఒకటే దగ్గు, ఆయాసం వచ్చాయి. మొత్తానికి తక్కుతూ తారుతూ ఒక పావుగంట నడిచాక నీళ్ళ చప్పుడు వినిపించింది. ఆ వేపుగా కొంత దూరం నడిచాక వాగు కనిపించింది. లైట్ వెలుతురు లో ఆ నీళ్ళు ఎంత స్వచ్చంగా వున్నాయో చూసాము. కప్పలు, పాములు, చేపలూ ఏమీ ఉండవని చెప్తే ధైర్యంగా ఆ వాగులో దిగి కాళ్ళూ, చేతులూ, ముఖం కడుక్కుని గట్టున ఉన్న చెన్న కేశవ స్వామి కి ఒక దణ్ణం పెట్టుకుని, కొబ్బరికాయ కొట్టి వెనక్కి బయల్దేరాము. ఆ వాగు వెంబడి పోతే ఏమొస్తుంది అని ఆ గడ్డం ఆసామిని అడిగితే సింపుల్ గా "మీ చావొస్తుంది, వెళ్తారా" అని అడిగాడు. కికికి అని ఒక వెకిలి నవ్వోటి నవ్వుకుని అతని వెంట బయటకి వెళ్ళే దారి పట్టాము. తర్వాత అతనే చెప్పాడు, బ్రహ్మ నాయుడు ఆ వాగు వెంబడి వెళ్ళే అదృశ్యం అయ్యాడు, తర్వాత ఎవరూ అటు వేపు వెళ్ళలేదు అని. బయటకి వచ్చే దారిలో రెండు మూడు సార్లు నేను దారి తప్పబోవడం, అతను కేకలేసి వెనక్కి లాగడం జరిగాయి.

మొత్తానికి గుహ బయటకి రాగానే గాలి పీల్చుకున్నాం. అలా మొత్తానికి మా అమ్ములక్కకి ఉన్న చరిత్ర పిచ్చి వలన ఒక చిన్నపాటి సాహసం చేసి ఆ గుహ చూసి వచ్చాము. అక్కడ ఆ గడ్డం ఆసామి కి కొంత డబ్బిచ్చి అతనికి ఒక నమస్కారం చేసి అతను వండుకున్న పులిహోర కొంత అడుక్కు తిని (ఆకలి మండిపోతోంది అప్పటికి) తిరిగి ఆ డొంక వెంట పడి, మట్టి రోడ్డు ఎక్కి మాచర్ల వెళ్ళే దార్లో పడ్డాము. మాచర్ల కి ముందు ఒక చిన్న ఊరిలో వెలసిన ఒక దేవత వుండే గుడికి కూడా వెళ్లి దర్శనం
చేసుకుని అక్కడి నుండి మాచర్ల లోని చేన్నకేసవ స్వామి ఆలయానికి వెళ్ళాము. ఆ ఊర్లోనే ఒక హోటల్ లో భోంచేసి (సాయంత్రం నాలుగయినా మంచి భోజనమే దొరికింది మాకు). ఆ ఊర్లో  ఉన్న బ్రహ్మ నాయుడు, బాల చంద్రుడు, నాగమ్మ విగ్రహాలు చూసుకుంటూ, చరిత్ర నెమరేసుకుంటూ తిరుగు ప్రయాణమయ్యాము. అటు నుండి గుంటూరు వచ్చే దారి అంతా కోతకి వచ్చిన మిరప చేలతో కళకళ లాడిపోతూ ఉండింది. దార్లో సత్తెనపల్లి లో ఉన్న గడియారం సెంటర్ దగ్గర బెల్లం జిలేబీలు బాగా వేస్తారని తెల్సుకుని ఆ అడ్రస్ కోసం వెతికి, వేసారి దొరక్క బిక్క ముఖాలేసుని గుంటూరు చేరుకున్నాము.

ఈ గుహ, గబ్బిలాల కథ చెప్పి నా కొడుక్కి తర్వాత వారం పాటు సునాయాసంగా అన్నం తినిపించాను :) తర్వాత వాడికి బోర్ కొట్టేసి మళ్ళీ యథా స్థితికి వచ్చేసాడనుకోండి.


ఈ సంగతంతా విని మా ఆయన "నువ్విలాంటి పిచ్చి పనులన్నీ చేసి నీకేదయినా అయితే నా కొడుకేం కావాలి" అని గోల. అంటే తన బాధ నాకేదన్నా అవుతుందని కాదు, నేను పోతే నా కొడుక్కి కష్టం అని అన్నమాట :( ఇదో పెద్ద సాహసం కాకపోయినా తన దృష్టిలో నేను చెయ్యకూడని పనే. అసలు ఒంటరిగా ముగ్గురు ఆడవాళ్ళు ఎలా వెళ్ళారు అలాంటి చోటుకి అని ఒకటికి పది సార్లు అడిగాడు కూడా.

Friday, March 2, 2012

:(

పండు గాడికి ఈ సోమవారం నుండి ఒకటే జ్వరం. జలుబు, దగ్గు తో మొదలయ్యి జ్వరం వచ్చేసింది. 104 ,105 డిగ్రీల జ్వరం. నాకే ఎప్పుడూ ఇంత ఎక్కువ temperature రాలేదు.కొద్దిగా ఒళ్ళు వెచ్చబడితేనే నానా హంగామా చేస్తుంటా. అలాంటిది వీడి ఒళ్ళు పేలి పోతుంటే నాకు నరక యాతన గా వుంది. మామూలుగా చెంగు చెంగున గంతులేసే పిల్లాడు రోజులో మూడు నాలుగు సార్లు జ్వరం ఎక్కువయ్యి నా ఒళ్ళో వాలిపోతే పిచ్చెక్కినట్టు ఉంటోంది నాకు. జ్వరం తగ్గగానే పాపం మామూలుగా అల్లరి చెయ్యాలనే చూస్తున్నాడు.కానీ ఓపిక ఉండట్లేదు వాడికి. ఇంకా ఎన్ని రోజులు పడాలో వాడు ఇదంతా. ఒక స్వాములోరి దగ్గరకి వెళ్లి తాయత్తు కూడా కట్టించాను. Medicines సరే సరి. టానిక్ అంటేనే దూరంగా పరిగెత్తే వాడు ఇప్పుడు బుద్ధిగా తాగుతున్నాడు. తిండి మాత్రం ససేమిరా అంటున్నాడు. ఇక ఈ దెబ్బతో వాడి స్కూల్ anniversary , రాక్షసుడి వేషం అన్నీ కట్.

పిల్లల్లో resistance పెరగాలంటే కొంత suffer అవాలని అర్ధం చేసుకోగలను కానీ ఇంతలా ఎలా భరించగలరు వాళ్ళు అనిపిస్తుంది. వాళ్ళని అలా చూస్తూ కన్న వాళ్ళు పడే నరకం పగ వాడికి కూడా వద్దు అనిపిస్తుంది. భగవంతుడా, ఇక చాలు.