Showing posts with label అభిరుచులు-ఇష్టాలు. Show all posts
Showing posts with label అభిరుచులు-ఇష్టాలు. Show all posts

Monday, February 6, 2012

మా టీవీ మ్యూజిక్ అవార్డ్స్ - 2012


నేను టీవీ ఎక్కువ చూడను. పండు గాడు పుట్టాక అసలే తగ్గించేసాను. ఇప్పుడు ఎప్పుడయినా చూడాలని పెట్టుకున్నా కూడా నా పుత్రరత్నం చూడనివ్వడు. వెళ్లి ఆపేసి 'అమ్మా ..ఆకుందాం(ఆడుకుందాం)' అంటాడు :( పొద్దున్న వాడు స్కూల్ కి వెళ్ళినప్పుడు వంట, నెట్, పుస్తకాలతో సరిపోతుంది నాకు. నిన్న ఆదివారం అవడం తో అమ్మ వాళ్ళింటికి వెళ్ళాము. అక్కడ పొద్దున్నుండి చేతన్ భగత్ రాసిన R2020 (దీని గురించి రివ్యూస్ బ్లాగ్ లో రాస్తాను)  బుక్ పట్టుకుని కూర్చున్నాను. సాయంత్రం కూడా అది చదువుకుంటుండగా అమ్మ టీవీ పెట్టి మా టీవీ లో మ్యూజిక్ అవార్డ్స్ వస్తున్నాయి చూడు నువ్వు కూడా అంది. అదృష్టవశాత్తు పండు గాడు కూడా మమ్మల్ని విసిగించకుండా పక్క ఇంటి పిల్లలతో బిల్డింగ్ బ్లాక్స్ తో ఆడుకుంటూ కూర్చున్నాడు. అలా చాలా చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఒక రెండు గంటలు TV చూసే అవకాశం దక్కింది.

ఈ అవార్డ్స్ కార్యక్రమంలో నాకు నచ్చిన మొదటి విషయం ఏంటంటే అవార్డ్స్ అన్నీ కూడా కొత్త కొత్త వాళ్లకి (అదీ యువతకి) ఇచ్చారు. ఇంతకు ముందు ఉత్తమ గాయని/గాయకుడు అనే SPB /చిత్ర/సునీత/ఉదిత్ నారాయణ్ ఇంతకు మించి పేర్లు వినిపించేవి కావు. ఇప్పుడు అంతా ఫ్రెష్ టాలెంట్. చిన్న చిన్న పిల్లలు (అంటే నాకంటే చిన్నాళ్ళు కాబట్టి నాకు పిల్లల్లాగానే అనిపించారు) అందరూ. ఎంతో బాగా పాడుతున్నారు, మ్యూజిక్ ఇస్తున్నారు, డాన్సులు compose చేస్తున్నారు. నిజంగా చాలా చాలా నచ్చింది నాకు ఈ పరిణామం.

ఇక రెండో విషయం నాకిష్టమయిన సినీ గీత రచయిత అయిన 'సిరి వెన్నెల' సీతారామశాస్త్రి గారికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడం.

'చందమామ రావే, జాబిల్లి రావే' అంటూ చంటి పిల్లలకి జోల పాడినా,

'ప్రాగ్దిశ వేణియ పైన  దినకర మయూఖ తంత్రుల పైనా, జాగ్రుత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన' అంటూ తెలుగు పదాలను అత్యంత రమణీయంగా పాటలో కూర్చినా,

'బోటనీ పాఠం వుంది , మాటినీ ఆట వుంది దేనికో వోటు చెప్పరా' అని కాలేజీ కుర్రాళ్ళ అల్లరి, మనోభావాలని పాటగా మలిచినా,

'క్లాసు రూములో తపస్సు చేయుట వేస్ట్ రా గురు, బయట వున్నది ప్రపంచమంతా చూడరా గురూ' అంటూ పుస్తకాల్లో పాఠాలకి, జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలకి తేడా చెప్పినా,

'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని, మారదు లోకం, మారదు కాలం, ఎవ్వరు ఏమయిపోనీ దేవుడు దిగిరానీ' అని సమాజంలోని కుళ్ళు కుతంత్రాల గురించి ఆక్రోసించినా,

'అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా; నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చ్ఛ ను చూద్దామా, దాన్నే స్వరాజ్యమందామా' అంటూ సూటిగా గుండెల్లో బాకు దించినట్టుగా నిలదీసినా,


'చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్న వాడా..కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్ధం, బ్రతుకును కానీయకు వ్యర్ధం' అంటూ మానవ సేవయే మాధవ సేవ అన్న సూక్తి ని మనకి అర్ధమయ్యేలా చెప్పినా ,

'బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఐ, ఈ నేర్చుకున్నా' అంటూ మాస్ పాట రాసినా

'నువ్వు, నువ్వు, నువ్వే నువ్వు..నాలోనా నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వూ' అంటూ ప్రేయసి హృదయాన్ని అత్యంత సుందరంగా ఆవిష్కరించినా,

'జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది' అంటూ కవి యొక్క జీవిత సారాంశాన్ని కాచి వడబోసినా,

ఇలా ఏ సందర్భానికి అనుగుణంగా పాట వ్రాసినా హృదయానికి హత్తుకునేలా మాత్రమే కాకుండా హృదయాంతరాల్లోకి  దూసుకు వెళ్ళేలా వ్రాసిన ఘనత సిరివెన్నెల గారిదే. అలాంటి మహాకవి గొప్పతనం గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా పొగిడారు. కానీ నిన్న చూసిన ఫంక్షన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సిరివెన్నెల గారి గురించి ఇచ్చిన స్పీచ్ నాకు తెగ నచ్చేసింది.

'సీతారామ శాస్త్రి గారి లాంటి గొప్ప కవి సినిమా పాటలు రాయడం, ఆయన ప్రతిభ సినిమాలకే పరిమితమవ్వడం ఆయన దురదృష్టం, మన అదృష్టం' అన్నారు. చాలా చాలా బాగా మాట్లాడారు త్రివిక్రమ్ గారు. హాట్స్ ఆఫ్!
సినిమా పాటలలో సాహిత్యపు విలువలు అడుగంటుతున్న ఇప్పటి రోజుల్లో సిరివెన్నెల గారి లాంటి వాళ్ళు సినీ జగత్తు లో వుండటం మన అదృష్టం కాక మరేంటి?




ఈ వీడియో సరిగ్గా రన్ అవుతుందో లేదో నేను మొత్తం చూడలేదు. కానీ ఇంతకంటే మంచి లింక్ వేరేది దొరకలేదు.

Friday, February 3, 2012

బంతి భోజనాలు

మీరు బంతి భోజనం తిని ఎన్నాళ్ళయింది? నేనయితే రెండేళ్ళ క్రితం సంక్రాంతి పండక్కి వచ్చినప్పుడు మా అజుభాకి  పంచెలు ఇచ్చే ఫంక్షన్ కరటంపాడు (అమ్మమ్మ వాళ్ళ ఊరు) లో చేసినప్పుడు అక్కడ మా ఇంట్లో చుట్టాలందరితో కలిసి బంతి భోజనం చేసాను…..మళ్ళీ ఇన్నాళ్ళకి నిన్న కిట్టయ్య వాళ్ళ అక్క పెళ్లి రిసెప్షన్ లో ఇలా బంతి భోజనం అనే కాన్సెప్ట్ ని చూసాను…పెళ్లి మండపం లో నుండి డైనింగ్ హాల్ లోకి అడుగుపెట్టగానే నా కళ్ళు రెండు తళుక్కున మెరిసాయి :D ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పలేను…అరిటాకుల్లో భోజనం, అదీ వంటవాళ్లు వండి వడ్డిస్తుంటే చాలా బాగా అనిపించింది….
ఈ మధ్య ఎక్కడ చూసినా బయట హోటల్ వాళ్ళకి ప్లేట్ కి ఇంత అని లెక్కకట్టి ఆర్డర్ ఇవ్వడం…వాళ్ళు వండినవన్నీ డబ్బాల్లో సర్దుకు రావడం, ఆ తెచ్చిన డబ్బాలని మన కళ్ళ ముందే మళ్ళీ స్టవ్ పెట్టి వేడి చేయడం, మనమేమో జైల్లో ఖైదీల్లా బొచ్చ పట్టుకుని క్యూ లో నిల్చోడం :mad: కేటరింగ్ వాళ్ళ ముందు ప్లేట్ పెట్టగానే వాళ్ళు కొంచెం వడ్డించడం, తర్వాత ఏదో పక్కకెళ్ళి నిల్చుని గబ గబ తిన్నామనిపించడం ఇంతే ఏ భోజనానికి వెళ్ళినా….వంట వాళ్ళు, గాడి పొయ్యిలు, కూరగాయలు తరగడం ఈ సందడి వుండట్లేదు ఎక్కడా… పల్లెటూర్లలో అయితే ఇంకా బంతి భోజనాలు కనిపిస్తూనే వున్నాయి…అక్కడ ఈ కేటరింగ్ వాళ్ళ నీడ ఇంకా పడలేదు కాబట్టి….రాను రాను అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే చూస్తామేమో…
ఎక్కువమంది ఆహ్వానితులు వచ్చినప్పుడు ఈ పద్ధతి హోస్ట్ కి సౌకర్యంగా వుంటుంది, కాదనలేము….కానీ ఇప్పటి పరిస్థితుల్లో యాభయి, వంద మందిని పిలిచినా కూడా కేటరింగ్ ఇంకా బుఫే పద్దతే పాటించేస్తున్నారు…..రేపు మా ఇంట్లో ఏదయినా ఫంక్షన్ జరిగినా ఇదే చేస్తాము.. వంటవాళ్ళని పెట్టొచ్చు కదా అంటే ఇప్పుడు ఎవరు దొరుకుతున్నారే అంత ఓపిగ్గా వంటలు చేసి వడ్డించేవాళ్ళు  అంటారు …ఇదీ నిజమే…వంట కాన్సెప్ట్ పెట్టుకుంటే ఇంట్లో ఆడవాళ్ళందరికీ ఈ వంటింటి పనులూ, వంట చేసే వాళ్లకి అవీ ఇవీ అందించడం ఈ పనులతో ఫంక్షన్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేరు….కేటరింగ్ వాళ్లకి పని ఒప్పచేప్పేస్తే ఇక భోజనాల గురించి ఆలోచించక్కర్లేదు….నిజమే, సులభమయిన పద్దతి లో మనకి కావాల్సిన పనులు అయిపోతుంటే ఎవరు మాత్రం ఇంత బాధ్యత తీసుకోవాలనుకుంటారు??? రేపు నేనయినా ఇంతే ఏమో :(
కానీ చుట్టాలందరితో బంతి లో కూర్చుని అరిటాకుల్లో భోంచేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, కావాల్సినవన్నీ మన దగ్గరకే తీసుకొచ్చి వడ్డించి కొసరి కొసరి కడుపునిండా తినిపించే బంధువులతో ఫంక్షన్ ని ఎంజాయ్ చేసే రోజులు కనుమరుగవుతున్నాయంటే బాధగానే వుంటుందిగా మరి :oops:

దూరపుకొండలు

ఈ సామెత వినే వుంటారందరూ “దూరపుకొండలు నునుపు” అని..

అక్కడ లండన్ దగ్గర వున్నంత కాలం ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్తానా, స్వచ్చమయిన స్వదేశి ఫుడ్ తిందామా అని అనుకోని రోజు లేదు…స్వదేశి ఫుడ్ అంటే కుంపట్లో కాల్చిన చిలగడ దుంపలు, తేగలు, ఇంకా తాటిముంజులు, జామకాయలు, రేగిపళ్ళు ఇలాంటివన్నమాట…ఇప్పుడు ఇండియా వచ్చేసి తాటిముంజులు తప్ప అన్ని ఇష్టమయినవి తినేసాను… ఇక వీటి మీద మోజు ప్రస్తుతానికి తీరినట్టే..ఇప్పుడిక కళ్లు మూసినా తెరిచినా Tacobell లో వెజ్ చాలుపా, Subway లో చికెన్ Teriyaaki సబ్, Mc Donaalds  లో చికెన్ ప్రేమిఎర్ ఇవే గుర్తొచ్చి కావాలనిపిస్తుంది :( అక్కడున్నప్పుదేమో అక్కడి ఫుడ్ నచ్చదు ఇక్కడున్నప్పుడేమో ఇక్కడి ఫుడ్ నచ్చదు…మనకి ఏది అందుబాటులో లేకపోతే అదే నచ్చుతుంది, దాని మీదే మోజుంటుంది…గుడ్డిలో మెల్ల లా నా ఈ మోజు తిండి విషయంలో మాత్రమే కాబట్టి సరిపోయింది, ఎలానో దిగమింగుతాను, అదే మిగతా విషయాల్లో ఇలా అసంతృప్తి వుంటే లైఫ్ నరకప్రాయమే కదా

మీకెవరికయినా వెజ్ చాలుపా ఇక్కడ ఇండియాలో దొరికే వస్తువులతో చేసుకోవచ్చేమో ఐడియా వుందా? మా అమ్మని చేయమని అడిగితే నరికి పోగులు పెడుతుంది ఇప్పటికే నాకు నచ్చేలా వంట చేయట్లేదని విసిగిస్తున్నా కదా…సో నేనే చేసుకోవాలి…హైదరాబాద్ వెళ్తే అక్కడ subway, Mc Donaalds వుండే వుంటాయి కాబట్టి పర్లేదు…ఇప్పుడు చాలుపా ఎలా ఎలా ఎలా?