Friday, February 3, 2012

వెంగళప్ప – హైదరాబాద్ యాత్ర

వెంగళప్ప ఈ మధ్య ఒక సారి హైదరాబాద్ వెళ్ళాడు…అక్కడ అన్ని ప్రదేశాలు చూడడం అయింది…తన తిరుగు ప్రయాణానికి ఇంకా ఒక రోజు టైం వుండటం తో ఏం చేయాలా అని ఆలోచించాడు…ఎన్నికలొచ్చే సమయం కదా ఒక్కో పార్టీ వాళ్ళు ప్రజలని ఐస్ చేసుకోడానికి ఏం ప్లాన్స్ వేస్తున్నారా అని తెల్సుకోవాలనుకున్నాడు…వాళ్ల వాళ్ల పార్టీ ఆఫీసులకి బయల్దేరాడు….
ముందుగా రూలింగ్ పార్టీ ఆఫీసు కి వెళ్ళాడు…అక్కడ వరండా లో నలుగురయిదుగురు ముంబై జనాలు కనిపించారు…వాళ్ల మాటలని బట్టి వాళ్ళో ప్రముఖ బాలీవుడ్ హీరో దగ్గర పని చేసే స్టాఫ్ అని తెల్సుకున్నాడు…వీళ్ళకిక్కడేం పనా అని ఆలోచిస్తూ మెయిన్ డోర్ దగ్గర కెళ్ళాడు….డోర్ వేసుంది…
లోపల నుండి “పుచుక్…పుచుక్…మ్మ్మ్చ్…మ్మ్మ్చ్…చుప్…చుప్…” మంటున్న శబ్దాలు వినిపిస్తునాయి..వెంగళప్ప అనుకున్నాడు “హతవిధీ….దేవుడి అతిధి గృహాల్లోనే అనుకున్నాను, ఆఖరికి పార్టీ ఆఫీసులో కూడా మొదలెట్టారా ఈ ఛండాలం” అనుకుంటూ యధాలాపంగా తలుపు నెట్టాడు….కిర్రు మంటూ కొంచెం తెరుచుకుంది…
లోపల సీన్ చూసి వెంగళప్ప ఊపిరి పీల్చుకున్నాడు తను అనుకున్నట్టు అక్కడ ఏం పాడుపనులు జరగట్లేదు….ఒక కుర్చీలో ఎవరో ముసలాయన కళ్ళకి గంతలు కట్టుకుని కూర్చున్నాడు….ఆయన పక్కనే ఒక బాన పొట్టేసుకుని ఒక భారికాయం ముసలాయనకి చిలకలు చుట్టిస్తున్నాడు.. ఎదురుగా రాజా వారు బాలీవుడ్ ముద్దుల స్పెషలిస్ట్ హీరో ఇమ్రాన్ హష్మి దగ్గర నుండి ముద్దులు ఎలా పెట్టాలో నేర్చుకుంటున్నారు…(స్మూచ్ లు కాదు ఫ్లయింగ్ కిస్సులు మాత్రమే)….
ముసలాయన పక్కనున్న శాల్తిని అడిగాడు ” Waatzz Happening???  8)  ”…పక్కనున్న శాల్తి చెప్పాడు “కిస్సింగ్ కిస్సింగ్”….
ముసలాయన ఊపిరి పీల్చుకుని “Ohh thattaa….I thought whaatto whaatt ” అనుకుంటూ చిలకలు తినడం లో లీనమయిపోయాడు….
వెంగళప్ప కి అప్పుడు అర్ధమయింది బయట ముంబై జనాలు ఎందుకున్నారో…రాజా వారిని అనుమానించినందుకు లెంపలు వేసుకుని అక్కడ నుండి బయల్దేరాడు….
**********************************************************************
తర్వాత ప్రతిపక్ష పార్టీ ఆఫీసుకి చేరుకున్నాడు….అక్కడ జనాలు చాలామంది  లోపలికి బస్తాల కొద్దీ జీడిపప్పు, పిస్తాపప్పు, పెట్టెల నిండా పళ్ళూ, పెద్ద పెద్ద డేగిసాల నిండా నాన్-వెజ్ కూరలూ, ఏవేవో సీసాలు మోసుకెళ్తున్నారు…బహుశా లోపల విందు ఏమన్నా జరుగుతుందేమో అని గుమ్మం దగ్గరకి వెళ్ళాడు…అక్కడ లోపల,
హనుమాన్ వ్యాయామశాల నుండి వచ్చిన నలుగురు వస్తాదులు కండలు చూపిస్తూ, తొడలు చరుస్తూ గుండ్రంగా తిరుగుతున్నారు…వాళ్ల మధ్యలో బిక్కచచ్చిపోయిన ఒక శాల్తి ని చూడగానే వెంగళప్ప గుర్తుపట్టేసాడు….ఎన్నో సినిమాల్లో తొడలు కొట్టి, ఆ శబ్దం తోనే విలన్ల ఆట కట్టించిన ఒక సూపర్ హీరో ఆయన…మరి ఇదేంటబ్బా ఇలా నీరసంగా ఇప్పుడో ఇంకాసేపో అన్నట్టున్నాడు అని ఆశ్చర్యపోయాడు…
ఇంతలో పక్క గదిలో నుండి ఆ హీరో గారి వియ్యంకుడు అక్కడికి వచ్చి “ఏంటి బామ్మరిది, సినిమాల్లో అయితే తొడలు కొట్టి ఎదుటి వారికి చెమటలు పట్టిస్తావు, ఇక్కడేమో ఒక పది సార్లు తొడ కొట్టగానే నీరసించి పోయావు, నీ కోసం చూడు ఎలాంటి వస్తాదులని పిలిపించానో…వీళ్ళు తొడలు ఎన్ని రకాలుగా కొట్టగలరో చూపిస్తారు నీకు…బాబ్బాబూ …అవన్నీ నేర్చుకుని, ఆ తిండి అంతా తిని బలం తెచ్చుకుని ప్రాక్టీసు చెయ్యి బాబూ” అన్నాడు…
అప్పుడు హీరో గారు పెద్దగా రంకె వేస్తూ “నీకు మా తోబుట్టువునిచ్చాం….మొద్దులాంటి నీ కొడుక్కి సన్నజాజి తీగ లాంటి నా కూతురినిచ్చాను…కట్నం గా నా ఆస్తినిచ్చాను…అది చాలదన్నట్టు నా  అభిమానుల అండదండలను ఇచ్చాను…ఎహే ఎహేహే…అయినా నీకు తృప్తి లేదు” అని అన్నాక అంతలో తను పిల్లనిచ్చుకున్న తండ్రి అని గుర్తొచ్చి సౌండ్ తగ్గించి ప్రాధేయపడుతునట్టుగా గొంతు మార్చుకుని ” అది కాదు బావా, సినిమాల్లో  మేము నిజంగా మా తొడలు మేము కొట్టుకుంటామనుకున్నావా…కానే కాదు…డ్రెస్సు లొపల కుషన్స్ పెట్టుకుని పని కానిచ్హేస్తాం…కెమెరా మాయలో జనాలకి తేడా తెలీదు…కానీ ఇక్కడ లైవ్ షోల్లో జనాల మధ్య ఆ జిమ్మిక్కులు పని చెయ్యవు….తొడ కొట్టీ కొట్టీ చూడు నా కాళ్ళు ఎలా వాచిపొయాయో, ఇక చాలు బావా నా వల్ల కాదు…పోనీ ఈ ట్రైనింగ్ ఏదో అన్నయ్య పిల్లలకి ఇప్పించి వాళ్ళని జనాల మీదకి వదలొచ్చు కదా, వాళ్లింకా చిన్నపిల్లలే కాబట్టి కొంత బలంగా వుంటారు” అని గగ్గోలు పెట్టాడు…
ఇదేదో బాగుంది అనుకుంటూ వియ్యంకుడు ఫోన్ దగ్గరకి నడిచాడు నెక్స్ట్ ఎవరికి ఈ తొడ కొట్టే బాధ్యత ఒప్పచేప్దామా అనుకుంటూ….సినిమాల్లో హీరో గారి తొడ కొట్టడం వెనక వున్న మతలబు అర్ధమయిన వెంగళప్ప ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుండి బయటపడ్డాడు…
***********************************************************************
తర్వాత వెంగళప్ప ఈ మధ్యే సినిమాల్లో నుండి రాజకీయాల్లోకి ప్రవేశించి స్వతంత్రంగా పార్టీ పెట్టిన ఒక సూపర్ హీరో గారి పార్టీ ఆఫీసు చేరుకున్నాడు…
ఇక్కడ బయట ఎలాంటి హడావుడి లేదు…దిక్కులు చూసుకుంటూ మెయిన్ డోర్ దగ్గరకి చేరుకున్నాడు వెంగళప్ప…లోపల నుండి ఒక పసిపాప కేరింత వినిపిస్తోంది…విషయం ఏంటా అని  లోపలికి తొంగి చూసాడు…అక్కడ మన హీరో గారు మనుమరాలిని ఒడిలో కూర్చోపెట్టుకుని ఆడిస్తున్నారు…ఆ పాప తాతగారి మీసాలు పట్టుకుని తెగ గుంజేస్తోంది….ఎంత నొప్పిగా వున్నా ఒర్చుకుంటున్నారు హీరో గారు….హీరో గారి బామ్మరిది వచ్చి పాపని  తీసుకెళ్ళబొయాడు…
అప్పుడు హీరో గారు “ఆహా వద్దు బామ్మరిది, కాసేపు లాగనీ” అన్నాడు…
“అదేంటి బావా నొప్పిగా లేదూ…..ఏంటో వీళ్ళ అమ్మ ఏమో నిన్ను ఎదిరించి పెళ్లి చేసుకుని నిన్ను బాధ పెట్టింది..ఇప్పుడేమో వేలెడంత లేదు ఈ పిల్ల నీ మీసాలు గుంజి తెగ ఇబ్బంది పెడుతోంది” అన్నాడు బామ్మరిది…
“చ చ అదేం కాదు బావా, బాధ వుంది కాదనను, కానీ దీని వలనే నాకో గొప్ప లాభం జరిగింది…వీళ్ళమ్మ నన్ను కాదన్నా తను చేసిన పని వలన ఆంధ్ర దేశంలో వున్న ఆడపిల్లల తండ్రులందరి దగ్గరా నాకు సానుభూతి దొరికింది…ఇక పాప మీసం గుంజటం అంటావా…తను అలా చెయ్యడం వల్లనే కదా నాకు మీసం దగ్గర అల్లెర్జి వచ్చి అప్పుడప్పుడూ దురద పెడుతుంది…మీసం గోక్కునే వంకతో మీసం మీద చెయ్యి వెయ్యగానే నేను మెలేశాననుకుని అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతారు…నాకంటూ ఒక మేనరిజం అలవాటయింది కదా…అంతా ఈ పసి దాని చలవే” అని పాపని తెగ ముద్దు చేసారు…
చూస్తున్న వెంగళప్ప కి మెదడు మొద్దుబారిపోయింది….ఇంకా కాసేపు ఇక్కడ వుంటే పిచ్చెక్కడం ఖాయమని అక్కడ నుండి జంప్ జిలాని అనుకుంటూ తప్పుకున్నాడు….
***************************************************************************
ఇక ఫైనల్ గా ఒక ప్రాంతీయ పార్టీ ఆఫీసు కి చేరుకున్నాడు వెంగళప్ప….
బయట ఏమీ హడావుడి లేదు కానీ లోపల నుండి పెద్ద పెద్దగా సౌండ్స్ వినిపిస్తున్నాయి వీధిలో పోయే వాళ్ళకి కూడా…ఏం చేస్తున్నారా వీళ్ళు లోపల అని వెంగళప్ప తొంగి చూసాడు…లోపల హాల్లో ఒక పెద్ద హోం థియేటర్…అందులో ప్లే అవుతున్న ఒక ఇంగ్లీష్ యాక్షన్ సినిమా…ఇంకా ఆ చుట్టు పక్కల వందల కొలదీ ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఒకటేమిటి అన్ని బాషలలోని యాక్షన్ చిత్రాల డీవీడీ లు కుప్పలు కుప్పలుగా పడివున్నాయి….
ఆ సినిమా చూస్తూ సోఫాలో కూర్చున్న అన్నయ్య, చెల్లెలు మాట్లాడుకుంటున్నారు…
అన్నయ్య: ధూ తేరి….ఇన్ని సినిమాలు చూసిన…. నాకు సూట్ అయే ఒక్క మేనరిజం లేదే…అప్పుడెప్పుడో నా పెండ్లాం మీసం లేకపోతే హిందీ హీరో లెక్కుంటావ్…బక్కగా వుంటేనే నీ ఆరోగ్యానికి మంచిదని నా దిమాగ్ కెక్కించి నన్నిట్ల జేసింది…ఇప్పుడు తిప్పుకోడానికి మీసాలు లేకపోయె, తొడ కొట్టుకోనీకి బలం లేకపోయె…గాల్లో ముద్దులిసర్టం రాక పోయే..గెట్లా సచ్చేది నేను
చెల్లి: అన్నా…నువ్వు ఫికర్ జెయ్యకే….ఇంకా మనం చూడాల్సిన సినిమాలు మస్తున్నాయ్…ఏదో ఒకటి దొరక్కపోదు…నాకోదిలేయ్..
అన్నయ్య: చ, నిన్ను నమ్మి కదూ నేనిట్లయింది…ఆ హీరోలిద్దరి తోటి ఎన్ని సినిమాల్లో ఆడి గంతులేస్తివి…నువ్వే హీరో లెక్కన ఎన్ని సినిమాల్లో జేస్తివి…అయినా నాకొక్క మేనరిజం నేర్పించలేకబోయినావ్…ఎట్టనే రాములమ్మ నీతో…ఆ రాజమ్మ ని చూడు…నీ తర్వాత వచ్చింది సినిమాల్లోకి…నీకంటే వయసులో చిన్నది…అయితేనేం రోజుకో సారి అవతలి పార్టీ వాళ్ళని కడిగి పారేస్తది…(నన్ను కూడా అనుకో)….నువ్వేమో అమావాస్యకి, పున్నమికి జనాల మధ్యకి వెళ్లి నాలుగు సినిమా డయలాగులు చెప్పి వచ్చేస్తావ్…
చెల్లి: (విషయం పక్క దారి పడుతోంది అని గ్రహించి) అన్నా నాకు కొంచెం పనుందే…నువ్వు జూస్తుండు సినిమా…నేనిప్పుడే వస్తా
అంటూ పక్కకి తప్పుకుంది….
వెంగళప్ప బుర్ర గోక్కుంటూ బయటపడ్డాడు….
*******************************************************************************

No comments:

Post a Comment