Friday, February 3, 2012

అమ్మ మనసు

మా అమ్మ ద్వారా అమ్మ మనసు, అమ్మ ప్రేమ ఎలా వుంటుందో నేను చూసాను, అనుభవించాను అని అనుకున్నాను సంవత్సరం క్రితం వరకూ. ఆ ప్రేమలో వుండే మాధుర్యం, ఆ మనసులోని మమత అయితే అర్ధం చేసుకోగాలిగానేమో కానీ ఆ మనసు కొన్ని సందర్భాలలో పడే వేదన ఏంటో మాత్రం నేను అమ్మనయ్యాకే అర్ధమవుతోంది నాకు. అమ్మ తన బిడ్డకు ఏదయినా కష్టం వచ్చినప్పుడు బాధ పడడం, వేదన చెందడం తెల్సు కానీ ఏ పసి బిడ్డని చూసినా తన బిడ్డ గుర్తుకురావడం, ఆ పసికందు బాధని చూసి తల్లడిల్లడం నేను అమ్మనయ్యాకే అనుభవమవుతోంది.
 
పండు తల్లి పుట్టక ముందు నేనెప్పుడూ పసి పిల్లలని ఆడించలేదు, కనీసం ఎత్తుకోలేదు. అసలు ఆ అవకాశం రాలేదు, ఒక వేళ వచ్చినా భయపడేదాన్నేమో.ఎప్పుడో చిన్నప్పుడు మామయ్య కొడుకుని ఎత్తుకున్నాను కానీ ఎక్కువ సేపు లేదు. వాళ్ళ పనులు ఎలా చెయ్యాలో కూడా తెలీదు, ఎవరన్నా చేస్తే గమనించలేదు.
పిల్లల్ని లాలించడం, పెంచడం అంతా ప్రకృతే నేర్పిస్తుంది అని ఈ సంవత్సరం రోజుల్లో నాకు అర్ధమయింది. ఇప్పుడు నాకు ఏ పాప/బాబు ని చూసినా నా పండు తల్లే గుర్తొస్తుంది. ఆ పాప/బాబు ఏడుస్తుంటే బాధేస్తుంది. ఇంతకు ముందు అలాంటి సంఘటన చూసినప్పుడు అయ్యో అనుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఆ బాధ నా మనసుని తాకుతోంది. ఎంతలా అంటే నా మనసులోని ఆ బాధ కళ్ళల్లో నుండి ప్రవహించే అంత. పేపర్ లో ఎవరన్నా బిడ్డని చెత్త కుండీలో వేసి వెళ్ళారని వార్త చదివిన రోజు గుండెను మెలిపెట్టినంత బాధగా వుంటుంది. ఆ పసికందుకి వచ్చిన కష్టం నేను తీర్చలేను. కానీ ఆ కష్టం వాళ్ళ నాకు కలిగే వేదన, బాధ చెప్పలేనంత తీవ్రంగా ఉంటోంది. ఆ బిడ్డ కూడా నా పండు తల్లి లాంటిదే కదా, ఎందుకీ కష్టం వచ్చింది అన్న బాధ.
 
మొన్నో రోజు ఆటో లో వస్తుంటే రోడ్ మీద ట్రాఫ్ఫిక్ జామ్ అయింది. ఒక పావుగంట సేపు ఆటో ఆగిపోయింది. పక్కనే ఫ్లయ్ ఓవర్ కింద ఒక కుటుంబం. పిల్లలు ఆడుకునే బెలూన్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ఆ కుటుంబంలో తల్లీ, తండ్రి, ఇద్దరు బిడ్డలు వున్నారు. ఒకరు మూడు నాలుగేళ్ల వాడు. పాపకి రెండేళ్ళు ఉంటాయేమో. వాళ్ళ అమ్మ నాన్న ట్రాఫిక్ లో ఆగిపోయిన వాహనాల దగ్గరకి వచ్చి బెలూన్స్ అమ్ముకుంటూ వుంటే పిల్లలిద్దరూ అటూ ఇటూ పరిగెడుతూ వున్నారు. పండు తల్లి పుట్టక ముందు అయితే ఇలాంటి దృశ్యాలని పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఈ సారి మాత్రం నాకు ఎంత టెన్షన్ కలిగిందో  చెప్పలేను. సడెన్ గా ఏ బండి కదిలి వాళ్ళు దానికి అడ్డం పడి దెబ్బ తగిలించుకుంటారో అని. ఇంట్లో పండు గాడిని క్షణం కనిపెట్టుకోకుండా వున్నా ఏదో ఒక చోట పడి దెబ్బలు తగిలించుకుంటాడు. అలాంటిది వాళ్ళ అమ్మ నాన్న ఆ పిల్లలని రోడ్ మీద అంత నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేసారు అనిపించింది ఒక క్షణం. ఆ తల్లి కూడా నా లాంటిదే కదా. మరి ఆమెకి నాకున్న ఆదుర్దా ఉండదా అని. ఆ స్థానం లో పండు గాడు వుంటే నాకు ఊపిరి కూడా ఆడేది కాదేమో అనిపించింది. కానీ ఆ తల్లి తండ్రులు అంత కష్టపడేది ఆ పసి పిల్లల జానెడు పొట్ట నింపడం కోసమే కదా. పొట్ట కూటి కోసం అంత పసి పిల్లల గురించి వాళ్ళకున్న కేర్ ని ప్రదర్శించలేని వాళ్ళ నిస్సహాయత తలచుకుంటే దిగులేసింది. ఇంటికి వచ్చాక కూడా చాలా సేపు ఈ సంఘటన గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను.
 
ఇంతకు మునుపు నేను కేవలం ఒక మనిషిగానే అలోచించేదాన్ని. ఇప్పుడు ఒక తల్లిలా ఆలోచిస్తున్నాను. రెండిటికీ చాలా తేడా వుంది కదా.

No comments:

Post a Comment