Friday, February 3, 2012

ఒక చిన్ని ప్రేమ కథ

విజయవాడ రైల్వే స్టేషన్
 
2000 మార్చ్ నెల మొదటి వారం. ఎండలు అప్పుడప్పుడే ముదురుతున్నాయి. సాయంత్రం 6 గంకి గొల్లపూడి-పోరంకి (నెంబర్ 1) సిటీ బస్సులో నుండి స్టేషన్ ముందు బస్సు స్టాప్ లో దిగాను. ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసి ఒక రెండు రోజులు సెలవు దొరకడం తో ఇంటికి బయల్దేరాను. లగేజ్ ఎక్కువ లేకపోడం తో నేనే బాగ్ మోసుకుంటూ టికెట్ కౌంటర్ దగ్గరకి వెళ్లి నెల్లూరు కి ఒక టికెట్ తీసుకుని ప్లాట్ ఫాం మీదకి వెళ్లాను. నేనెప్పుడూ ఎక్కే గోరఖ్ పూర్ – కొచ్చిన్ ఎక్స్ప్రెస్ ఈ సారయినా ఒకటో ప్లాట్ ఫాం మీదకి వస్తుందేమో అని ఆశగా డిస్ప్లే వేపు చూసాను…ఊహు…అదేం ఖర్మో ఎప్పుడూ లాస్ట్ ప్లాట్ ఫాం మీదకే వస్తుంది ఆ రైలు.ఆఖరి ప్లాట్ ఫాం మీద ఏమీ షాప్స్ వుండవు, జనాలు వుండరు, వెయిట్ చెయ్యాలంటే బోరు.అందుకే ఇష్టం లేదు నాకు. కానీ చేసేదేం లేక కాళ్ళీడ్చుకుంటూ మెట్లెక్కి చివరి ఫ్లాట్ ఫారం మీదకి చేరుకున్నాను. రైలు రావడానికి ఇంకా అరగంట టైం వుంది.వాక్ మాన్ లో నాకిష్టమయిన పాత హిందీ పాటలు వింటూ కాలక్షేపం చేస్తూ వున్నాను. ఆ రోజు లక్నో వర్క్ చేసిన బేబీ పింక్ కలర్ చుడిదార్ వేసుకుని వున్నాను. ఇంటికి వచ్చేప్పుడు ముఖం వేళ్ళాడేసుకుని రావొద్దని అమ్మ వార్నింగ్ ఇవ్వడంతో చక్కగా గంజి పెట్టిన డ్రెస్ వేసుకుని తలస్నానం చేసి హాస్టల్ లో బయల్దేరాను. ఎందుకో ఆ రోజు కొంచెం ప్రత్యేకంగా వున్నానేమో అనిపించింది ప్లాట్ ఫాం మీద ఒకరిద్దరు ఒంటరిగా కూర్చుని వున్న నన్ను కొంచెం తదేకంగా చూస్తుంటే. ఇరవయ్ ఏళ్ళ ఆడపిల్ల కి తనని ఎవరన్నా  ఒకటికి రెండు సార్లు గమనిస్తూ వుంటే ఎలా అనిపిస్తుందో నాకూ అలానే అనిపించి లోలోన మురిసిపోయాను :)


రైలు వస్తున్నట్టు అనౌన్సుమెంటు వినిపించింది. బాగ్ పట్టుకుని లేచి నిల్చున్నాను. నా వెనకాల బెంచి మీద నుండి మరో సాల్తి వెంటనే లేచి నిలబడడం తో వెనక్కి తిరిగి చూసాను. ఎవరో ఒకబ్బాయి, పాతికేళ్ళు ఉంటాయేమో. రైలు వచ్చి ఆగింది. నేను జనరల్ కంపార్ట్ మెంట్ టికెట్ కొనుక్కున్నా కూడా అందులో ఎప్పుడూ సీట్  ఉండదని రిజర్వ్డ్ కంపార్ట్ మెంటే ఎక్కుతాను. టీ.సీ కి ఒక వంద ఇస్తే సీట్ ఇచ్చేవారు. అప్పుడు కూడా అలానే రిజర్వ్డ్ కంపార్ట్ మెంట్ వైపు నడిచాను. నా వెనకాలే ఆ అబ్బాయి కూడా. భోగి అంతా ఖాళీగా వుంది ఆ రోజు ఎందుకో. మొత్తం భోగీలో పది మంది కూడా లేరు. ఒక ఖాళీ కూపే లో కిటికీ సీట్ చూసుకుని సెటిల్ అయ్యాను. మళ్ళీ పాటలు వింటూ నా లోకంలోకి వెళ్ళిపోయాను.విజయవాడ జంక్షన్ కావడంతో రైలు ఒక 20 నిమిషాల పైనే ఆగి తీరిగ్గా బయల్దేరింది కూతేసుకుంటూ. రైలు కదలగానే ప్రకాశం బ్యారేజ్ చూడటం కోసం కిటికీ లో నుండి బయటకి చూడసాగాను. ఎదురు సీట్ లో కూడా నా లాగే మరో శాల్తీ అలానే చూస్తుండటం తో తల తిప్పి చూసాను. ఇందాక కనిపించిన అబ్బాయి. భోగీ అంతా ఖాళీగా పెట్టుకుని నా ఎదురుగానే సెటిల్ అవాలా అని విసుగ్గా ముఖం తిప్పుకున్నాను (అతనికి రిజర్వేషన్ వున్నట్టు అనిపించలేదు మరి). కూపేలో ఒక్కదాన్నే అయితే నా ఇష్టం వచ్హినట్టు కాళ్ళు చాపుకునో పడుకునో ప్రయాణం చెయ్యొచ్చు అనుకున్నాను. ఇప్పుడు ఎదురుగా ఒకబ్బాయిని పెట్టుకుని ఫ్రీగా ఉండలేను కదా. సరేలే ఎం చేస్తాం అని ప్రకాశం బ్యారేజ్ చూడసాగాను. కొంచెం సేపట్లో రైలు బ్యారేజ్ దాటి స్పీడ్ అందుకుంది. నేను మళ్ళీ పాటలు వింటూ కూర్చున్నాను.

ఇంతలో టీ.సీ వస్తే టికెట్ + వంద ఇచ్చాను. క్యాసెట్ అయిపోవడం తో వాక్ మాన్ పక్కన పెట్టి బాగ్ లోనుండి స్వాతి వీక్లీ తీసుకుని చదవడం మొదలు పెట్టాను. హాస్టల్ లో వున్నా కూడా స్వాతి తెప్పించుకునేదాన్ని. అదే జర్నీలో చదవొచ్చని తెచ్చుకున్నాను. ఫయిర్ బ్రాండ్ పేరుతో ఒక సీరియల్ వచ్చేది.

అది చదువుతూ వుండగా “ఎక్స్క్యూజ్ మీ ” అని వినిపించింది. తలెత్తి చూసాను. ఎదురు సీట్లో వున్న అబ్బాయి. “వాక్ మాన్ ఇస్తారా” అని అడిగాడు. ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు, కానీ ఇవ్వను అని చెప్పలేను కదా.సో ఇచ్చాను.మళ్ళీ బుక్ లోకి తల దూర్చాను.

మధ్యలో అతను నన్ను గమనిస్తున్నట్టు అనిపించి తలెత్తి చూసాను. నిజమే పాటలు వింటూ (వింటున్నాడో లేక ఆ పాత పాటలు వినలేక వింటున్నట్టు నటిస్తున్నాడో అర్ధం కాలేదు) నన్ను చూస్తూ వున్నాడు. నేను తలెత్తగానే చూపు తిప్పేసుకున్నాడు. నేను పట్టించుకోనట్టు మళ్ళీ పుస్తకంలోకి తల దూర్చాను. ఇంకొంచెం సేపయ్యాక మళ్ళీ ఓరకంట చూసాను. దొంగ సచ్చినోడు ఇంకా నన్నే చూస్తున్నాడు. కోపంగా లేచి వెళ్లి అటు వేపు ఖాళీగా వున్న సైడ్ లోయర్ బర్త్ లో కూర్చున్నాను. అతను ఏదో పనున్నట్టు తన బాగ్ ఓపెన్ చేసి ఏదో చూసుకున్నాడు . అసలే ఖాళీ భోగీ. ఏమయినా వెధవ వేషాలు వేస్తే ఎలా అనుకున్నాను. కానీ చూస్తే అలా లేదు. జీన్స్ వేసుకుని కొంచెం పొడుగ్గా  వున్నాడు.డీసెంట్ గానే అనిపించాడు.నా లాగే స్టూడెంట్ అనుకుంటా.సర్లే ఇంకెంత 3 గంటలు జర్నీ. సైట్ కొట్టుకోనీ వాడి ఆనందాన్ని నేనెందుకు తప్పు పట్టాలి, ఓవర్ చేస్తే అప్పుడు చూసుకుందాంలే అని మళ్ళీ చదువుకోసాగాను.
ఒంగోలు స్టేషన్ వచ్చింది. అతను నా దగ్గరకి వచ్చి వాక్ మాన్ ఇచ్చేస్తూ “మంచి పాటలండీ, పాత హిందీ సినిమా లంటే నాకు చాలా ఇష్టం” అనేసి రైలు దిగి వెళ్ళాడు. అబ్బో పర్లేదే అనుకుంటూ వాక్ మాన్ బాగ్లో పెట్టేసి కిటికీ నుండి బయటకి చూడసాగాను. రైలు కదలసాగింది. ఇతనేమో ఇంకాఎక్కలేదు . అక్కడే దిగిపోయాడా అనుకుంటే అతని బాగ్ లోపలే వుంది. ఇదే సీన్ ఒక పదేళ్ళ తర్వాత జరిగి వుంటే ఏ ఉగ్రవాదో అనుకుని హడలి చచ్చేదాన్నేమో. ఇంతలో ప్లాట్ ఫాం మీద నుండి పరిగెత్తుకుంటూ వచ్చి రైలెక్కాడు. నా సీట్ దగ్గరకి వచ్చి ఎదురుగా కూర్చుని బిస్కట్ ప్యాకెట్ ఓపెన్ చేసి నాకు ఆఫర్ చేసాడు.హమ్మో తింటే ఇంకేమన్నా ఉందా, ఎన్ని సినిమాల్లో చూడలేదు. వద్దు అన్నాను. ఏమనుకున్నాడో ఏమో మళ్ళీ ఏం మాట్లాడకుండా తన సీట్  వేపు వెళ్లి బాగ్ లో నుండి ఏదో బుక్ తీసి చదువుకుంటూ బిస్కట్లు తినసాగాడు. అనవసరంగా అపార్ధం చేసుకున్నానేమో అనిపించింది.

స్వాతి చదవడం అయిపొయింది. బోరు కొట్టి అటూ ఇటూ దిక్కులు చూస్తూ కూర్చున్నాను. అప్రయత్నంగా అతని వేపు చూసాను. వెంటనే లేచి వచ్చి నా ఎదురుగా సెటిల్ అయ్యాడు. ఎప్పుడు చదవడం ఆపుతానా అని చూస్తున్నాడో ఏంటో మరి.
“ఎక్కడి దాకా వెళ్తున్నారు” అని అడిగాడు
“నెల్లూరు” అన్నాను.
“బెజవాడ లో చదువుతున్నారా?”
“ఆ”
“ఇంజినీరింగా?”
“ఆ”
“నేను కూడా ఇంజినీరింగే నండీ. Trichyలో M.Tech చేస్తున్నాను”
నిన్నెవరు అడిగారు నాయనా అనుకుంటూ “ఓహో” అన్నాను.
“సిద్ధార్థ లోనా”
వామ్మో ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం శ్రేయస్కరం కాదు అనుకుని “కాదు, కోనేరు లక్ష్మయ్య కాలేజీ” అని అబద్ధం చెప్పేసి నా బాగ్ ఓపెన్ చేసి అందులో ఏదో వెతకసాగాను (ఏమీ లేదు ఉత్తుతినే).
మళ్ళీ ఇక అతని వేపు తిరిగే సాహసం చేయకుండా కిటికీ లోనుండి  బయటకు చూస్తూ కాసేపు, నిద్రపోయినట్టు నటిస్తూ కాసేపు మేనేజ్ చేసాను. ఈ లోగా నెల్లూరు స్టేషన్ వచ్చేసే టైం అయింది. రైలు పెన్నా బ్రిడ్జి మీదకి రాగానే అతని వేపు చూడకుండా నా బాగ్ తీసుకుని దిగుదామని లేచాను. నా వెనకే అతను డోర్ దాకా వచ్చాడు.
రైలు బ్రిడ్జి దాటగానే సడెన్ గా అడిగాడు “మీ పేరేంటి?” అని.
అసలా ప్రశ్న ఊహించకపోడం తో అప్రయత్నంగా నిజం చెప్పేసాను “సిరిచందన” అని.
“చాలా బాగుందండీ, నా పేరు శ్రీనివాస్” అన్నాడు. మళ్ళీ ఏదో అడుగుదామనుకున్నాడు కానీ నేను యమా సీరియస్ గా ముఖం తిప్పుకున్నాను. ఇక మాట్లాడలేదు.
స్టేషన్ రాగానే రైలు దిగాను.నా వెనకే అతనూ దిగాడు.నేను ఇక వెనక్కి కూడా తిరిగి చూడకుండా గబగబా బయటకి వచ్చేసాను. అప్పటికే రాత్రి 10 దాటింది. సేఫ్ గా ఇల్లు చేరుకున్నాను.అతని సంగతి ఇక మర్చిపోయి నా రొటీన్ లో పడిపోయాను.
*********************************************
దాదాపు రెండున్నర నెలల తర్వాత external exams రాసేసి ప్రాక్టికల్ ఎక్సామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ వున్నాను. ఆ రోజు మధ్యహ్నం మా హాస్టల్ రూము లో కూర్చుని ఏవో రికార్డ్స్ చూసుకుంటూ వున్నాను. ఇంతలో కింద నుండి ఎవరో పిలుస్తున్నారు,
“3/4 సిరి ఫోన్” అని.
నాకు సాధారణంగా హాస్టల్ కి ఎవరూ ఫోన్లు చేయరు. ఈ టైములో ఎవరబ్బా అనుకుంటూ కిందకి వెళ్లి ఫోన్ తీసుకున్నాను,
“హలో”
“హలో, సిరిచందన గారా అండీ?”
“అవునండీ, మీరెవరు”
“నా పేరు శ్రీనివాస్ అండీ. రెండు నెలల క్రితం ట్రైన్లో కలిసాం. మీరు విజయవాడ నుండి నెల్లూరు వెళ్తున్నారు గోరఖ్ పూర్ – కొచ్చిన్ ఎక్స్ ప్రెస్ లో “
“హలో, గుర్తొచ్చానా అండీ”
“ఆ…ఆహ”
“Trichy లో చదువుతున్నానని చెప్పానూ”
అతను గుర్తొచ్చి నా మెదడు ఒక్కసారిగా మొద్దుబారినట్టయింది.
“ఆ..ఆ”
“గుర్తొచ్చానా”
“ఆ”
“మిమ్మల్ని ఒక్కసారి కలిసి మాట్లాడాలండీ”
“……”
“ప్లీజ్..మీ contact  నం కనుక్కోడానికి చాలా కష్టపడ్డానండీ. మీరేమో KLC అని చెప్పారు. అక్కడ మా ఫ్రెండ్స్ కి మీ పేరు, ఊరు  చెప్పి కనుక్కోమంటే ఎవరూ లేరన్నారండీ.ఎందుకయినా మంచిదని సిద్దార్ధలో ఫ్రెండ్స్ ని కూడా అడిగితే అప్పుడు తెల్సిందండీ. అబద్ధం ఎందుకు చెప్పారు?”జ
అప్పటికి నాకు కొంచెం మెదడు స్వాధీనంలోకి వచ్చినట్టనిపించింది.
“నాకెందుకు ఫోన్ చేసారు. ఆ రోజు మిమ్మల్ని చూసి మీకు నిజం చెప్పాలనిపించలేదు, చెప్పలేదు అంతే”
“ప్లీజ్..మీరు నన్ను మరోలా అనుకోకండి.నేను చెప్పేది వినండి”
“ఇది హాస్టల్ ఫోన్. ఇలాంటి కాల్స్ చెయ్యడం ఏమీ బాగాలేదు, ఇంకెప్పుడు ఇలా కాల్ చెయ్యకండి”
“ప్లీజ్ కట్ చేయకండి, ఒక్కసారి మీతో మాట్లాడాలి.రెండు నెలల నుండీ చాలా డిస్టర్బ్ అయి వున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి రైల్వే స్టేషన్ లో8th ప్లాట్ ఫాం లో వెయిట్ చేస్తూ వుంటాను. అక్కడే మిమ్మల్ని మొదటి సారి చూసాను. మీరు ఒక్క సారి వచ్చి నేను చెప్పేది వినండి. ప్లీజ్”

నేను ఫోన్ పెట్టేసాను. నాకు గుండె దడ మొదలయ్యింది. ఏమిటిది? ఏం జరుగుతోంది? అంతా గందరగోళంగా అనిపించింది. పరుగున వచ్చి నా రూములో పడ్డాను. అసలెవరతను? ఒక్క సారి రైల్లో కల్సి ప్రయాణం చేసినంత మాత్రాన ఎంత ధైర్యంగా ఫోన్ చేసాడు? నా పేరు చెప్పి చాలా పొరబాటు చేసాను. ఇప్పుడేం చేయాలి. ఇలా పదేపదే ఫోన్ చేసి విసిగిస్తే ఎలా? ఫోన్లో మాటలు ఎక్స్టెన్షన్ లో ఎవరన్నా వింటే ఏమన్నా ఉందా? (మా హాస్టల్ కి వచ్చే ఫోన్లు అన్నీ బోయ్స్ హాస్టల్ నుండే కనెక్ట్ అవుతాయి). ఎలా ఇప్పుడు?

ఒక సీసా మంచి నీళ్ళు తాగి మంచం మీద పడుకుని ఆలోచించసాగాను.
అసలతను ఎందుకు కాల్ చేసాడు. స్టేషన్ కి వెళ్తే ఏం చెప్తాడు? ప్రేమిస్తున్నాను అంటాడా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడా? లేకపోతే ఇంకేం చెప్తాడు. ఇరవయ్ ఏళ్ళ అమ్మాయి ఎలా ఆలోచిస్తుందో అలానే ఆలోచించాను. అతను నన్ను కల్సుకోవాలనుకోడానికి ఇంతకంటే వేరే కారణం ఏమీ కనిపించలేదు నాకు. వెళ్ళకూడదు అనుకున్నాను.
ఇంతలో నాలో వున్నా చిలిపి పిల్ల నిద్ర లేచింది. వెళ్తే ఏమవుతుంది? మనమేమన్నా అతను ఐ లవ్ యు చెప్పగానే ఎస్ చెప్తామా ఏంటి?  అసలతను ఏ ధైర్యం తో చెప్తాడో చూద్దాం. థ్రిల్ ఎందుకు మిస్ అవాలి నేను ? వెళ్దాం, ఏమయితే అదవుతుంది. పిలిచింది స్టేషన్ కే కదా, ఏ పార్కో, సినిమాకో కాదుగా అనుకున్నాను.

భయం భయంగానే రెడీ అయి బయల్దేరాను. ఫ్రెండ్స్ అడిగితే పిన్ని వాళ్ళింటికి అని చెప్పాను. స్టేషన్ కి వెళ్ళే బస్సు ఎక్కి కూర్చుని అతను ఎలా ఉంటాడో గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించాను.ఊహూ..గుర్తురాలేదు. పొడుగ్గా, చామనచాయతో వున్నాడు, జీన్స్ వేసుకున్నాడు. అంతకు మించి ముఖం ఎలా ఉంటుందో అసలు గుర్తు రాలేదు. ఒక వేపు తప్పు చేస్తున్నానన్న భయం, టెన్షన్. మరో వేపు ఏదో తెలీని థ్రిల్, excitement. అమ్మ నాన్నలకి తెలిస్తే కాళ్ళు విరక్కొడతారు. ఎలా తెలుస్తుంది? ఎవరన్నా చూస్తే? చూస్తే ఫ్రెండ్ తో మాట్లాడుతోంది అనుకుంటారు. స్టేషన్ లో అంత మంది వుంటారు కదా, సో అపార్ధం చేసుకోరు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ కూర్చున్నాను. ఆరుం పావు కి స్టేషన్ దగ్గర బస్సు దిగాను. అదే బస్సులో వెనక్కి వెళ్ళిపోదామా అనిపించింది. ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళడం దేనికి అని సర్దిచెప్పుకుని స్టేషన్ లోపలి వెళ్లి ఒక ఫ్లాట్ ఫారం టికెట్ కొనుక్కుని మెట్లెక్కి దిగి  8th ప్లాట్ ఫాం మీదకి వెళ్లాను. జీవితం లో ఎప్పుడూ అంత టెన్షన్  పడలేదు. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. ఏదో రైలు వచ్చే టైం అనుకుంటా. జనాలు చాలా మందే వున్నారు. మెల్లగా నడుచుకుంటూ వెళ్లి అప్పుడే ఖాళీ అయిన ఒక బెంచ్ మీద కూర్చున్నాను. రైలేదో వచ్చింది. అంతా హడావుడిగా వుంది. ఇంతలో నా పక్కన ఎవరో వచ్చి నిల్చున్నట్టనిపించి తల తిప్పాను.ఎదురుగా అతను. గుర్తుపట్టాను. అప్రయత్నంగా లేచినిల్చున్నాను.
“హలో, చందనగారు..బాగున్నారా? “
“ఆ”
“ఇక్కడ కూర్చుందామా?”
“ఆ”
అతను కూర్చున్నాడు. నేనూ అదే బెంచ్ చివర కూర్చున్నాను. అతనెందుకో విజయగార్వంగా ముసిముసి  నవ్వులు నవ్వుతున్నట్టనిపించింది. ఛీ ఛీ ఎందుకొచ్చానా అనుకున్నాను.
“జ్యూస్ ఏమన్నా తీసుకుంటారా” అని అడిగాడు
“ఊహూ వద్దు “అన్నాను
“పర్లేదు తెస్తాను” అని లేచి వెళ్లి పక్కనే వున్న జ్యూస్ స్టాల్ వేపు నడిచాడు. అతన్నే గమనిస్తూ కూర్చున్నాను (జ్యూస్లో ఏదన్న కలిపితే కనిపెట్టడానికి). ఆరడుగులకి కొంచెం తక్కువ ఉంటాడేమో. స్నఫ్ కలర్ ప్యాంటు వేసుకుని క్రీం కలర్ ఫుల్ హాండ్స్ షర్టు ని టక్ చేసుకుని ఏదో పెళ్లి చూపులకి ప్రిపేర్ అయినట్టు వచ్చాడు. పర్లేదు బాగానే వున్నాడు. మంచి ఫీచర్స్.
రెండు గ్లాసులు పట్టుకుని వచ్చి ఒకటి నాకిచ్చి తానోటి తీసుకున్నాడు.
“మొసాంబి జ్యూస్ ఒక్కటే వుంది అక్కడ. అదే తెచ్చాను”
“…..”
జ్యూస్ మెల్లగా సిప్ చేయసాగాను. ఒక రెండు నిమిషాలు ఏం మాట్లాడలేదు.
“ఐ లవ్ యు చందన. మీరొప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను”
సినిమాల్లో అయితే ఇలా సడన్ గా చెప్తే అమ్మాయికి పొలమారుతుంది. కానీ నేను ఇది ముందే ఊహించి ఉండటంతో నాకేం అవలేదు. మౌనంగా వింటూ వున్నాను.

“మిమ్మల్ని ఫస్ట్ టైం ఈ ప్లాట్ ఫాం మీద చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా ఒద్దిగ్గా, క్యూట్ గా వుంది అనుకున్నాను. తర్వాత రైల్లో నాలుగు గంటలూ మిమ్మల్నే గమనిస్తూ వున్నాను. చాలా చాలా నచ్చేసారు. మీరు రైలు దిగిపోగానే మిమ్మల్ని మర్చిపోతాను అనుకున్నాను. కానీ తర్వాత ఒక్క రోజు కూడా మీ గురించి ఆలోచించకుండా లేను ఇన్ని రోజుల్లో. మీతో ప్రయాణించిన ఆ నాలుగు గంటలు నా జన్మలో మర్చిపోలేను. అలాంటిది మీతో లైఫ్ అంతా కల్సి వుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. మీ పేరు, ఊరు, చదువు తప్ప ఇంకేం తెలీదు నాకు. ఎలాగోలా మిమ్మల్ని కల్సి నా మనసులో మాట చెప్పాలనుకున్నాను. నాకు ఎలా చెప్పాలో కూడా అర్ధం అవట్లేదు. నాకు మీరు చాలా నచ్చారు” అంటూ ఒక్క క్షణం ఆపాడు.
 
నేను తల వంచుకుని ఒడిలో పర్స్ ని గిల్లుతూ వింటున్నాను. అసలేంటి ఇతను. ఇంత సూటిగా ప్రపోజ్ చేస్తున్నాడు. ఇంత ధైర్యం ఏంటి? ఏం తెల్సు ఇతనికి నా గురించి?

“నా గురించి మీకేమీ చెప్పకుండా ఇలా ప్రపోజ్ చేయడం తప్పే. మాది వైజాగ్. అమ్మ నాన్న ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్స్. ఒక తమ్ముడు వున్నాడు. మెడిసిన్ చేస్తున్నాడు వరంగల్ లో. ఇంకో మూడు నెలలో నా ప్రాజెక్ట్ అయిపోతుంది, కాంపస్ ప్లేస్ మెంట్ వచ్చింది. బెంగుళూరు HAL లో. మీరు తప్పుగా అనుకోనంటే ఇంకో మాట. మేము కూడా మీకాస్టే. మీ ఫోన్ నెంబర్ కోసం ప్రయత్నిస్తూ మీ పేరు చెప్పినప్పుడు మీ కాలేజీ లో వున్ననా ఫ్రెండ్స్ చెప్పారు. పేరెంట్స్ అందరినీ నేను ఒప్పిస్తాను”

“ఒక్క క్షణం..ఒక్క క్షణం నన్ను ఊపిరి పీల్చుకోనిస్తారా?” అని కోపంగా అడిగాను.
“అయ్యో..సారీ. చెప్పండి”
“మిమ్మల్ని కలవడం ఇది రెండో సారి. అప్పుడే ప్రేమ, పెళ్లి, పెద్దవాళ్ళ దాకా వెళ్ళిపోయారు. ఎలా కనిపిస్తున్నాను మీకు? ఫోన్ చెయ్యగానే వచ్చేసింది. యస్ చెప్పేస్తుంది నేను ప్రపోజ్ చెయ్యగానే అనుకుంటున్నారా?” మాట్లాడుతుంటే నా గొంతు వణికింది. ఇంకో క్షణంలో ఏడ్చేచేసాలా వున్నాను.

“అయ్యొయ్యో. మీరు అలా అప్ సెట్ అవకండి. ఈ దొరికిన కొంచెం టైములో నా ఉద్దేశం మీకు అర్ధమయ్యేలా చెప్పాలనే పెళ్లి విషయం దాకా వెళ్లాను. అంతే కానీ మీరు వెంటనే ఒప్పేసుకోవాలని కాదు. ప్లీజ్..మీరలా బాధ పడకండి. ముందు ఫ్రెండ్స్ లా ఉందాం. మీ చదువు పూర్తి అవడానికి ఇంకా ఒక సంవత్సరం టైం వుంది కదా. అప్పటికి మీకు నేను నచ్చితే పెద్దవాళ్ళతో చెప్దాము”

నాకప్పటికే కళ్ళు తిరిగుతున్నట్టు అనిపించింది. ఇంకాసేపు అక్కడ వుంటే ఏం జరుగుతుందో అని భయమేసి వెళ్ళడానికి లేచి నిల్చున్నాను. అతనూ లేచాడు.
“ప్లీజ్ చందన నన్ను అపార్ధం చేసుకోకండి. నాకింతకు ముందు ఏ అమ్మాయిని చూసినా ఇలా అనిపించలేదు. ప్రేమ సంగతి పక్కన పెట్టండి. కనీసం ఫ్రెండ్ లా అయినా నన్ను ట్రీట్ చెయ్యలేరా”
“పరిచయం లేని వాళ్ళతో స్నేహం చెయ్యలేను. ఐ యాం సారీ. ఇంకెప్పుడూ నాకు కాల్ చెయ్యకండి. అసలింత వరకూ రావడం కూడా తప్పే. కానీ మీరు పదేపదే ఫోన్స్ చేస్తారేమో అని చెయ్యొద్దు అని చెప్పడానికే వచ్చాను. నాకు ఇలాంటివి నచ్చవు. దయచేసి ఇంతటితో వదిలెయ్యండి”  గబగబా  ముందుకునడిచాను.
“అది కాదండీ. జస్ట్ లెటర్స్ రాస్తాను. రిప్లై ఇవ్వండి చాలు”
“ప్లీజ్. నా వెంట రాకండి. ఎవరన్నా చూస్తే బాగోదు”
“మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి, బట్ నేను మనస్పూర్తిగా చెప్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం”
నేనేమీ మాట్లాడకుండా స్టేషన్ బయటకు వచ్చి ఆటో కోసం నిల్చున్నాను. అతను వెంటే వున్నాడు.
“ప్లీజ్ చందన, ఉత్తరాలు రాస్తే ఏమవుతుంది. మీకు నేను నచ్చితేనే కదా. మీ పేరెంట్స్ ఒప్పుకుంటేనే కదా పెళ్లి. ముందు స్నేహం చెయ్యడానికి ఏముంది?”

ఆటో వచ్చి ఆగింది. నేను వెంటనే ఎక్కి పోనిమ్మన్నాను. ఆటో డ్రైవర్ ముందు సీన్ ఎందుకు అనుకున్నాడో ఏమో “సరే చందన, బై..నేను చెప్పింది ఆలోచించండి” అన్నాడు. ఆటో ముందుకుకదిలింది.
హాస్టల్ కి ఎలా వచ్చానో, రూం కి ఎలా చేరుకున్నానో ఇక ఏమీ గుర్తులేదు. అడ్డంగా మంచం మీద పది ఏడవడం మొదలు పెట్టాను.ఎంత తప్పు చేసాను పిలవగానే అతని ఉద్దేశం ఊహించి కూడా వెళ్లాను.ఛీ ఛీ ఏమయింది నాకు అని ఆలోచిస్తూ ఆ రాత్రి అంతా భారంగానే గడిపాను. ఫ్రెండ్స్ అడిగితే పిన్ని వాళ్ళింట్లో డిన్నర్ చేసాను అని మెస్ కి కూడా వెళ్ళలేదు. ఒక వారం పట్టింది నాకు మామూలు అవడానికి. ఈ లోగా ప్రాక్టికల్స్ పూర్తయ్యి సెలవులిచ్చారు. ఇంటికి వెళ్లిపోయాను.

సెలవుల్లో ఇంట్లో వున్నప్పుడు అతను గుర్తొచ్చి చాలా గిల్టీగా ఫీల్ అయేదాన్ని ఎందుకు స్టేషన్ కి వెళ్ళానా అని. సెలవులు పూర్తి అయి కాలేజికి వచ్చేసాను.
 
నా హాస్టల్ అడ్రెస్ కి  రెండు ఉత్తరాలు వచ్చాయి. నాకు మామూలుగా లెటర్స్ రాసే వాళ్ళ నుండి కాదని కవర్స్ చూస్తే అర్ధం అయింది. అతనే అయి ఉంటాడు అనుకుంటూనే ఓపెన్ చేసాను. నా క్షేమ సమాచారాలు అడుగుతూ తన కాలేజీ విషయాలు రాసాడు. ఆఖర్లో తప్పకుండా రిప్లై ఇవ్వమని తన అడ్రెస్ ఇచ్చాడు. రెండో ఉత్తరం కూడా ఇంచు మించు అలానే వుంది. నేను రిప్లై ఇవ్వలేదు. అలా ఒక నెల గడిచింది. ఇక అతని గురించి మరచిపోతున్న టైం లో మళ్ళీ ఒక శనివారం మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. నాకు అతనే ఏమో అనిపించి నా ఫ్రెండ్ ఒకమ్మాయి తో మాట్లాడించాను (అంతకుముందు ఆ అమ్మాయికి జరిగిన విషయం చెప్పి తిట్లు కూడా తిన్నాను). చూస్తే అతనే ఫోన్ చేసింది. నా ఫ్రెండ్ అతనికి నేను హాస్టల్ లో లేను అని చెప్పింది. హాస్టల్ ఖాళీ చేసి మా పిన్ని వాళ్ళింటికి షిఫ్ట్ అయానని చెప్పి ఇంకెప్పుడూ కాల్ చేయొద్దు అని చెప్పి కట్ చేసింది. తర్వాత అతని నుండి ఇక ఫోన్ కానీ, ఉత్తరం కానీ రాలేదు. నా ఫైనల్ ఇయర్ అయిపోయి ఆ ఊరు నుండి వచ్చేసాను.
 
ఈ కథ ఇక్కడితో కంచికి వెళ్ళిపోయింది.



No comments:

Post a Comment