Friday, February 3, 2012

బంతి భోజనాలు

మీరు బంతి భోజనం తిని ఎన్నాళ్ళయింది? నేనయితే రెండేళ్ళ క్రితం సంక్రాంతి పండక్కి వచ్చినప్పుడు మా అజుభాకి  పంచెలు ఇచ్చే ఫంక్షన్ కరటంపాడు (అమ్మమ్మ వాళ్ళ ఊరు) లో చేసినప్పుడు అక్కడ మా ఇంట్లో చుట్టాలందరితో కలిసి బంతి భోజనం చేసాను…..మళ్ళీ ఇన్నాళ్ళకి నిన్న కిట్టయ్య వాళ్ళ అక్క పెళ్లి రిసెప్షన్ లో ఇలా బంతి భోజనం అనే కాన్సెప్ట్ ని చూసాను…పెళ్లి మండపం లో నుండి డైనింగ్ హాల్ లోకి అడుగుపెట్టగానే నా కళ్ళు రెండు తళుక్కున మెరిసాయి :D ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పలేను…అరిటాకుల్లో భోజనం, అదీ వంటవాళ్లు వండి వడ్డిస్తుంటే చాలా బాగా అనిపించింది….
ఈ మధ్య ఎక్కడ చూసినా బయట హోటల్ వాళ్ళకి ప్లేట్ కి ఇంత అని లెక్కకట్టి ఆర్డర్ ఇవ్వడం…వాళ్ళు వండినవన్నీ డబ్బాల్లో సర్దుకు రావడం, ఆ తెచ్చిన డబ్బాలని మన కళ్ళ ముందే మళ్ళీ స్టవ్ పెట్టి వేడి చేయడం, మనమేమో జైల్లో ఖైదీల్లా బొచ్చ పట్టుకుని క్యూ లో నిల్చోడం :mad: కేటరింగ్ వాళ్ళ ముందు ప్లేట్ పెట్టగానే వాళ్ళు కొంచెం వడ్డించడం, తర్వాత ఏదో పక్కకెళ్ళి నిల్చుని గబ గబ తిన్నామనిపించడం ఇంతే ఏ భోజనానికి వెళ్ళినా….వంట వాళ్ళు, గాడి పొయ్యిలు, కూరగాయలు తరగడం ఈ సందడి వుండట్లేదు ఎక్కడా… పల్లెటూర్లలో అయితే ఇంకా బంతి భోజనాలు కనిపిస్తూనే వున్నాయి…అక్కడ ఈ కేటరింగ్ వాళ్ళ నీడ ఇంకా పడలేదు కాబట్టి….రాను రాను అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే చూస్తామేమో…
ఎక్కువమంది ఆహ్వానితులు వచ్చినప్పుడు ఈ పద్ధతి హోస్ట్ కి సౌకర్యంగా వుంటుంది, కాదనలేము….కానీ ఇప్పటి పరిస్థితుల్లో యాభయి, వంద మందిని పిలిచినా కూడా కేటరింగ్ ఇంకా బుఫే పద్దతే పాటించేస్తున్నారు…..రేపు మా ఇంట్లో ఏదయినా ఫంక్షన్ జరిగినా ఇదే చేస్తాము.. వంటవాళ్ళని పెట్టొచ్చు కదా అంటే ఇప్పుడు ఎవరు దొరుకుతున్నారే అంత ఓపిగ్గా వంటలు చేసి వడ్డించేవాళ్ళు  అంటారు …ఇదీ నిజమే…వంట కాన్సెప్ట్ పెట్టుకుంటే ఇంట్లో ఆడవాళ్ళందరికీ ఈ వంటింటి పనులూ, వంట చేసే వాళ్లకి అవీ ఇవీ అందించడం ఈ పనులతో ఫంక్షన్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేరు….కేటరింగ్ వాళ్లకి పని ఒప్పచేప్పేస్తే ఇక భోజనాల గురించి ఆలోచించక్కర్లేదు….నిజమే, సులభమయిన పద్దతి లో మనకి కావాల్సిన పనులు అయిపోతుంటే ఎవరు మాత్రం ఇంత బాధ్యత తీసుకోవాలనుకుంటారు??? రేపు నేనయినా ఇంతే ఏమో :(
కానీ చుట్టాలందరితో బంతి లో కూర్చుని అరిటాకుల్లో భోంచేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, కావాల్సినవన్నీ మన దగ్గరకే తీసుకొచ్చి వడ్డించి కొసరి కొసరి కడుపునిండా తినిపించే బంధువులతో ఫంక్షన్ ని ఎంజాయ్ చేసే రోజులు కనుమరుగవుతున్నాయంటే బాధగానే వుంటుందిగా మరి :oops:

No comments:

Post a Comment